బహుపరాక్‌ | India vs Bangladesh Semi-final, Champions Trophy 2017 | Sakshi
Sakshi News home page

బహుపరాక్‌

Published Thu, Jun 15 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

బహుపరాక్‌

బహుపరాక్‌

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ సెమీస్‌ పోరు
ఆదమరిస్తే అంతే సంగతులు
ఫామ్‌లో కోహ్లి దళం ఆత్మవిశ్వాసంతో మొర్తజా బృందం


బంగ్లాదేశ్‌ ప్రమాదకరమైన జట్టు... చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య ఇది. ఏదో మాట వరసకు అతను ఈ వ్యాఖ్య చేసినట్లుగా లేదు. ఇటీవల బంగ్లాదేశ్‌ ప్రస్థానం చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిన వాస్తవం ఇది. ఒకప్పుడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ అంటే మరో ఆలోచన లేకుండా నిశ్చింతగా మన అభిమానులు ఆటకు ముందే సంబరాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే పరాభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

2015 వన్డే వరల్డ్‌ కప్‌లో అంపైరింగ్‌ పొరపాట్లు, ‘నో బాల్‌’ వల్లే తాము ఓడిపోయామని బంగ్లాదేశ్‌ జట్టుతోపాటు ఆ దేశ అభిమానులు ఇప్పటికీ నమ్ముతారు. ఇక గత ఏడాది టి20 ప్రపంచ కప్‌లో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి గుండె పగిలిన క్షణాన్ని కూడా వారు మరచిపోలేదు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ఈ సారైనా ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్‌ పట్టుదలగా ఉంది. దానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్న ఆ జట్టును ఓడించాలంటే కోహ్లి సేన ప్రత్యేక ప్రదర్శన ఇవ్వాల్సిందే.

బలాబలాలపరంగా చూస్తే భారత్‌దే అన్నింటా పైచేయిగా కనిపిస్తోంది. ఓపెనింగ్, మిడిలార్డర్, అనుభవం... ఇలా అన్నింటా బంగ్లాదేశ్‌ జట్టు ఎదురు నిలిచే పరిస్థితి లేదు. అయితే బౌలింగ్‌లో మాత్రం మన కుర్రాళ్లతో బంగ్లా ఆటగాళ్లు కూడా పోటీ పడుతున్నారు. ఇక పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఆ జట్టు ఆడితే మరో సంచలనానికి అవకాశం ఉంటుంది. అన్నట్లు 2015 ప్రపంచ కప్‌ తర్వాత టాప్‌–8 జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ 11 గెలిచి, 13 ఓడితే... బంగ్లాదేశ్‌ కూడా 11 గెలిచి, 10 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది!

బర్మింగ్‌హామ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచి భారత సెమీస్‌ చేరగా... న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చి బంగ్లాదేశ్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

అదే జట్టుతో...
దక్షిణాఫ్రికాపై భారత్‌ సాధికారిక విజయం చూస్తే జట్టులో ఇక ఎలాంటి లోపాలు లేవన్నట్లుగా కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్‌లో టాప్‌–5 అంతా ఈ టోర్నీలో పరుగులు సాధించారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్, కోహ్లి కూడా చెరో రెండు హాఫ్‌ సెంచరీలు చేసి సత్తా చాటారు. ధోని, యువరాజ్‌ కూడా రాణించారు.

 హార్దిక్‌ పాండ్యా కూడా తొలి మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించాడు. ఇలాంటి స్థితిలో భారత బ్యాటింగ్‌ను అడ్డుకోవడం బంగ్లాదేశ్‌కు అంత సులువు కాదు. వీరిలో ఏ ఇద్దరు తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇచ్చినా భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో గత మ్యాచ్‌లో చెలరేగిన బుమ్రాతో పాటు భువనేశ్వర్‌ ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చగల సమర్థులు. పాండ్యా మీడియం పేస్‌ అందుబాటులో ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ స్పిన్నర్‌ అశ్విన్‌ కొనసాగుతాడు. ఓవరాల్‌గా భారత్‌ అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది.

మళ్లీ చెలరేగుతారా...
ప్రధాన టోర్నీల్లో ఒక సంచలన విజయం సాధించి ఏళ్ల పాటు దానినే బంగ్లాదేశ్‌ గుర్తు చేసుకునేది. ఇప్పుడు తాము ఆ దశను దాటామని ఆ జట్టు భావిస్తోంది. భారత్‌తో అంశాలవారీగా పోలిస్తే బలహీనంగా ఉన్నా... పట్టుదలగా ఆడితే బంగ్లాకు కూడా ఈ మ్యాచ్‌లో మంచి విజయావకాశం ఉంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33/4 నుంచి 268 పరుగులు చేసిన తీరు కొత్త తరహా బంగ్లాను చూపిస్తోంది.

ఆ మ్యాచ్‌ హీరోలు షకీబ్, మహ్ముదుల్లా మరోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా... బంగ్లా ప్రధాన బలం ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాలే. మరో సరైన ఓపెనర్‌ లేకపోవడం ఆ జట్టు ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపిస్తోంది. కీపర్‌ ముష్ఫికర్‌ కూడా బ్యాటింగ్‌లో రాణించాలి. కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లా నలుగురు పేసర్లతో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒకరిని తప్పించి స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది. మూడు మ్యాచ్‌లలో కలిపి ఒకే ఒక్క వికెట్‌ తీసిన ముస్తఫిజుర్‌ తన అభిమాన ప్రత్యర్థిపైనైనా చెలరేగాలని బంగ్లా కోరుకుంటోంది.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, యువరాజ్, ధోని, పాండ్యా, జాదవ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా.

బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), తమీమ్, సర్కార్, షబ్బీర్, ముష్ఫికర్, షకీబ్, మహ్ముదుల్లా, మొసద్దిక్, తస్కీన్, రూబెల్, ముస్తఫిజుర్‌.

మధ్యాహ్నం గం. 3 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో
ప్రత్యక్ష ప్రసారం


పిచ్, వాతావరణం
ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఉపయోగించని పిచ్‌పై ఈ సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లకూ సమాన అవకాశం ఉంది కాబట్టి టాస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. బర్మింగ్‌హామ్‌ వాతావరణం సాధారణంగా మారింది. వర్ష సూచన లేదు.

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ఇప్పటి వరకు 32 వన్డేలు జరిగాయి. భారత్‌ 26 గెలిచి, 5 ఓడింది.ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

గతంలోనూ మేం ఇలాంటి కీలక మ్యాచ్‌లు ఎన్నో ఆడాం. అయితే విజయానికి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. లీగ్‌ దశలో కూడా కొన్ని అనూహ్య ఫలితాలు వచ్చాయి కాబట్టి మేం ఉదాసీనతకు దూరంగా ఉంటాం. సెమీస్‌లో గట్టి పోటీ తప్పదు. ఇరు జట్ల మధ్య గత మ్యాచ్‌లలో ఏం జరిగిందనేది అనవసరం. మా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు.    
 – విరాట్‌ కోహ్లి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement