‘లార్డ్‌’ బవుమా | Safari team wins ICC trophy after 27 years | Sakshi
Sakshi News home page

‘లార్డ్‌’ బవుమా

Jun 16 2025 2:52 AM | Updated on Jun 16 2025 2:52 AM

Safari team wins ICC trophy after 27 years

దక్షిణాఫ్రికా సారథిపై ప్రశంసల జల్లు

27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన సఫారీ బృందం

జట్టును ముందుండి నడిపించిన బవుమా

ఫైనల్లోనూ అసమాన పోరాటంతో ‘గద’ కైవసం   

‘కోటా’ వల్లే కొనసాగుతున్నాడనే విమర్శలు... ఆటగాడిగానూ అర్హత లేని వాడికి సారథ్యమా అనే విసుర్లు... సోషల్‌ మీడియాలో లెక్కకు మిక్కిలి మీమ్స్‌... కొన్నాళ్ల క్రితం ఆ ఆటగాడి పరిస్థితి ఇది! కానీ వాటన్నింటిని లెక్క చేయని ఆ ప్లేయర్‌... ‘పక్షి కన్నుకు గురి పెట్టిన పార్థుడిలా...’ లక్ష్యాన్ని మాత్రమే స్వప్నించాడు. దాని కోసమే తపించాడు. అహర్నిశలు దానికై సర్వశక్తులు ధారపోశాడు. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. తమ దేశాభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించి... అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.

లార్డ్స్‌ బాల్కానీలో ఐసీసీ గద చేతబూని సగర్వంగా చిరు దరహాసం చేసిన ఆ ఐదడుగుల నాలుగు అంగుళాల ప్లేయరే తెంబా బవుమా. ‘బ్లాక్‌ ఆఫ్రికన్‌’ కాబట్టే జట్టులో చోటు దక్కిందనే విమర్శల దశ నుంచి... 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి పేరు మారుమోగుతోంది. 

ప్రధాన జట్లతో ఆడకుండానే ఫైనల్‌ చేరారనే విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చిన బవుమా... తుదిపోరులో తమ మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కంగారూలు ‘చోకర్స్‌’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. సఫారీ జట్టును ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిపిన బవుమా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే...  – సాక్షి క్రీడావిభాగం  

లార్డ్స్‌ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో... దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. స్కోరు బోర్డుపై 70 పరుగులు చేరేసరికి రెండు వికెట్లు నేలకూలాయి. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే సఫారీ జట్టుకు ఇంకా 212 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు లార్డ్స్‌ లాంజ్‌ రూమ్‌ నుంచి దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ మైదానంలో అడుగు పెట్టాడు. అప్పటి వరకు పేసర్లు పండగ చేసుకున్న పిచ్‌ అది. అందులోనూ మిచెల్‌ స్టార్క్, జోష్‌ హాజల్‌వుడ్, ప్యాట్‌ కమిన్స్‌ వంటి ఆరున్నర అడుగుల ఆజానుబావుల భీకర బౌలింగ్‌. 

ఒక ఎండ్‌లో మార్క్‌రమ్‌ పోరాడుతున్నా... అతడికి సహకరించే వారేరి అనే అనుమానాలు. గతేడాది ఆరంభంలో కేప్‌టౌన్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులోనూ మార్క్‌రమ్‌ ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినా అతడికి అండగా నిలిచేవారు లేక సఫారీ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. లార్డ్స్‌లోనూ దాదాపు అదే ప్రమాద ఘంటికలు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్న వారిలో పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. ఇలాంటి దశలో బవుమా తన కెరీర్‌లో అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

అప్పటి వరకు 63 టెస్టులాడినా... కేవలం నాలుగు శతకాలే సాధించిన అతడు... లార్డ్స్‌లో ఆణిముత్యంలాంటి అర్ధసెంచరీతో మార్క్‌రమ్‌కు అండగా నిలిచాడు. ఆసీస్‌ పేసర్లు బాడీలైన్‌ బౌలింగ్‌తో పరీక్ష పెడుతున్నా... ప్రత్యర్థులు తన ఎత్తును అదునుగా చేసుకొని బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. క్రీజులో అడుగుపెట్టిన కాసేపటికే కండరాలు పట్టేసినా... మైదానం వీడితే క్షణాల్లో మ్యాచ్‌ను లాగేసుకోవడంలో సిద్ధహస్తులైన కంగారూలకు అవకాశం ఇవ్వకుండా నొప్పిని పంటిబిగువున భరిస్తూనే మార్క్‌రమ్‌కు అండగా నిలిచాడు. దీంతో స్వేచ్ఛగా ఆడిన మార్క్‌రమ్‌ జట్టును విజయ తీరాలకు చేరువ చేశాడు.  

సార్థక నామధేయుడు 
తెంబా బవుమా పేరు వెనక ఒక చరిత్ర ఉంది. దక్షణాఫ్రికా స్థానిక జులూ భాషలో తెంబా అంటే ‘ఆశ’ అని అర్థం. అందుకు తగ్గట్లే ఎప్పుడూ ఆశావాహ దృక్పథంతోనే ఉండే బవుమా... ‘పొట్టివాడు గట్టివాడు’ అని తన చేతలతో నిరూపించాడు. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడాలంటే... ఆట ఆరంభానికి ముందే ప్రత్యర్థి మానసికంగా కుంగిపోవడం ఖాయం. అలాంటిది డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన కంగారూలను కంగుతినిపిస్తూ బవుమా జట్టును నడిపిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

‘చోకర్స్‌’ ముద్రను చెరిపేస్తూ... ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌లో తమ జట్టును సుదీర్ఘ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిపిన అతడి నాయకత్వ సామర్థ్యాన్ని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. గతంలో విరాట్‌ కోహ్లి మాదిరిగా ‘అతి సంబరాల’తో విమర్శల పాలైన బవుమా... డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్‌ వెరీన్‌ విన్నింగ్‌ రన్స్‌ కొట్టిన తర్వాత ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని... కళ్లలో నీటి చెమ్మ కనిపించకుండా ముభావంగా కూర్చుండిపోయాడు. సహచరులంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే... భారీ బరువేదో భుజస్కంధాలపై నుంచి దించేసుకున్నట్లు నింపాదిగా లేచి అందరితో కలిసిపోయాడు. 

‘లాంగా’ నుంచి లార్డ్స్‌ వరకు... 
దక్షిణాఫ్రికా మూడు రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌లో నల్లజాతీయులు అధికంగా నివసించే ‘లాంగా’లో బవుమా క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది. పదేళ్ల ప్రాయంలో వీధుల్లో క్రికెట్‌ ఆడుతూ... గల్లీకొక మైదానం పేరుతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన బవుమా... పదకొండేళ్లకు స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత కఠోర శ్రమ, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ఆటను మెరుగు పర్చుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమీప బంధువు సూచనలు పాటిస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ జాతీయ జట్టు వరకు చేరుకున్నాడు. 

ప్రతీక్షణం నిరూపించుకోవాల్సిన కఠిన పరిస్థితులను ఎదురొడ్డి వచ్చిన అవకాశాలను అతడు సది్వనియోగ పర్చుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో అతడి స్థానానికి భరోసా లేకపోయింది. అయితే డీన్‌ ఎల్గర్‌ రిటైర్మెంట్‌ అనంతరం అనూహ్యంగా సారథిగా ఎంపికైన తెంబా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్‌లో జట్టు పగ్గాలు అందుకున్న బవుమా... కెపె్టన్‌గా ఆడిన తొలి 10 టెస్టుల్లో ఓటమి ఎరగని రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆటగాడిగానూ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 59.25 సగటుతో 711 పరుగులు చేశాడు. 

అందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. భాగస్వామ్యాలకు పెట్టింది పేరైన బవుమా... ఈ డబ్ల్యూటీసీ సర్కిల్‌లో 60.35 పార్ట్‌నర్‌షిప్‌ సగటుతో అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ‘గత కొన్నేళ్లుగా తెంబా జట్టును సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఫైనల్లో నా ప్రదర్శన వెనక అతడి ప్రోద్బలం ఎంతో ఉంది. కండరాలు పట్టేసిన స్థితిలో పరుగు తీయడం ఇబ్బందిగా మారినా మైదానాన్ని వీడకుండా పోరాడాడు. కీలక పరుగులతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చిరస్మర విజయంలో కీలకపాత్ర పోషించాడు’ అని తన సారథిపై మార్క్‌రమ్‌ ప్రశంసలు కురిపించాడు. 

నిస్వార్థ నాయకుడు... 
జట్టు ఓడితే ఆ బాధ్యత తాను వహించి... గెలిస్తే సహచరులకు ఆ క్రెడిట్‌ ఇచ్చేవాడే అత్యుత్తమ నాయకుడు. ఈ కోవలో చూస్తే బవుమాకు 100కు 100 మార్కులు పడతాయి. ఫైనల్లో తన అసమాన ప్రదర్శనను పక్కనపెట్టి... రబాడ, ఇన్‌గిడి, మార్క్‌రమ్‌ పోరాటంతోనే జట్టు విజయం సాధించిందని చెప్పిన గొప్ప మనసు బవుమాది. ‘జట్టంతా సమష్టిగా రాణిస్తేనే నిలకడగా విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. మా టీమ్‌ అందుకు నిదర్శనం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడంలో మేమెప్పుడూ ముందుంటాం. ఒకరి విజయాలను మరొకరం ఆస్వాదిస్తాం. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. 

ప్రతి రోజు మెరుగయ్యేందుకు ప్రయత్నించడమే మా విజయ లక్ష్యం’ అని బవుమా అన్నాడు. అతడు అన్నట్లుగానే 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్‌ను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఏ ఒక్క ఆటగాడి ప్రదర్శనపైనో అతిగా ఆధారపడలేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్నారంటే సఫారీ జట్టు ‘టీమ్‌ వర్క్‌’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

అందరిని కలుపుకుంటూ...  
మార్క్‌రమ్, బెడింగ్‌హామ్, స్టబ్స్‌ వంటి తెల్లజాతీయులు, కేశవ్‌ మహరాజ్, ముత్తుస్వామి వంటి భారత సంతతి ఆటగాళ్లు, రబాడ, ఇన్‌గిడి వంటి నల్ల జాతీయులు కలగలిపి ఉన్న దక్షిణాఫ్రికా జట్టును బవుమా చక్కగా నడిపించాడు. ‘విభిన్న నేపథ్యాల వాళ్లమైనా... జట్టుగా మేమంతా ఒక్కటే. సమష్టి ప్రదర్శనకు దక్కిన చక్కటి ఫలితమిది’ అని మ్యాచ్‌ అనంతరం బవుమా పేర్కొన్నాడు. 

‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం సమయంలో జట్టు సహచరుడు క్వింటన్‌ డికాక్‌ మోకాళ్లపై నిల్చునేందుకు నిరాకరించిన నోరు మెదపని బవుమా... ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దక్షిణాఫ్రికా జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందించిన తొలి నల్లజాతి సారథిగా చరిత్రకెక్కాడు. మైదానం బయట కూడా మంచి మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్న బవుమా... ప్రస్తుతం నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్‌ నడుపుతున్నాడు. వాళ్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఈ సంస్థ సహకారం అందిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement