ఏవియేషన్ షోలో ఏపీ పెవిలియన్
సాక్షి, అమరావతి: విమానయాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ షో.. వింగ్స్ ఇండియా 2022 వేదికను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. గురువారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ బేగంపేటలో జరిగే విమానయాన ప్రదర్శన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) పెవిలియన్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుతో పాటు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్న భోగాపురం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నట్లు ఏపీఏడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ ట్రైనింగ్ సెంటర్, పారాగైడ్లింగ్ వంటి అంశాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. పీపీపీ విధానంలో రెండు భారీ విమానాశ్రయాలు రానుండటంతో వీటి ఆధారంగా పలు ఇతర పెట్టుబడుల అవకాశాలను ఈ ప్రదర్శనలో ఇన్వెస్టర్లకు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఏపీ పెవిలియన్‌లో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలు, కొత్తగా రానున్న వాటిల్లో పెట్టుబడుల అవకాశాలు, పట్టణాభివృద్ధి అవకాశాలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులతో సమావేశం కావడానికి ప్రత్యేకంగా బిజినెస్ మీట్ రూమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.
డ్రోన్లపై ప్రత్యేక దృష్టి
వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వింగ్స్ ఇండియాలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భరత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీని విడుదల చేస్తే దానికనుగుణంగా రాష్ట్రంలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment