నేటి నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు
ఫేవరెట్‌గా టీమిండియా
సంచలనంపై బంగ్లాదేశ్ ఆశలు
ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై గత 12 ఏళ్లలో ఒక్క టెస్టు సిరీస్ కూడా చేజార్చుకోని రికార్డు... 51 టెస్టులు ఆడితే 40 విజయాలు, 4 ఓటములు మాత్రమే... ఇదీ భారత జట్టు స్థాయి. మరోవైపు భారత్‌పై ఆడిన 13 టెస్టుల్లో ఒక్క గెలుపు లేకపోగా 11 ఓటములే... వాటిలో భారత గడ్డపై ఆడిన మూడింటిలోనూ చిత్తుగా ఓడిన వైనం... బంగ్లాదేశ్ రికార్డు ఇది!
ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే మరో మాటకు తావు లేకుండా భారత్‌దే పైచేయి కాగా... ఇటీవల పాకిస్తాన్‌పై సాధించిన గెలుపుతో బంగ్లాదేశ్ ప్రదర్శన కాస్త ఆసక్తి రేపుతోంది. మన స్థాయికి తగినట్లుగా టీమిండియా ప్రత్యర్థిపై చెలరేగుతుందా... లేక బంగ్లాదేశ్ కాస్త పోటీ ఇస్తుందా అనేదే ఆసక్తికరం.
చెన్నై: భారత జట్టు ఈ ఏడాది మార్చిలో తమ చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎంఎ చిదంబరం స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. రాబోయే రెండున్నర నెలల వ్యవధిలో టీమిండియా ఆడబోయే 10 టెస్టుల్లో ఇది మొదటిది.
తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థితో తలపడుతున్న రోహిత్ శర్మ బృందం సత్తా చాటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత పొందేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు పాకిస్తాన్‌లో జరిగిన తరహాలోనే బంగ్లాదేశ్ కూడా ఏ మూలో సంచలనాన్ని ఆశిస్తోంది.
పంత్ చాలా కాలం తర్వాత...
భారత్ తుది జట్టు ఎంపికకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదు. ఇంగ్లండ్‌పై ధర్మశాలలో టీమిండియా తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ జట్టులో మూడు మార్పులతో ఈసారి టీమ్ బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడని కోహ్లి జట్టులోకి వచ్చాడు. నాటి మ్యాచ్ ఆడిన పడిక్కల్‌కు ఇప్పుడు చోటు లేదు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురేల్ స్థానంలో రిషభ్ పంత్, మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌కు బదులుగా కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం.
2022లో బంగ్లాదేశ్‌పైనే పంత్ తన ఆఖరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత కారు ప్రమాదం, ఆపై కోలుకున్న తర్వాత టి20లు వన్డేల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతనికి ఇదే మొదటి టెస్టు. ఇటీవల దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆడిన పంత్ 125.4 ఓవర్ల పాటు కీపింగ్ చేసి తన ఫిట్‌నెస్‌ను కూడా నిరూపించుకున్నాడు. టెస్టు బ్యాటర్‌గా రాహుల్ ప్రతిభపై సందేహం లేదు.
ఈ ఏడాది జనవరి (దక్షిణాఫ్రికాపై) తర్వాత టెస్టు ఆడబోతున్నా... కోహ్లి స్థాయి ప్లేయర్‌గా ఫామ్ అందుకోవడం పెద్ద సమస్య కాదు. టాప్–3లో కూడా రోహిత్, యశస్వి, గిల్‌లతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సాధారణంగా సొంతగడ్డపై భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. ఈసారీ అదే చేస్తే బుమ్రా, సిరాజ్ పేసర్లుగా దిగుతారు. జడేజా, కుల్దీప్‌లతో పాటు తన సొంత మైదానంలో సీనియర్ ప్లేయర్ అశ్విన్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు.
సీనియర్లను నమ్ముకొని...
పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఇటీవల 2–0తో క్లీన్‌స్వీప్ చేసి ఉండవచ్చు. కానీ భారత్‌తో పోలిస్తే టెస్టుల్లో పాక్ చాలా బలహీనమైన జట్టు కాబట్టి ఈ సిరీస్‌తో పోలిక అనవసరం. భారత్‌పై బంగ్లా ఏనాడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది.
అయితే ఆ జట్టు కోణంలో చూస్తే పాక్‌పై విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని కాస్త పెంచిందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, ముషి్ఫకర్ జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో మెరుగైన లిటన్ దాస్ కూడా జట్టుకు కీలకం కానున్నాడు.
కెప్టెన్ నజ్ముల్ ఫామ్‌లో లేకపోగా... అనుభవం లేని షాద్‌మన్, జాకీర్ ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మాత్రం బంగ్లా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బంగ్లా కూడా ముగ్గురు స్పిన్నర్లు షకీబ్, మిరాజ్, తైజుల్‌లతో బరిలోకి దిగడం ఖాయం. ఇటీవల మిరాజ్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం.
బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభావంతులైన, సీనియర్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వారి స్పిన్ కూడా పటిష్టంగా ఉంది. అయినా సరే వారిని ఎదుర్కోగల బ్యాటింగ్ మా సొంతం. మొదటి బంతి నుంచే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాం. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయం. ప్రస్తుత మా బౌలింగ్ బృందం పట్ల చాలా గర్వంగా ఉన్నా. నాతో కలిసి ఆడిన ప్లేయర్లే ఇప్పుడు సీనియర్లుగా ఉన్నారు. వారితో మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం.
కోచింగ్ బృందంలో ఎవరున్నా పరిస్థితులను బట్టి జట్టు ఆట శైలి మారడం ముఖ్యం. లేదంటే ఆ జట్టు అక్కడే ఆగిపోతుంది. పిచ్‌పై చర్చ అనవసరం. ఇక్కడికి వచ్చే జట్లు స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకోవాలి తప్ప పిచ్ గురించి మాట్లాడవద్దు. సర్ఫరాజ్, జురేల్ గత సిరీస్‌లో బాగా ఆడినా కొన్ని సార్లు పక్కకు తప్పుకొని తమ అవకాశం కోసం వేచి ఉండక తప్పదు. – గౌతమ్ గంభీర్, భారత కోచ్
పిచ్, వాతావరణం
ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్‌పై మ్యాచ్ జరగనుంది. దాంతో టెస్టు ఆరంభంలో మంచి బౌన్స్ ఉంటుంది. అయితే చెన్నైలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మ్యాచ్ సాగిన కొద్దీ పిచ్‌పై పగుళ్లు ఖాయం. దాంతో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవడం ఖాయం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, జడేజా, పంత్, అశి్వన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), షాద్‌మన్, జాకీర్, మోమినుల్, ముష్ఫికర్, దాస్, షకీబ్, మిరాజ్, తస్కీన్, హసన్, తైజుల్.
Comments
Please login to add a commentAdd a comment