టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శల నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి పరుగులు చేయకపోవడం పట్ల తానూ సంతోషంగా లేనని పేర్కొన్నాడు.
ఐపీఎల్-2024లో పరుగుల వరద(741) పారించిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 88 పరుగులే చేశాడు.
న్యూయార్క్ వేదికగా లీగ్ మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన కోహ్లి.. వెస్టిండీస్‌లో సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. అఫ్గనిస్తాన్‌తో పోరులో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అతడిని తన రెగ్యులర్ పొజిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆంటిగ్వా వేదికగా శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు కోహ్లి స్థానం గురించి ప్రశ్న ఎదురైంది.
ఇందుకు బదులిస్తూ.. ‘‘కోహ్లిని వన్‌డౌన్‌లో ఆడించాలనే ఆలోచన మాకు లేదు. ప్రస్తుత మా బ్యాటింగ్ ఆర్డర్ పట్ల మేము సంతోషంగానే ఉన్నాం.
పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి జట్టును బట్టి మాత్రమే మా జట్టులో మార్పులు ఉంటాయి’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు.
ఇక కోహ్లి ప్రదర్శన గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘‘అవును నేను ఈ విషయంలో సంతోషంగా లేను. అతడు పరుగుల వరద పారిస్తే చూడాలని ఉంది.
అయితే, ఒక్కోసారి సవాళ్లు ఎదురుకావడం కూడా మన మంచికోసమే. ప్రస్తుత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇండియాలో బ్యాటింగ్ చేసేటపుడు తడబడ్డారు.
ఇప్పుడు ఇక్కడ మాత్రం మెరుగ్గా ఆడుతున్నారు. మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రస్తుతం అదరగొడుతున్నారు. ఈ విషయంలో మాత్రం సంతోషంగా ఉంది’’ అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు.
కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లికి వన్‌డౌన్‌లోనే మెరుగైన రికార్డు ఉంది. మూడో స్థానంలో వచ్చి 113 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్.. 53.96 సగటుతో 135.26 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఓపెనర్‌గా అతడి సగటు 39. స్ట్రైక్‌రేటు 39. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 121 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 4066 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment