సిరీస్‌ చేతికొచ్చేది నేడే... | India vs Bangladesh 2nd Test Day 2 At Kolkata | Sakshi
Sakshi News home page

సిరీస్‌ చేతికొచ్చేది నేడే...

Published Sun, Nov 24 2019 3:30 AM | Last Updated on Sun, Nov 24 2019 10:23 AM

India vs Bangladesh 2nd Test Day 2 At Kolkata - Sakshi

పింక్‌బాల్‌తో భారత్‌ క్లీన్‌స్వీప్‌కు బాటవేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో కదం తొక్కగా... టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌కు దిగీదిగగానే ఇషాంత్‌ జూలు విదిల్చడం ప్రారంభించాడు. దీంతో పర్యాటక జట్టు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవడానికి ఎదురీదుతోంది.   

కోల్‌కతా: బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) నాలుగు రోజుల టికెట్లను విక్రయించింది. డే అండ్‌ నైట్‌ అనుభవాన్ని చవిచూసేందుకు ప్రేక్షకులేమో ఎగబడ్డారు. కానీ మ్యాచేమో మూడో రోజు రాత్రిదాకా కూడా సాగేలా లేదు. తొలి టెస్టులోనే గులాబీ బంతిపై భారత్‌ అంతలా పట్టు దక్కించుకుంది. చారిత్రక డే అండ్‌ నైట్‌ టెస్టు విజయానికి మరింత చేరువైంది. రెండో రోజు ఆటలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ( 194 బంతుల్లో 136; 18 ఫోర్లు) సెంచరీ హైలైట్‌. భారత్‌ తరఫున పింక్‌బాల్‌ టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా ఘనతకెక్కాడు.

వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (69 బంతుల్లో 51; 7 ఫోర్లు) కూడా రాణించాడు. బంగ్లా బౌలర్లలో అల్‌ అమిన్‌ హుస్సేన్, ఇబాదత్‌ హుస్సేన్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి 32.3 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఇషాంత్‌ శర్మ (4/39) దెబ్బకు జట్టంతా కకావికలమైతే... ముషి్ఫకర్‌ రహీమ్‌ (70 బంతుల్లో 59 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధసెంచరీతో క్రీజులో నిలబడ్డాడు.  

కోహ్లి 27వ సెంచరీ...
రెండో రోజు 174/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన భారత్‌ నిలకడగా పరుగులు జతచేసింది. కెప్టెన్‌ కోహ్లి, రహానేలిద్దరు సమన్వయంతో ఆడటంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఈ దశలో రహానే 65 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు కోహ్లి శతకం దిశగా సాగుతుండగా... రహానేను తైజుల్‌ ఇస్లామ్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచి్చన రవీంద్ర జడేజా (12) అండతో విరాట్‌ 159 బంతుల్లో డజను బౌండరీలతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

టెస్టుల్లో కోహ్లికిది 27వ సెంచరీ. 289/4 స్కోరు వద్ద భారత్‌ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో భారత ఇన్నింగ్స్‌ తడబడింది. సెషన్‌ మొదలైన ఓవర్లోనే జడేజాను అబూ జయేద్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. శతకం తర్వాత చకచకా బౌండరీలు బాదిన కోహ్లి జట్టు స్కోరును 300 పరుగులకు చేర్చాడు. తర్వాత కాసేపటికే అతను ఔట్‌ అయ్యాడు. కీపర్‌ సాహా (17 నాటౌట్‌)కు తోడుగా అశి్వన్‌ (9), ఉమేశ్‌ (0), ఇషాంత్‌ (0) నిలబడలేకపోయారు. దీంతో 347/9 స్కోరు వద్ద భారత సారథి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

ఇషాంత్‌ మళ్లీ శివమెత్తాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల భారీ ఆధిక్యం పొందిన భారత శిబిరం ఆనందాన్ని ఇషాంత్‌ శర్మ రెట్టింపు చేశాడు. ఈ సీమర్‌ దూకుడు చూస్తుంటే కొందరికైతే రెండు రోజుల్లో మ్యాచ్‌ ముగుస్తుందేమోనన్న అనుమానం కలిగింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ మొదలైన తొలి ఓవర్లోనే ఓపెనర్‌ షాద్‌మన్‌ (0)ను డకౌట్‌ చేసి తొలిదెబ్బకొట్టాడు. తన రెండో ఓవర్లో కెపె్టన్‌ మోమినుల్‌ హక్‌ (0)ను ఖాతా తెరువనియ్యలేదు. అంతే 2 పరుగులకే 2 వికెట్లు! ఇది చాలదన్నట్లు ఉమేశ్‌ తన వంతుగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మిథున్‌ (6)ను పెవిలియన్‌ చేర్చడంతో పట్టుమని పది పరుగులైనా చేయకముందే (9/3) బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. మరుసటి ఓవర్లో ఇషాంత్‌ పంజాకు క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ కైస్‌ (5) ఔటయ్యాడు.

13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ముషి్ఫకర్‌ రహీమ్, మహ్ముదుల్లా (39; 7 ఫోర్లు) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఈ జోడీ నిలదొక్కుకున్న తర్వాత మహ్ముదుల్లా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా కష్టంగా 100 పరుగుల స్కోరు చేసింది. మళ్లీ ఇషాంత్‌ జూలు విదిల్చడంతో మెహదీ (15), ఉమేశ్‌ బౌలింగ్‌లో తైజుల్‌ (11) నిష్క్రమించారు. 152 పరుగుల వద్ద బంగ్లా ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించుకోవాలంటే బంగ్లా ఇంకా 89 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లున్నాయి.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 106; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) సబ్‌–మెహదీ హసన్‌ (బి) అల్‌ అమిన్‌ 14; రోహిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఇబాదత్‌ 21; పుజారా (సి) షాద్‌మన్‌ (బి) ఇబాదత్‌ 55; కోహ్లి (సి) సబ్‌–తైజుల్‌ (బి) ఇబాదత్‌ 136; రహానే (సి) ఇబాదత్‌ (బి) తైజుల్‌ 51; జడేజా (బి) అబూ జయేద్‌ 12; సాహా (నాటౌట్‌) 17; అశి్వన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అల్‌ అమిన్‌ 9; ఉమేశ్‌ (సి) షాద్‌మన్‌ (బి) అబూ జయేద్‌ 0; ఇషాంత్‌ (ఎల్బీడబ్ల్యూ బి) అల్‌ అమిన్‌ 0; షమీ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (89.4 ఓవర్లలో) 347/9 డిక్లేర్డ్‌. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–137, 4–236, 5–289, 6–308, 7–329, 8–330, 9–331.  బౌలింగ్‌: అల్‌ అమిన్‌ 22.4–3– 85–3, అబూ జయేద్‌ 21–6–77–2, ఇబాదత్‌ 21–3–91–3, తైజుల్‌ ఇస్లామ్‌ 25–2–80–1.

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఇషాంత్‌ 0; ఇమ్రుల్‌ కైస్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 5; మోమినుల్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 0; మిథున్‌ (సి) షమీ (బి) ఉమేశ్‌ 6; ముషి్ఫకర్‌ రహీమ్‌ (బ్యాటింగ్‌) 59; మహ్ముదుల్లా (రిటైర్డ్‌ హర్ట్‌) 39; మెహదీ హసన్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 15; తైజుల్‌ ఇస్లామ్‌ (సి) రహానే (బి) ఉమేశ్‌ 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (32.3 ఓవర్లలో 6 వికెట్లకు) 152
వికెట్ల పతనం: 1–0, 2–2, 3–9, 4–13, 4–82 (మహ్ముదుల్లా రిటైర్డ్‌ హర్ట్‌), 5–133, 6–152. బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 9–1–39–4, ఉమేశ్‌ 10.3–0–40–2, షమీ 8–0– 42–0, అశి్వన్‌ 5–0–19–0.

►1 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ (ఆ్రస్టేలియా–41 సెంచరీలు) సరసన కోహ్లి (41 సెంచరీలు) చేరాడు. గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా–33), స్టీవ్‌ స్మిత్‌ ఆ్రస్టేలియా–20) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement