గులాబీ గుబాళించింది | Bangladesh 106 all Out In First Innings Of Kolkata Test | Sakshi
Sakshi News home page

గులాబీ గుబాళించింది

Published Sat, Nov 23 2019 3:42 AM | Last Updated on Sat, Nov 23 2019 5:33 AM

Bangladesh 106 all Out In First Innings Of Kolkata Test - Sakshi

బంతులు మాత్రమే కాదు... మైదానంలో సిబ్బంది, ప్రేక్షకుల దుస్తులు... హోర్డింగ్‌లు, స్కోరు బోర్డులు... వ్యాఖ్యాతల ప్రత్యేక డ్రెస్‌లు... చివరకు స్వీట్లు కూడా... ఒకటేమిటి, ఇలా ఈడెన్‌ గార్డెన్స్‌ మొత్తం గులాబీమయమైపోయింది. పింక్‌ టెస్టుపై గత కొద్ది రోజులుగా పెరిగిన అంచనాలు, ఏర్పాట్లకు తగినట్లుగా మైదానం మొత్తం అదే రంగు పరచుకుంది. తొలిసారి భారత గడ్డపై జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్టుకు అభిమాన జనం అమితోత్సాహంతో తరలి వచ్చింది. ఊహించినట్లుగానే మ్యాచ్‌ మొదటి రోజు భారత క్రికెట్‌ చరిత్రలో మరో మరచిపోలేని ఘట్టంగా మిగిలిపోయింది.

స్థాయికి తగినట్లుగానే చెలరేగిన టీమిండియా పేసర్లు ప్రత్యర్థిని కుప్పకూల్చి మ్యాచ్‌ను తొలి రోజే మన వైపు తిప్పారు. పింక్‌ బాల్‌తో బౌలింగ్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచిన ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌ వెన్ను విరిచాడు. ఆ తర్వాత సాధికారిక బ్యాటింగ్‌తో కోహ్లి సేన ఇప్పటికే ఆధిక్యాన్ని అందుకుంది. అనుకున్నట్లే సాయంత్రం సమయంలో బంతి కొంత స్వింగ్‌ కాగా, బంతి రంగుతో ఇబ్బంది పడినట్లుగా మాత్రం ఆటగాళ్ల నుంచి ఫిర్యాదులు రాలేదు. ఆటకు తోడు రూనా లైనా పాట, మాజీల ముచ్చట్లు, ఘన సన్మానాలు, అభినందనలు కోల్‌కతా టెస్టుకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.   

కోల్‌కతా: అమితాసక్తిని రేపిన ‘పింక్‌ టెస్టు’లో భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు కుప్పకూలింది. షాద్‌మన్‌ ఇస్లామ్‌ (29), లిటన్‌ దాస్‌ (24 రిటైర్డ్‌హర్ట్‌), నయీమ్‌ హసన్‌ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు బ్యాట్స్‌మన్‌ డకౌట్‌ కావడం విశేషం. పేసర్‌ ఇషాంత్‌ శర్మ 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఉమేశ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి.

భారత స్పిన్నర్లలో జడేజా ఒకే ఒక్క ఓవర్‌ వేయగా, అశి్వన్‌కు బౌలింగ్‌ చేయాల్సిన అవసరం రాకుండానే ప్రత్యర్థి ఆలౌట్‌ కావడం మన పేసర్ల ప్రభావాన్ని చూపిస్తోంది. అనంతరం భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (93 బంతుల్లో 59 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (105 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ప్రస్తుతం కోహ్లితో పాటు రహానే (22 బంతుల్లో 23 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్‌కు ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యం లభించింది.  

టపటపా...
బంతి రంగు మారడం తప్ప బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గత మ్యాచ్‌లాగే ఆ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కైస్‌ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇషాంత్‌ శుభారంభం అందించాడు. కైస్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఆ తర్వాత బంగ్లా వరుసగా మూడు డకౌట్లతో తమ పతనాన్ని కొని తెచ్చుకుంది. ఉమేశ్‌ ఓవర్లో మోమినుల్‌ (0), మిథున్‌ (0) అవుట్‌ కాగా... తర్వాతి ఓవర్లో షమీ చక్కటి బంతితో ముష్ఫికర్‌ (0) స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. మోమినుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌ నుంచి తొలి స్లిప్‌ మీదుగా డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో రోహిత్‌ క్యాచ్‌ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది.

అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఆడిన షాద్‌మన్‌ను ఉమేశ్‌ అవుట్‌ చేయడంతో 38 పరుగులకే సగం టీమ్‌ పెవిలియన్‌ చేరింది. ఈ క్యాచ్‌తో సాహా టెస్టుల్లో 100 మందిని అవుట్‌ చేయడంలో భాగంగా (89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు) నిలిచాడు. కొద్ది సేపటికే సాహా అత్యద్భుత క్యాచ్‌తో మహ్ముదుల్లా (6) కూడా పెవిలియన్‌ చేరాడు. షమీ దెబ్బతో దాస్‌ మైదానం వీడిన అనంతరం బంగ్లా ఇన్నింగ్స్‌ ఎక్కువ సేపు సాగలేదు. నయీమ్‌ (19) కొద్ది సేపు నిలబడినా... 24 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు పడ్డాయి.

రోహిత్‌ విఫలం...
భారత్‌కు బ్యాటింగ్‌లో ఆశించిన ఆరంభం మాత్రం దక్కలేదు. మయాంక్‌ అగర్వాల్‌ (21 బంతుల్లో 14; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా... రోహిత్‌ శర్మ (35 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) కూడా తొందరగానే నిష్క్రమించాడు. 12 పరుగుల వద్ద రోహిత్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అల్‌ అమీన్‌ వదిలేసినా భారత బ్యాట్స్‌మన్‌ దానిని వాడుకోలేకపోయాడు. ఆ తర్వాత సీనియర్లు పుజారా, కోహ్లి భాగస్వామ్యం జట్టును నడిపించింది.

వీరిద్దరు ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ చక్కటి షాట్లు ఆడారు. ప్రత్యర్థి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 15 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్న పుజారా 93 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఆ వెంటనే ఇబాదత్‌ వేసిన బంతిని స్లిప్‌లోకి ఆడి వెనుదిరిగాడు. తర్వాత వచి్చన రహానే చూడచక్కటి షాట్లతో వేగంగా పరుగులు రాబట్టి కెపె్టన్‌గా అండగా నిలవడంతో తొలి రోజు భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 29; కైస్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 4; మోమినుల్‌ (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 0; మిథున్‌ (బి) ఉమేశ్‌ 0; ముష్ఫికర్‌ (బి) షమీ 0; మహ్ముదుల్లా (సి) సాహా (బి) ఇషాంత్‌ 6; లిటన్‌ దాస్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 24; నయీమ్‌ (బి) ఇషాంత్‌ 19; ఇబాదత్‌ (బి) ఇషాంత్‌ 1; మెహదీ హసన్‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌ 8; అల్‌ అమీన్‌ (నాటౌట్‌) 1; జాయెద్‌ (సి) పుజారా (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (30.3 ఓవర్లలో ఆలౌట్‌) 106.
వికెట్ల పతనం: 1–15, 2–17, 3–17, 4–26, 5–38, 6–60, 6–73 (రిటైర్డ్‌హర్ట్‌), 7–82, 8–98, 9–105, 10–106.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 12–4–22–5; ఉమేశ్‌ యాదవ్‌ 7–2–29–3; షమీ 10.3–2–36–2; జడేజా 1–0–5–0.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) (సబ్‌) మెహదీ (బి) అల్‌ అమీన్‌ 14; రోహిత్‌ (ఎల్బీ) (బి) ఇబాదత్‌ 21; పుజారా (సి) షాద్‌మన్‌ (బి) ఇబాదత్‌ 55; కోహ్లి (బ్యాటింగ్‌) 59; రహానే (బ్యాటింగ్‌) 23; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (46 ఓవర్లలో 3 వికెట్లకు) 174.  
వికెట్ల పతనం: 1–26; 2–43; 3–137.  
బౌలింగ్‌: అల్‌ అమీన్‌ 14–3–49–1; అబూ జాయెద్‌ 12–3–40–0; ఇబాదత్‌ 12–1–61–2; తైజుల్‌ 8–0–23–0.   

►30.3 బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయిన ఓవర్లు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తమ ప్రత్యరి్థని ఇన్ని తక్కువ ఓవర్లలో ఎప్పుడూ ఆలౌట్‌ చేయలేదు. గతంలో జింబాబ్వేను 44.2 ఓవర్లలో
ఆలౌట్‌ చేసింది.

►2 భారత్‌పై బంగ్లాకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2000లో జరిగిన తొలి టెస్టులో ఆ జట్టు 91 పరుగులకే ఆలౌటైంది.  

►4 సొంత గడ్డపై జరిగిన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లనూ భారత పేసర్లే తీయడం ఇదే నాలుగో సారి మాత్రమే.

►2 స్వదేశంలో ఇషాంత్‌ 5 వికెట్లు తీయడం ఇది రెండోసారి. 2007లో తన రెండో టెస్టులో అతను ఈ ఘనత నమోదు చేయగా, భారత్‌లో ఇషాంత్‌కిది 37వ టెస్టు.  

►1టెస్టు క్రికెట్‌లో వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా  కోహ్లి (86 ఇన్నింగ్స్‌) గుర్తింపు పొందాడు. పాంటింగ్‌ (97 ఇన్నింగ్స్‌) పేరిట ఉన్న రికార్డును
కోహ్లి బద్దలు కొట్టాడు.

►ఎర్ర బంతితో పోలిస్తే గులాబీ బంతికి చాలా తేడా కనిపించింది. ఆరంభంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేశాం కానీ బంతి మాత్రం స్వింగ్‌ కాలేదు. అప్పుడు మేమందరం చర్చించుకున్న తర్వాత పింక్‌ బాల్‌తో ఎలాంటి లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయాలనేది అర్థమైంది. పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాననే బెంగ ఏమాత్రం లేని దశకు చేరుకున్నాను. ఏ ఫార్మాట్‌ అయినా ఆడాలని, ఆటను ఆస్వాదించాలని మాత్రమే కోరుకుంటా.      –ఇషాంత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement