తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల సామర్థ్యం 300 మిలియన్‌ టన్నులు | Capacity of state ports is 300 million tons in nine months | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల సామర్థ్యం 300 మిలియన్‌ టన్నులు

Published Sat, Mar 6 2021 5:46 AM | Last Updated on Sat, Mar 6 2021 5:46 AM

Capacity of state ports is 300 million tons in nine months - Sakshi

సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్‌ విజన్‌ 2030 పేరుతో వచ్చే తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం 100 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో ఎన్‌వీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలి దశలో 2024 నాటికి సరుకు రవాణా సామర్థ్యం 200 మిలియన్‌ టన్నులకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో మూడు డీప్‌ వాటర్‌ పోర్టులు ఉండగా, అదనంగా మరో నాలుగు డీప్‌ వాటర్‌ పోర్టులు నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం చేపట్టనుండగా, కాకినాడ సెజ్‌ సమీపంలో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌ మరో ఓడరేవును నిర్మించనుంది.

మూడు ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌
రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్నిచ్చే ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ నిర్మాణానికి మారిటైమ్‌ బోర్డు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగా గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ ఏర్పాటు కోసం వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో ఇప్పటికే ఏజీ అండ్‌ పీ అనే సంస్థ రూ.1,000 కోట్లతో గంగవరం వద్ద 3 మిలిఠియన్‌ టన్నుల సామర్థ్యంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. కాకినాడ వద్ద హెచ్‌ ఎనర్జీ అనే సంస్థ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ టెర్మినల్స్‌ అందుబాటులోకి వస్తే 15 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు వ్యాట్‌ రూపంలో రూ.50,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని మారిటైమ్‌ బోర్డు అంచనా వేసింది.

పర్యాటకం కోసం క్రూజ్‌ టెర్మినల్స్‌
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల ఆధారంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌  తెలిపారు. క్రూజ్‌ టూరిజం (పెద్ద సంఖ్యలో పర్యాటకులను తీసుకెళ్లే) ద్వారా ఈ రేవులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో భీమిలి, కాకినాడల్లో క్రూజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటుకు మారిటైమ్‌ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement