షమీ... శుబ్‌... ఆరంభం | India wins first match of Champions Trophy against bangladesh | Sakshi
Sakshi News home page

షమీ... శుబ్‌... ఆరంభం

Published Fri, Feb 21 2025 4:01 AM | Last Updated on Fri, Feb 21 2025 4:20 AM

India wins first match of Champions Trophy against bangladesh

చాంపియన్స్‌ ట్రోఫీ తొలి పోరులో భారత్‌ ఘన విజయం

ఆరు వికెట్లతో బంగ్లాదేశ్‌ చిత్తు ∙ గిల్‌ అజేయ సెంచరీ

5 వికెట్లతో మెరిసిన షమీ ∙ఆదివారం పాకిస్తాన్‌తో పోరు

229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్‌లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్‌ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్‌మన్‌ గిల్‌ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అంతకుముందు భారత్‌ పదునైన బౌలింగ్‌కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్‌... తౌహీద్, జాకీర్‌ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.  

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గెలుపు బోణీ చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్‌ హృదయ్‌ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్‌ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. 

మొహమ్మద్‌ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్‌ రాణా 3, అక్షర్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (129 బంతుల్లో 101 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (47 బంతుల్లో 41 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.   

భారీ భాగస్వామ్యం... 
తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్‌ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్‌ తన తొలి ఓవర్లోనే  దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్‌జీద్‌ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్‌ (0)ను అవుట్‌ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్‌ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్‌ జట్టును ఆదుకున్నారు. 

భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్‌ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌తో తౌహీద్‌ 114 బంతుల్లో కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.  

రాణించిన రాహుల్‌... 
స్వల్ప లక్ష్యమే అయినా భారత్‌ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్‌ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్‌ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్‌ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్‌ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్‌) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్‌ అయ్యర్‌ (15), అక్షర్‌ పటేల్‌ (8) అవుటయ్యారు. అయితే గిల్‌కు రాహుల్‌ అండగా నిలిచాడు. 

బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్‌ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్‌తో 125 బంతుల్లో గిల్‌ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
  
స్కోరు వివరాలు  
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తన్‌జీద్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 25; సౌమ్య సర్కార్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 0; నజు్మల్‌ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్‌ (సి) గిల్‌ (బి) షమీ 5; తౌహీద్‌ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 0; జాకీర్‌ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్‌ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్‌జీమ్‌ (బి) షమీ 0; తస్కీన్‌ (సి) అయ్యర్‌ (బి) షమీ 3; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్‌: షమీ 10–0–53–5, హర్షిత్‌ రాణా 7.4–0–31–3, అక్షర్‌ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్‌ 10–0–43–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రిషాద్‌ (బి) తస్కీన్‌ 41; గిల్‌ (నాటౌట్‌) 101; కోహ్లి (సి) సర్కార్‌ (బి) రిషాద్‌ 22; అయ్యర్‌ (సి) నజ్ముల్‌ (బి) ముస్తఫిజుర్‌ 15; అక్షర్‌ (సి అండ్‌ బి) రిషాద్‌ 8; రాహుల్‌ (నాటౌట్‌) 41; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్‌: తస్కీన్‌ 9–0–36–1, ముస్తఫిజుర్‌ 9–0–62–1, తన్‌జీమ్‌ 8.3–0–58–0, మిరాజ్‌ 10–0–37–0, రిషాద్‌ 10–0–38–2.  

అక్షర్‌ ‘హ్యాట్రిక్‌’ మిస్‌ 
మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్‌ ఫీల్డింగ్‌ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్‌ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్‌ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్‌ వదిలేశాడు. దాంతో అక్షర్‌ ‘హ్యాట్రిక్‌’ అవకాశం చేజారింది. 

రోహిత్‌ ఆ క్యాచ్‌ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్‌ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్‌లో స్టంప్‌ చేసే అవకాశాన్ని రాహుల్‌ చేజార్చాడు. చివరకు బ్యాటర్‌ 68 పరుగులు సాధించగలిగాడు. 

తౌహీద్‌ స్కోరు 23 వద్ద కుల్దీప్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌లో పాండ్యా సునాయాస క్యాచ్‌ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో 12 వద్ద తన్‌జీద్‌ను రనౌట్‌ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్‌ త్రో స్టంప్స్‌కు చాలా దూరంగా వెళ్లింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్‌ సులువైన క్యాచ్‌ వదిలేసి మేలు చేశాడు.

200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్‌ స్టార్క్‌కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్‌ అగార్కర్‌ 133 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. జహీర్‌ ఖాన్‌ (32 ఇన్నింగ్స్‌లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్‌లలో 60) సవరించాడు.

11000 వన్డేల్లో రోహిత్‌ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.

156 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అజహరుద్దీన్‌ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్‌ (160) వీరికంటే ముందున్నారు.  

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు 
దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్‌ 
వేదిక: కరాచీ 
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌ 18, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement