రాష్ట్ర పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్లలో లభించిన ఆదాయం ఇలా.. (రూ.కోట్లలో)
సాక్షి, అమరావతి: గడచిన ఆర్థిక సంవత్సరంలో పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం లభించింది. కరోనా కాలంలోనూ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదాయాన్ని పొందగలిగింది. విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా.. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈ ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది (2019–20)లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గంగవరం పోర్టు డివిడెండ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37.61 కోట్లు ఇవ్వడం కూడా ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. 2020–21లో ఈ ఐదు పోర్టులు 89.238 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహించడం ద్వారా రూ.3,556.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరం 99.44 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా 5 పోర్టులు రూ.3,639.81 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.
కాకినాడ నుంచే 63 శాతం ఆదాయం
రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం రాగా.. అందులో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఒక్క కాకినాడ నుంచే 62.93 శాతం ఆదాయం వస్తోంది. కొత్తగా కాకినాడ గేట్‌వే పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ఆదాయం మరింత పెరిగే అవకశాం ఉందని మారిటైమ్ అధికారులు పేర్కొంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు 14.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.575 కోట్ల ఆదాయం ఆర్జిస్తే అందులో ప్రభుత్వానికి రూ.126.50 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు ద్వారా రూ.49.88 కోట్లు, రవ్వ క్యాపిటివ్ పోర్టు ద్వారా రూ.3.55 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చింది. ఇదే సమయంలో గంగవరం పోర్టు 32.83 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,056.46 కోట్ల ఆదాయం ఆర్జించగా.. ప్రభుత్వ వాటాగా రూ.59.8 కోట్లు (డివిడెండ్‌తో కలిపి) వచ్చింది. అలాగే కృష్ణపట్నం పోర్టు 38.18 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,871.93 కోట్ల ఆదాయం సమకూర్చుకోగా.. రాష్ట్ర ఖజానాకు రూ.46.07 కోట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment