రేపటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ మూడో టెస్టు
ఓడితే స్వదేశంలో తొలిసారి క్లీన్‌స్వీప్ కానున్న టీమిండియా
తీవ్ర ఒత్తిడిలో రోహిత్ శర్మ బృందం
అందరి దృష్టి కోహ్లిపైనే
సమరోత్సాహంలో న్యూజిలాండ్
ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్‌స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్‌లో
భారత్‌పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్‌ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్‌స్వీప్‌గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు.
బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్‌పై కూడా తడబడింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది.
బ్యాటర్లపైనే భారం!
కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్‌లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్‌లో ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.
యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉండగా... శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్‌కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.
జోరుగా సాధన
తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్‌తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment