ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న ఇరు జట్ల ప్లేయర్లు ∙ రేపటి నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు
చెన్నై: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ నేపథ్యంలో... ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుబ్‌మన్‌గిల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడ్చగా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ తగు సూచనలు చేయగా... సహాయక కోచ్‌లు ర్యాన్ టెన్ డస్కటే, అభిõÙక్ నాయర్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.
ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌పై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్‌లో మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత పంత్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. చెన్నై పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. అందుకే నెట్స్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం కనిపించింది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్లేయర్లు ఎర్రమట్టి పిచ్‌తో పాటు నల్లమట్టి పిచ్‌పై ప్రాక్టీస్ సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment