పోర్టుల ద్వారా ఆదాయం రూ.265 కోట్లు | Andhra Pradesh ports in progress even during Corona period | Sakshi
Sakshi News home page

పోర్టుల ద్వారా ఆదాయం రూ.265 కోట్లు

Published Sun, Jun 5 2022 5:46 AM | Last Updated on Sun, Jun 5 2022 8:23 AM

Andhra Pradesh ports in progress even during Corona period - Sakshi

సాక్షి, అమరావతి: ఓ పక్క కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర పోర్టులు సరుకు రవాణాలో గణనీయమైన ప్రగతిని కనపర్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2021–22లో 5 పోర్టులు (విశాఖ పోర్టు కాకుండా) ద్వారా 87.54 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం రూ.265.44 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా ముందుకాలం 2019–20 ఆదాయంతో పోలిస్తే ఆదాయంలో 17 శాతం వృద్ధి నమోదైంది. 2019–20లో ఈ అయిదు పోర్టుల ఆదాయం రూ.226.82 కోట్లు.

రాష్ట్రంలో విశాఖపట్నం మేజర్‌ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు, రవ్వ, కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఇందులో కాకినాడ వద్ద ఉన్న మూడు పోర్టులు యాంకరేజ్, డీప్‌ వాటర్, రవ్వ పోర్టుల ద్వారా ఏపీ మారిటైమ్‌ బోర్డుకు రూ.185.26 కోట్ల ఆదాయం సమకూరింది.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్‌ పోర్టు, రవ్వ పోర్టుల ఆదాయం గతేడాదితో పోలిస్తే పెరిగింది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ద్వారా ప్రభుత్వానికి రూ.60.10 కోట్లు, రవ్వ పోర్టు ద్వారా రూ.4.59 కోట్లు వచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న పోర్టుల ఆదాయంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. అదానీ గ్రూపు కొనుగోలు చేసిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల ద్వారా రూ.80.18 కోట్ల ఆదాయం వచ్చింది. గంగవరం పోర్టు ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.25.29 కోట్లు, కృష్ణపట్నం పోర్టు ద్వారా రూ.54.89 కోట్ల ఆదాయం సమకూరింది.

స్పల్పంగా తగ్గిన సరుకు రవాణా
అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్ర పోర్టుల సరుకు రవాణాలో స్వల్ప క్షీణత నమోదైంది. 2020–21లో 5 పోర్టుల ద్వారా 89.24 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరగ్గా 2021–22లో 87.54 మిలియన్‌ టన్నుల రవాణా జరిగింది. కోవిడ్‌ వల్ల ప్రపంచ ఆర్థిక లావాదేవీలు నెమ్మదించడం దీనికి కారణమని మారిటైం బోర్డు అధికారులు తెలిపారు.

రాష్ట్రం నుంచి అత్యధికంగా కృష్ణపట్నం పోర్టు నుంచి 40.124 ఎంటీల సరుకు రవాణా అయింది. గంగవరం నుంచి 30.04 ఎంటీలు, కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి 2.91 ఎంటీలు, డీప్‌వాటర్‌ పోర్టు నుంచి 13.61 ఎంటీలు, రవ్వ నుంచి 0.86 ఎంటీల సరుకు రవాణా జరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement