freighter services
-
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్‌లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
పోర్టుల ద్వారా ఆదాయం రూ.265 కోట్లు
సాక్షి, అమరావతి: ఓ పక్క కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర పోర్టులు సరుకు రవాణాలో గణనీయమైన ప్రగతిని కనపర్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2021–22లో 5 పోర్టులు (విశాఖ పోర్టు కాకుండా) ద్వారా 87.54 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం రూ.265.44 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా ముందుకాలం 2019–20 ఆదాయంతో పోలిస్తే ఆదాయంలో 17 శాతం వృద్ధి నమోదైంది. 2019–20లో ఈ అయిదు పోర్టుల ఆదాయం రూ.226.82 కోట్లు. రాష్ట్రంలో విశాఖపట్నం మేజర్ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఇందులో కాకినాడ వద్ద ఉన్న మూడు పోర్టులు యాంకరేజ్, డీప్ వాటర్, రవ్వ పోర్టుల ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డుకు రూ.185.26 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టుల ఆదాయం గతేడాదితో పోలిస్తే పెరిగింది. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా ప్రభుత్వానికి రూ.60.10 కోట్లు, రవ్వ పోర్టు ద్వారా రూ.4.59 కోట్లు వచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న పోర్టుల ఆదాయంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. అదానీ గ్రూపు కొనుగోలు చేసిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల ద్వారా రూ.80.18 కోట్ల ఆదాయం వచ్చింది. గంగవరం పోర్టు ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.25.29 కోట్లు, కృష్ణపట్నం పోర్టు ద్వారా రూ.54.89 కోట్ల ఆదాయం సమకూరింది. స్పల్పంగా తగ్గిన సరుకు రవాణా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్ర పోర్టుల సరుకు రవాణాలో స్వల్ప క్షీణత నమోదైంది. 2020–21లో 5 పోర్టుల ద్వారా 89.24 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగ్గా 2021–22లో 87.54 మిలియన్ టన్నుల రవాణా జరిగింది. కోవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక లావాదేవీలు నెమ్మదించడం దీనికి కారణమని మారిటైం బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా కృష్ణపట్నం పోర్టు నుంచి 40.124 ఎంటీల సరుకు రవాణా అయింది. గంగవరం నుంచి 30.04 ఎంటీలు, కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 2.91 ఎంటీలు, డీప్‌వాటర్ పోర్టు నుంచి 13.61 ఎంటీలు, రవ్వ నుంచి 0.86 ఎంటీల సరుకు రవాణా జరిగింది. -
‘లాజిస్టిక్స్’కు పరిశ్రమ హోదా
సాక్షి, అమరావతి: సరుకు రవాణాలో కీలకమైన లాజిస్టిక్ రంగానికి పరిశ్రమ హోదాను కల్పిస్తూ ఇందులోకి భారీగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ లాజిస్టిక్ పాలసీ 2022–27ను రూపొందించింది. రాష్ట్రం మీదుగా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ లాజిస్టిక్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీలో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ రంగంలో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను ఈ ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం.. రవాణాను చౌకగా అందించడం ద్వారా లాజిస్టిక్ రంగంలోనూ మొదటిస్థానంలో ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గోడౌన్ల సామర్థ్యం నాలుగురెట్లు పెంపు లాజిస్టిక్ రంగంలో కీలకమైన గోడౌన్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పాలసీ కాలపరమితిలోగా నాలుగు రెట్లు పెంచనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.38 లక్షల టన్నులుగా ఉన్న గోడౌన్ల సామర్థ్యాన్ని 2027 నాటికి 56 లక్షల టన్నులు చేయనుంది. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి పట్టణాల్లో డిమాండ్ అధికంగా ఉందని.. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. ఆక్వా, హార్టికల్చర్ రంగాల ఎగుమతులు పెరుగుతుండటంతో శీతల గిడ్డంగుల డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. దీంతో.. ప్రస్తుతం రాష్ట్రంలో 15.67 లక్షల టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు మాత్రమే ఉన్నాయి. అపెడా, ఎంపెడా సహకారంతో ఈ రంగంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకూ ప్రణాళికలను సిద్ధంచేసింది. వీటితో పాటు ఇన్లాండ్ కంటైనర్ స్టోర్లు, ఫ్రీ ట్రేడ్వేర్ హౌసింగ్ జోన్లు వంటి సౌకర్యాలను ప్రోత్సహించనుంది. పోర్టులపై భారీ పెట్టుబుడులు మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.20,000 కోట్ల వరకు వ్యయం చేయనుంది. ఇదే సమయంలో ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా సరుకు రవాణాను 5 టన్నుల నుంచి 10 టన్నులకు పెంచనుంది. అలాగే, విశాఖ భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు దగదర్తి వద్ద 1,868 ఎకరాల్లో సరకు రవాణా లక్ష్యంగా మరో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక కంటైనర్లు వేగంగా ప్రయాణించేందుకు జాతీయ రహదారులను భారీగా విస్తరించడంతో పాటు 16, 65, 48, 44 జాతీయ రహదారుల పక్కన ట్రక్కులు నిలుపుకోవడానికి ట్రక్ పార్కింగ్ బేలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థలాలను గుర్తించింది. ఇక్కడ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, రిపేర్లు, ఇంథనం నింపుకోవడం వంటి మౌలిక వసతులూ కల్పిస్తారు. కేవలం సరుకు రవాణా కోసం ఖరగ్‌పూర్–విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ–నాగపూర్–ఇటార్సి (975కి.మీ)లను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. అలాగే, ప్రధాన పారిశ్రామికవాడలైన కొప్పర్తి, ఓర్వకల్లు, శ్రీకాళహస్తిలను రైల్వేలైన్లతో అనుసంధానం చేస్తోంది. ఎంఎంఎల్‌పీల అభివృద్ధి ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయాన్ని మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల (ఎంఎంఎల్పీ) ఏర్పాటు ద్వారా 8 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం.. ► కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రం, ప్రైవేటు రంగంలో వాటిని అభివృద్ధి చేయనున్నారు. ► ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయనుండగా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద మరో ఎంఎంఎల్పీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ► వీటితో పాటు పారిశ్రామికవాడల్లో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేసి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఏపీఐఐసీ ఆహ్వానిస్తోంది. ► అలాగే, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులతో పాటు ఓర్వకల్లు, హిందూపురం, దొనకొండ, ఏర్పేడు–శ్రీకాళహస్తి నోడ్ల వద్ద ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలనూ సిద్ధంచేస్తోంది. ► ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం భూమిని ఎంఎంఎల్‌పీలకు కేటాయించడమే కాకుండా 2020–23 పారిశ్రామిక పాలసీ ప్రకారం ఇతర రాయితీలను అందించనుంది. ప్రతీ 50–60 కి.మీ ఒక పోర్టు ప్రస్తుతం విశాఖ మేజర్పోర్టుతో కలిపి ఆరు పోర్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించనున్న భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులతో మొత్తం పోర్టుల సంఖ్య 10కి చేరుతుంది. ఇలా ప్రతీ 50–60 కి.మీ.కు ఒక పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుగుణంగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు లాజిస్టిక్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్ ప్రమోషన్ పాలసీ–2022–27ను తీసుకొస్తున్నాం. – గుడివాడ అమరనాథ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మరిన్ని ఎంఎంఎల్‌పీల అభివృద్ధికి ప్రణాళిక సరుకు రావాణా వ్యయంలో లాజిస్టిక్స్ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని విశాఖ, అనంతపురంలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రాష్ట్రంలో మరిన్ని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో లాజిస్టిక్స్ గణాంకాలు.. ► రాష్ట్రంలో రహదారుల దూరం : 13,500 కి.మీ ► జాతీయ రహదారుల్లో 7 శాతం వాటాతో వాటి దూరం : 7,340 కి.మీ ► మన రాష్ట్రంలో రైల్వే లైన్ల దూరం : 7,715 కి.మీ ► ఏపీలో వేర్ హౌసింగ్ గిడ్డంగుల సామర్థ్యం : 13.38 లక్షల టన్నులు ► శీతల గిడ్డంగులవి : 15.67 లక్షల టన్నులు ► కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు మొత్తం : 17 ► ఇన్లాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీఎస్) : 3 ► ఎయిర్ కార్గో టెర్మినల్స్ : 5 ► రైల్–రోడ్ గూడ్స్ షెడ్లు : 283 ► లాజిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లు : 16 ► మన పోర్టుల సరుకు నిర్వహణ సామర్థ్యం : 172 మిలియన్ టన్నులు -
పోర్టుల్లో సరుకు రవాణా డీలా
న్యూఢిల్లీ: గత నెలలోనూ దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రధాన నౌకాశ్రయాలలో సరుకు రవాణా తగ్గింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య కాలంలో 12 ప్రధాన పోర్టులలో కార్గో ట్రాఫిక్ దాదాపు 7 శాతం క్షీణించింది. 600.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో 643 ఎంటీకిపైగా సరుకు రవాణా నమోదైంది. దేశీ పోర్టుల అసోసియేషన్(ఐపీఏ) రూపొందించిన తాజా నివేదిక వెల్లడించిన వివరాలివి. పారదీప్, మార్మగోవా మినహా మిగిలిన పోర్టులన్నీ కార్గో ట్రాఫిక్‌లో వెనకడుగు వేశాయి. పారదీప్‌లో 0.3 శాతం పుంజుకుని దాదాపు 103 ఎంటీకీ చేరగా.. 31 శాతం వృద్ధితో మార్మగోవా 19.3 ఎంటీ సరుకును హ్యాండిల్ చేసింది. ప్రధానంగా ఎన్నోర్‌లోని కామరాజార్ పోర్ట్ సరుకు రవాణా 23.3 శాతం తక్కువగా 22.23 ఎంటీకి పరిమితంకాగా.. ముంబై, వీవో చిదంబరనార్‌లోనూ 12 శాతం చొప్పున ట్రాఫిక్ తగ్గింది. ఈ బాటలో కొచిన్, చెన్నై పోర్టు 10 శాతం వెనకడుగు వేయగా.. జేఎన్పీటీ 8 శాతం, దీన్‌దయాళ్(కాండ్లా) పోర్ట్, కోల్‌కతా(హాల్దియా) 6 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి. ఇదేవిధంగా న్యూమంగళూరు 5.3 శాతం, విశాఖపట్టణం 4.9 శాతం తక్కువగా కార్గోను హ్యాండిల్ చేశాయి. కాగా.. కోవిడ్–19 నేపథ్యంలో వరుసగా 11వ నెలలో అంటే ఫిబ్రవరిలో సైతం సరుకు రవాణా బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. గత 11 నెలల్లో ప్రధానంగా కంటెయినర్ల హ్యాండ్లింగ్ తగ్గిపోవడంతోపాటు.. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర కమోడిటీల కార్గో భారీగా క్షీణించినట్లు తెలియజేసింది. -
డెడికేటెడ్ కారిడార్‌తో సరుకు రవాణా సులభం
సాక్షి, అమరావతి: రైల్వేలో సరుకు రవాణాకు 1,115 కి.మీ. మేర డెడికేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రైల్వేలో అతిపెద్ద డెడికేటెడ్ కారిడార్ ఇదే కానుంది. మొదటి దశలో సరుకు రవాణా కారిడార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా-కాన్పూర్ మధ్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్ ప్రస్తుతం ఆపరేషనల్ దశలో ఉంది. రెండో దశ కింద విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య 1,115 కి.మీ. మేర నిర్మించేందుకు సాధ్యాసాధ్య (ఫీజబిలిటీ) నివేదికను డీఎఫ్‌సీసీఐఎల్ (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వచ్చే ఏడాది ఆఖరు నాటికి సిద్ధం చేయనుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు ఈ కారిడార్ నిర్మించడానికి రూ.40 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీఎఫ్‌సీసీఐఎల్ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టును 2030 కల్లా పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కారిడార్‌ను చెన్నై-హౌరా మెయిన్‌లైన్‌కు సమాంతరంగా కోస్తా జిల్లాల మీదుగా నిర్మిస్తారు. దీన్ని 2018లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని రైల్వే ఫ్లై ఓవర్ల మీదుగా లేకుండా నిర్మించేందుకు డిజైన్ రూపొందించినట్లు కంటైనర్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఏపీకి వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అన్ని పోర్టులను కలుపుతూ.. ►ఈ డెడికేటెడ్ కారిడార్‌ను విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను అనుసంధానిస్తూ నిర్మిస్తారు. ►పోర్టులకు కనెక్టివిటీ ఉండటం వల్ల అవి అభివృద్ధి చెందడంతోపాటు సరుకు రవాణా ఎంతో సులభతరంగా ఉంటుంది. ►సాధారణంగా సరకు రవాణా రైళ్లు సగటున గంటకు 25-30 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ►డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఈ రైళ్లు 70-80 కి.మీ. వేగంతో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ►డెడికేటెడ్ కారిడార్‌ను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌తో నిర్మిస్తారు. సరుకు రవాణా ఛార్జీలు ఎంతో తగ్గుతాయి.. డెడికేటెడ్ కారిడార్ నిర్మాణంతో సరుకు రవాణా ఛార్జీలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. ఈ కారిడార్ నిర్మాణం ఏపీ పారిశ్రామిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. - ఎంవై యాదవ్, జీఎం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -
రష్యాకు మందులు తీసుకెళ్లిన ఏరోఫ్లోట్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మొదటిసారిగా రష్యాకు చెందిన ఫ్రైటర్ సర్వీస్ ఏరోఫ్లోట్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. 1923 నుంచి ఆపరేట్ అవుతున్న, ప్రపంచంలోనే అత్యంత పురాతన ఫ్రైటర్ సర్వీస్‌లలో ఒకటైన ఈ 50 టన్నుల కార్గో విమానం హైదరాబాద్ నుంచి మాస్కోకు వివిధ రకాల మందులను, వ్యాక్సిన్లను మోసుకెళ్లింది. రష్యా ఫెడరేషన్‌కు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ అయిన ఈ ఏరోఫ్లోట్ (ఎస్‌యూ 7012/ 7013) ఈ నెల 5న ఉదయం 11.17 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 12.03 గంటల సమయంలో తిరిగి వెళ్లింది. ఈ విమానంలో దాదాపు 20 రకా ల ఔషధాలు, వ్యాక్సిన్లను రష్యాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫ్రైటర్ సర్వీస్ కరోనా లాక్డౌన్ కాలానికి మాత్ర మే పరిమితమైనా, దీనిని వారానికి ఒకసారి నడిచే ఫ్రైటర్ సర్వీసుగా మార్చేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఫలిస్తే, హైదరాబాద్ నుంచి రష్యా, ఇతర కామన్వెల్త్ దేశాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు లాక్డౌన్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్ కార్గో ద్వారా పెద్దఎత్తున నిత్యావసరాలు, రిలీఫ్ సరుకులైన ఔషధా లు, ఇంజనీరింగ్, ఐటీ, ఏరోస్పేస్, కన్సోల్ కార్గో రవాణా జరుగుతోంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5,500 టన్నుల కార్గో రవాణా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్వేస్ కార్గో సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్గో సేవలందిస్తున్న ఖతార్ ఎయిర్వేస్ కార్గో.. వైమానిక రవాణా సేవలను కొత్తగా హైదరాబాద్‌తోసహా లండన్ స్టాన్స్టెడ్కు(యూకే) విస్తరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వారంలో రెండు కార్గో సర్వీసులను హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభిస్తోంది. ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులు, ఔషధాలు ప్రధాన ఎగుమతులని కంపెనీ వెల్లడించింది. దోహ-హైదరాబాద్ మధ్య ప్రతిరోజు ఖతార్ ఎయిర్వేస్ ప్యాసింజర్ విమానం నడుస్తున్న సంగతి తెలిసిందే.