కోల్‌కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది.
వాస్తవానికి కోల్‌కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్‌కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్‌కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.
వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.
ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్‌గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.
ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్‌లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్‌ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్‌కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్‌గా మారింది.
1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్‌కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది
1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.
2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.
2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతం
ప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment