మూడో రోజే ముగించేశారు.. | India Beats Bangladesh In 1st Test Match | Sakshi
Sakshi News home page

మూడో రోజే ముగించేశారు..

Published Sun, Nov 17 2019 3:41 AM | Last Updated on Sun, Nov 17 2019 12:10 PM

India Beats Bangladesh In 1st Test Match - Sakshi

సొంతగడ్డపై భారత్‌కు మరో ఏకపక్ష విజయం. టీమిండియా తిరుగులేని బౌలింగ్‌ ముందు తలవంచిన బంగ్లాదేశ్‌ మూడో రోజే చేతులెత్తేసింది. దాదాపు తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు ఘోర పరాజయాన్ని ఆహా్వనించింది. షమీ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... ఉమేశ్, అశ్విన్, ఇషాంత్‌ తలా ఓ చేయి వేశారు.

ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పట్టికలో మరో 60 పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్న కోహ్లి బృందం 300 పాయింట్లతో మరింత పైకి ఎగసింది. రెండు రోజుల ముందే మ్యాచ్‌ ముగించిన ఉత్సాహంతో టీమిండియా రాబోయే ‘పింక్‌ టెస్టు’ కోసం సన్నాహాల్లో పడటం విశేషం.   

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఊహించిన ఫలితమే వచ్చింది. ఎలాంటి మలుపులు లేకపోగా, కనీస పోరాటపటిమ కొరవడిన బంగ్లా తేలిగ్గా తలవంచింది. ఫలితంగా శనివారం ఇక్కడి హోల్కర్‌ స్టేడియంలో ముగిసిన పోరులో భారత్‌ ఇన్నింగ్స్, 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 493/6 వద్దే భారత్‌ డిక్లేర్‌ చేయడంతో 343 పరుగుల లోటుతో బంగ్లాదేశ్‌ మూడో రోజు ఆట ప్రారంభించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 213 పరుగులకే కుప్పకూలింది. ముషి్ఫకర్‌ రహీమ్‌ (150 బంతుల్లో 64; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమీ 4 వికెట్లు పడగొట్టగా... అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేయగా... చివరిదైన రెండో టెస్టు ఈ నెల 22 నుంచి కోల్‌కతాలో జరుగుతుంది.  

టపటపా...
ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించుకునే మొదటి లక్ష్యంతో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను మరోసారి భారత పేసర్లు దెబ్బ తీశారు. మన ‘త్రయం’ చెలరేగిపోవడంతో 72 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ముందుగా ఉమేశ్‌ చక్కటి బంతితో కైస్‌ (6)ను బౌల్డ్‌ చేసి బంగ్లా పతనానికి శ్రీకారం చుట్టాడు. అదే ఓవర్లో మోమినుల్‌ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్‌కు ఫలితం దక్కలేదు. తర్వాతి ఓవ ర్లోనే షాద్‌మన్‌ (6) స్టంప్స్‌ను ఇషాంత్‌ ఎగరగొట్టాడు. ఆ తర్వాత షమీ జోరు మొదలైంది. ముగ్గురు పేసర్లలో షమీ అత్యంత ప్రమాదకరంగా కనిపించాడు.

ఒక దశలో దాదాపు అతను వేసిన ప్రతీ బంతికి వికెట్‌ దక్కేలా కనిపించింది. అతి జాగ్రత్తగా, తీవ్రంగా ఇబ్బంది పడుతూ కొంత సేపు నిలవగలిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌ ఆ తర్వాత చేతులెత్తేశారు. షమీ తన తొలి ఓవర్లోనే మోమినుల్‌ (7)ను ఎల్బీగా అవుట్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా, రివ్యూ కోరిన కోహ్లి వికెట్‌ రాబట్టాడు. ఉమేశ్‌ తర్వాతి ఓవర్లో మరో ఎల్బీ అప్పీల్‌ కోసం ప్రయతి్నంచిన భారత్‌ తమ రెండో రివ్యూను కోల్పోయింది. తన రెండో ఓవర్లో షమీ మళ్లీ చెలరేగి మిథున్‌ (18)ను పెవిలియన్‌ పంపించాడు. లంచ్‌ తర్వాత మహ్ముదుల్లా (15)ను కూడా షమీనే వెనక్కి పంపించడంతో బంగ్లా పరిస్థితి దిగజారింది.

ముష్ఫికర్‌ పోరాటం...
తొలి ఇన్నింగ్స్‌లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ ముష్ఫికర్‌ జట్టును కొంత ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరో వికెట్‌కు అతను లిటన్‌ దాస్‌ (39 బంతుల్లో 35; 6 ఫోర్లు)తో 63 పరుగులు, ఏడో వికెట్‌కు మెహదీ హసన్‌ (55 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో 59 పరుగులు జోడించాడు. 4 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో  సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్‌ వదిలేయడంతో బతికిపోయిన ముషీ ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. మరోవైపు దాస్‌ నుంచి సహకారం లభించింది. ఇషాంత్‌ వేసిన ఒకే ఓవర్లో దాస్‌ మూడు ఫోర్లు కొట్టడం విశేషం.

అయితే దాస్‌ను చక్కటి రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేసిన అశి్వన్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచి్చన మెహదీ కూడా ముష్ఫికర్‌కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో 101 బంతుల్లో ముషీ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే టీ విరామం తర్వాత తొలి ఓవర్లోనే మెహదీని ఉమేశ్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత బంగ్లా ఆట ముగియడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఐదు పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది. కనీసం భారత ఓపెనర్‌ మయాంక్‌ చేసిన స్కోరును రెండు ఇన్నింగ్స్‌లలో కూడా బంగ్లా అందుకోలేకపోవడం విశేషం.  

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 150
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 493/6 డిక్లేర్డ్‌

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (బి) ఇషాంత్‌ 6; కైస్‌ (బి) ఉమేశ్‌ 6; మోమినుల్‌ (ఎల్బీ) (బి) షమీ 7; మిథున్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 18; ముషి్ఫకర్‌ (సి) పుజారా (బి) అశి్వన్‌ 64; మహ్ముదుల్లా (సి) రోహిత్‌ (బి) షమీ 15; లిటన్‌ దాస్‌ (సి) అండ్‌ (బి) అశి్వన్‌ 35; మెహదీ హసన్‌ (బి) ఉమేశ్‌ 38; తైజుల్‌ (సి) వృద్ధిమాన్‌ సాహా (బి) షమీ 6; జాయెద్‌ (నాటౌట్‌) 4; ఇబాదత్‌ (సి) ఉమేశ్‌ యాదవ్‌ (బి) అశి్వన్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్‌) 213.  

వికెట్ల పతనం: 1–10; 2–16; 3–37; 4–44; 5–72; 6–135; 7–194; 8–208; 9–208; 10–213.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 11–3–31–1; ఉమేశ్‌ యాదవ్‌ 14–1–51–2; షమీ 16–7–31–4; జడేజా 14–2–47–0; అశి్వన్‌ 14.2–6–42–3.

►6 భారత్‌కు ఇది వరుసగా ఆరో టెస్టు విజయం. 2013లో ధోని నాయకత్వంలో కూడా జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచింది.  

►10 కోహ్లి కెప్టెన్సీలో భారత్‌కు ఇది 10వ ఇన్నింగ్స్‌ విజయం. గతంలో ధోని నాయకత్వంలో 9 ఇన్నింగ్స్‌ విజయాలు వచ్చాయి.

►3 భారత జట్టు వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడం ఇది మూడోసారి. గతంలో 1992–1994 మధ్య రెండు సార్లు ఈ ఫీట్‌ నమోదైంది.

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇది మరో అద్భుత ప్రదర్శన. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడితే ఒక్కడే మొత్తం బాధ్యత తీసుకున్నాడు. రాబోయే విదేశీ పర్యటనల్లో కూడా మేం ఇదే ఆశిస్తున్నాం. మా ఆటగాళ్లకు అభినందనలు. మా పేస్‌ బౌలర్ల అత్యుత్తమ దశ కొనసాగుతోంది. వారు బౌలింగ్‌ చేస్తుంటే ఏ పిచ్‌ అయినా వారికే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంకా బుమ్రా ఇక్కడ లేడు కానీ ఏ కెప్టెన్ కైనా ఇది కలల బౌలింగ్‌ దళమని చెప్పగలను. పదునైన బౌలర్లు ఉండటం ఏ జట్టుకైనా అవసరం. అంకెలు, రికార్డులు అందరూ చూస్తూనే ఉన్నారు.

కానీ నా దృష్టిలో అవి కాగితాలకే పరిమితం. నేను వాటిని పట్టించుకోను. భారత క్రికెట్‌ ప్రమాణాలు, స్థాయి పెంచడమే మా లక్ష్యం. ఒక జట్టుగా గణాంకాల గురించి ఎప్పుడూ ఆలోచించం. ఒక కుర్రాడు నిలదొక్కుకొని భారీ స్కోర్లు సాధించడం ఎంత కష్టమో, వాటి ప్రాధాన్యత ఏమిటో నాకు తెలుసు. సీనియర్‌గా వారిని నేను ప్రోత్సహించడం అవసరం. కుర్ర వయసులో నేను చేసిన తప్పులు వారు చేయకుండా ఉండాలని, మున్ముందు ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా ఎదగాలని కోరుకుంటా.    
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement