![RBI report says that Increased investment in assets - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/11/RBI.jpg.webp?itok=cawcjWBV)
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఆస్తుల కల్పన వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా మూలధన వ్యయం పెరుగుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. పలు రాష్ట్రాల బడ్జెట్‌లను అధ్యయనం చేసిన ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదంటూ కొందరు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. మూలధన వ్యయం అంటే ఆస్తులు సమకూర్చేందుకు చేస్తున్న వ్యయంగా పరిగణిస్తారు.
తెలంగాణ కంటే అధికంగా..
టీడీపీ హయాంలో 2018–19లో మూలధన వ్యయం రూ.35,364 కోట్లు ఉండగా 2020–21లో రూ.44,397 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. గత సర్కారు హయాంలో కన్నా గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో మూలధన వ్యయం ఎక్కువగా ఉందని నివేదిక తేటతెల్లం చేసింది. విభజన అనంతరం చంద్రబాబు అధికారం చేపట్టిన 2014–15లో మూలధన వ్యయంతో పోల్చితే 2020–21లో వైఎస్సార్ సీపీ పాలనలో ఏకంగా 139 శాతం మేర పెరిగింది. 2018–19తో పోల్చితే 2019–20లో 5.29 శాతం మేర పెరిగింది. 2020–21లో 19.28 శాతం పెరిగింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ కంటే ఒకింత ఎక్కువగానే ఏపీలో మూలధన వ్యయం ఉంది. 2019–20లో తెలంగాణ మూల ధన వ్యయం రూ.31,228 కోట్లు కాగా 2020–21లో రూ,44,145 కోట్లు వరకు ఉంది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా ఆదాయంతో పాటు రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చే రాబడి తగ్గిపోయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రాకుండా వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment