'ఎనిమిది' కోసం | ICC Champions Trophy: A capsule look at all eight teams | Sakshi
Sakshi News home page

'ఎనిమిది' కోసం

Published Wed, May 31 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

'ఎనిమిది' కోసం

'ఎనిమిది' కోసం

నేటి నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ
బరిలోకి ఎనిమిది అగ్రశ్రేణి జట్లు
తొలి పోరులో ఇంగ్లండ్‌తో బంగ్లాదేశ్‌ ఢీ
ఫేవరెట్‌లో ఒకరిగా భారత్‌


చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ 15 మ్యాచ్‌లు గెలిచి 6 మాత్రమే ఓడింది. టోర్నీలో మిగతా అన్ని జట్లకంటే ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? వన్డేల్లో ఇంగ్లండ్‌ జట్టు మారిన ఆటతీరులో నిజంగా ఉన్న బలమెంత? దక్షిణాఫ్రికా 19 ఏళ్ల తర్వాతైనా మరో ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందా? మెకల్లమ్‌లాంటి ఆటగాడు లేకుండా న్యూజిలాండ్‌ జట్టు దూకుడు కొనసాగించగలదా? మెగా ఈవెంట్‌లో సారథిగా స్మిత్‌ సత్తా ఏపాటిది? వీటన్నింటికి సమాధానం రాబోయే 18 రోజుల్లో లభించనుంది.

ప్రపంచంలోని ఎనిమిది అత్యుత్తమ జట్లు... ఒక్కో జట్టుకు గరిష్టంగా ఐదు మ్యాచ్‌లు... ఆహ్లాదకర వాతావరణంలో అభిమానుల కోలాహలం... ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగే వరల్డ్‌ కప్‌తో పోలిస్తే మూడే వేదికల్లో ‘షార్ట్‌ అండ్‌ స్వీట్‌’ తరహాలో ఉండే చాంపియన్స్‌ ట్రోఫీ అందుకే ఆసక్తి రేపుతోంది. పటిష్టమైన ప్రత్యర్థులతో చిన్న పొరపాటుకు కూడా చాన్స్‌ ఇవ్వకుండా హోరాహోరీ సమరానికి అన్ని జట్లు సై అంటున్నాయి.

ఇప్పుడు కోహ్లి, కుంబ్లే విభేదాలు వెనక్కి వెళ్లిపోతాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ల ఫీజులు, బోర్డుతో గొడవలు అన్నీ గప్‌చుప్‌. ఇప్పుడు విజయం ఒక్కటే అందరి లక్ష్యం. టోర్నీనే రద్దు చేస్తున్నామని ప్రకటించి కూడా టి20ల జోరులో వన్డే విలువను పెంచాలనే పట్టుదలతో ఐసీసీ మళ్లీ ఈ టోర్నీ నిర్వహణకు సాహసించింది. 2019లో ఇదే గడ్డపై జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ట్రైలర్‌లాంటి చాంపియన్స్‌ ట్రోఫీ ఎలాంటి వినోదాన్ని పంచనుందో వేచి చూడాలి!

లండన్‌: టాప్‌–8 జట్ల వన్డే క్రికెట్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. నేటి (గురువారం) నుంచి జరిగే ఎనిమిదో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పోరులో సత్తా చాటేందుకు అగ్రశ్రేణి టీమ్‌లు సన్నద్ధమయ్యాయి. ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ ఉండగా... గ్రూప్‌ ‘బి’లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో ఆడుతుంది. పాయింట్ల ఆధారంగా ఒక్కో గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జూన్‌ 18న ఓవల్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. ఓవల్‌తో పాటు బర్మింగ్‌హామ్, కార్డిఫ్‌లను వేదికలుగా నిర్ణయించారు. టోర్నమెంట్‌ ఫార్మాట్, మ్యాచ్‌ల సంఖ్య, వేదికల్లో ఎలాంటి మార్పులు లేకుండా 2013 చాంపియన్స్‌ ట్రోఫీనే నిర్వాహకులు అనుసరించారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన కారణంగా మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ ఈసారి టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

‘డిఫెండింగ్‌ చాంపియన్‌’ చెలరేగిపోతుందా!
చాంపియన్స్‌ ట్రోఫీ బరిలో నిలిచిన ఇతర జట్లతో పోలిస్తే విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌కే మంచి విజయావకాశాలు ఉన్నాయి. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు పదునైన పేస్‌ బౌలింగ్‌తో మన జట్టు ఈ టోర్నీకి సిద్ధమైంది. 2013లో జట్టు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ మరోసారి తమ ధాటిని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. శిఖర్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లలో కూడా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి, యువరాజ్, రహానేలతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. ఐపీఎల్‌ వైఫల్యం తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని కోహ్లి వార్మప్‌లోనే నిరూపించాడు.

యువరాజ్‌ ఫామ్, ఫిట్‌నెస్‌పై కాస్త ఆందోళన ఉన్నా... కీలక సమయంలో అతను కోలుకోగలడని జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్వసిస్తోంది. గత టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ధోని ఈసారి కెప్టెన్సీ భారం లేకుండా బరిలోకి దిగుతున్నాడు. అతడు కూడా తన పాత శైలిలో చెలరేగితే భారత్‌కు ఎదురుండదు. ఈ టోర్నీ తర్వాత ధోని కెరీర్‌ కొనసాగించడంపై కూడా సందేహాలు ఉండటంతో అతని మెరుపులకు ఇదే ఆఖరి అవకాశం. బౌలింగ్‌లో భారత పేస్‌ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. షమీ, ఉమేశ్, భువనేశ్వర్, బుమ్రాలు ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో చెలరేగిపోయే అవకాశం ఉంది.

రెండు వార్మప్‌ మ్యాచ్‌లు దానిని నిరూపించాయి కూడా. అగ్రశ్రేణి స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ నలుగురికి అండగా నిలుస్తాడు. కాబట్టి బౌలింగ్‌ బలగం కూడా జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలకం కానుంది. 2015 వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించిన తర్వాత భారత్‌ మొత్తం 7 వన్డే సిరీస్‌లు ఆడింది. వీటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, జింబాబ్వే (రెండు సార్లు)లపై సిరీస్‌లు గెలవగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల చేతిలో ఓడింది. ఇతర జట్ల తాజా ఫామ్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో భారత్‌ మెరుగ్గా కనిపిస్తోంది.

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
ఇంగ్లండ్‌ గీ బంగ్లాదేశ్‌
వేదిక: ఓవల్,  గ్రూప్‌: ‘ఎ’,  మధ్యాహ్నం గం. 2.50 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement