బెంబేలెత్తించిన భారత పేస్
► l84 పరుగులకే కుప్పకూలిన
► ‘వార్మప్’లో 240 పరుగులతో టీమిండియా ఘన విజయం
చాంపియన్స్ ట్రోఫీలో ఇక భారత జట్టు పేస్ బౌలింగ్ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం లేదు. న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌లో ఆకట్టుకున్న మన ఫాస్ట్ బౌలర్లు, రెండో మ్యాచ్‌లో నిప్పులు చిమ్మారు. భువనేశ్వర్ (3/13), ఉమేశ్ (3/16) ఒకరితో ఒకరు పోటీ పడి వికెట్లు తీయడంతో బేలగా మారిపోయిన బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో కార్తీక్, పాండ్యా, ధావన్ రాణించడంతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా అసలు పోరుకు ధీమాగా సిద్ధమైంది.
ఓవల్: ప్రధాన మ్యాచ్‌లకు ముందు బంగ్లాదేశ్‌తో వార్మప్ పోరును భారత జట్టు బ్రహ్మాండంగా వాడుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జట్టుకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 240 పరుగులతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (77 బంతుల్లో 94 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (54 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67 బంతుల్లో 60; 7 ఫోర్లు) చెలరేగారు.
రూబెల్ హుస్సేన్‌కు 3 వికెట్లు దక్కాయి. కోహ్లి, ధోని, యువరాజ్ బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. మెహదీ హసన్ మిరాజ్ (24)దే అత్యధిక స్కోరు. ఒక దశలో ఆ జట్టు 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే మిరాజ్, సున్‌జముల్ (18) కొద్దిసేపు వికెట్లు పడకుండా పోరాడారు. షమీ, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం 9 వికెట్లను పేసర్లే కూల్చగా... ఒకే ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్‌కు కూడా ఒక వికెట్ దక్కింది.
రోహిత్ విఫలం...
తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ (1) ఈ మ్యాచ్‌లో నిరాశ పర్చాడు. రూబెల్ వేసిన వైడ్ బంతిని అతను వికెట్లపైకి ఆడుకొని అవుటయ్యాడు. రహానే (11) కూడా మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే ధావన్, కార్తీక్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 16.3 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు.
సున్‌జముల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్, అదే ఓవర్లో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కార్తీక్ ఈ సారి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. జాదవ్ (38 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్)ను సున్‌జముల్ అవుట్ చేయగా...సెంచరీకి చేరువైన దశలో కార్తీక్ రిటైర్ట్ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత పాండ్యా జోరు కొనసాగింది. భారీ షాట్లతో 39 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకోగా, చివర్లో జడేజా (36 బంతుల్లో 32; 1 సిక్స్) మరిన్ని పరుగులు జోడించి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు.
టపటపా...
తొలి 3 ఓవర్లలో బంగ్లా 10 పరుగులు చేసింది. ఆ తర్వాత ఉమేశ్, భువీ ధాటికి కకావికలమైంది. ఉమేశ్ వేసిన నాలుగో ఓవర్లో సర్కార్ (2), షబ్బీర్ (0) అవుట్ కాగా, తర్వాతి ఓవర్లో భువీ, కైస్ (7)ను వెనక్కి పంపాడు. భువనేశ్వర్ మరుసటి ఓవర్లోనే షకీబ్ (7), మహ్ముదుల్లా (0) పెవిలియన్ చేరుకోగా, మొసద్దిక్ (0) వికెట్ ఉమేశ్ ఖాతాలో చేరింది. 7.3 ఓవర్లు ముగిసే సరికే 22/6 స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది.