![Railway police in Kolkata arrested four Rohingyas on Wednesday](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/rohingya.jpg.webp?itok=K9j2AD51)
మయన్మార్ టు ఇండియా వయా బంగ్లాదేశ్
నగరానికి రోహింగ్యాల రాక సాగుతోందిలా..
అత్యధికంగా పాతబస్తీలో స్థిరపడుతున్న వైనం
మీ సేవ సెంటర్ల నిర్వాహకులతో గుర్తింపు పత్రాలు
కోల్‌కతాలో చిక్కినవారి విచారణలో వెలుగులోకి
బంగ్లా పరిణామాల నేపథ్యంలో నిఘా వర్గాల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్‌లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు.
వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది.
అక్కడి అలజడులతో ఇక్కడ దడ...
బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి..
మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు.
అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులుగా...
కాక్స్ టౌన్‌లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచ్చిలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్‌బార్, రబీల్ ఇస్లాం పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు..
ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశ్మీర్‌లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment