కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం బాగుంది
భారత కెప్టెన్ రోహిత్ శర్మ
రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
చెన్నై: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...భారత క్రికెట్ జట్టు వచ్చే 15 వారాల వ్యవధిలో ఈ మూడు జట్లతో కలిపి 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పరంగా ఇప్పటికే అగ్ర స్థానంలో ఉండి ఫైనల్‌కు చేరువగా ఉన్న టీమిండియా తుది పోరుకు తమ స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సుదీర్ఘ సీజన్ నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లు ఆడించకుండా కొందరు కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లకు మధ్య మధ్యలో విరామం ఇవ్వాల్సి ఉంటుందని భారత కెపె్టన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడాడు. నెల రోజులకు పైగా విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగబోతున్నారు. ‘సుదీర్ఘ సీజన్‌లో కొందరికి అప్పుడప్పుడు విశ్రాంతినివ్వక తప్పదు. మీ అత్యుత్తమ ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆడాలని అంతా కోరుకుంటారు. కానీ వాస్తవికంగా చూస్తే అది సాధ్యం కాదు. టెస్టులు మాత్రమే కాదు, మరో వైపు టి20 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇంత ఎక్కువ క్రికెట్ సాగుతుంటే మనం అన్నీ అర్థం చేసుకొని ముందుకెళ్లాలి.
ముఖ్యంగా బౌలర్ల విషయంలో మరీ కష్టం. వీరి పని భారాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై మాకూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మ్యాచ్‌ల మధ్యలో వారి ఫిట్‌నెస్ ఎలా ఉంటోంది. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పరిస్థితి ఏమిటి. ఫిజియో ఇచ్చే నివేదికను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏ సమయంలో విశ్రాంతినివ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టుపై కూడా ఇది చేయగలిగాం. ఆ సిరీస్‌లో ఒక టెస్టులో బుమ్రాకు, మరో టెస్టులో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చాం’ అని రోహిత్ గుర్తు చేశాడు.
పేసర్ల కొరత లేదు...
దేశవాళీ క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తుండటం మంచి పరిణామమని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో కీలకం అయ్యే అవకాశం ఉందని సెలక్టర్లు భావించడంతో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాళ్‌ను కూడా బంగ్లాతో సిరీస్‌కు జట్టులోకి తీసుకొని అతడిని సానపెడుతున్నారు.
‘మనకు చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు. దులీప్ ట్రోఫీలో కూడా చాలా మందిని నేను చూశాను. అసలు కొత్తగా బౌలర్ల కోసం ఆందోళన చెందాల్సిన అవసరమే లేని పరిస్థితి మనకు ఉంది. ఇది చాలా సానుకూలాశం’ అని కెపె్టన్ అన్నాడు.
అందరితో కలిసి పని చేశాను...
కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు తొలిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతోంది. నెల రోజుల క్రితం ఇదే బృందం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా టీమ్‌తో కలిసి పని చేసింది. అయితే పేరుకు వారంతా కొత్తే అయినా తనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని రోహిత్ అన్నాడు.
ద్రవిడ్ తదితరులతో కూడిన కోచింగ్ స్టాఫ్‌తో పోలిస్తే పనితీరు భిన్నమే అయినా...ఎలాంటి సమస్య లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘కోచింగ్ బృందం కొత్తదే కావచ్చు. కానీ నాకు గంభీర్, అభిõÙక్ నాయర్ బాగా తెలుసు. వీరిద్దరితో ఇప్పటికే శ్రీలంకతో కలిసి పని చేశాను. మోర్కెల్, డస్కటేలకు ప్రత్యరి్థగా ఆడాను. వారిద్దరితో ఎక్కువగా మాట్లాడలేదు కానీ వారు మా జట్టు గురించి బాగా అర్థం చేసుకోగలగడం నేను గుర్తించాను.
ద్రవిడ్, రాథోడ్, మాంబ్రేలతో పోలిస్తే వీరి శైలి భిన్నం. పనితీరులో ఎవరి పద్ధతి వారికుంటుంది. అది పెద్ద సమస్య కాదు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటగాళ్లందరూ పరిస్థితికి తగినట్లుగా కోచింగ్ బృందంతో సరిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. అది మేం చేయగలం’ అని రోహిత్ వివరించాడు.
రిహార్సల్స్ సిరీస్ కాదు...
రాబోయే ఆస్ట్రేలియా వంటి కీలక పర్యటనకు సన్నాహకంగా బంగ్లాదేశ్ సిరీస్‌ను చూడటం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంటుందని, ప్రత్యర్థి బలం గురించి కాకుండా తాము ఏం చేయగలం అనేది చూస్తామని అతను చెప్పాడు. ‘సిరీస్ ఏదైనా దేశం తరఫున ఆడుతున్నామనేది మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడేమీ రిహార్సల్స్ జరగడం లేదు. ప్రతీ టెస్టుకు ప్రాధాన్యత ఉంది.
డబ్ల్యూటీసీ కోణంలో చూస్తే ఉదాసీనతకు అవకాశం లేదు. ఎక్కడ ఆడతామనేది విషయం కాదు. గెలవడమే అన్నింటికంటే ప్రధానం. మ్యాచ్‌కు వారం రోజుల ముందే ఇక్కడకు వచ్చాం. సన్నాహకాలు చాలా బాగా సాగాయి. దొరికిన కాస్త సమయాన్ని బాగా వాడుకున్నాం. మేమందరం టెస్టు సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’ అని రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment