నాలుగోసారీ ఛేదించాం | Another victory for India in the World Cup | Sakshi
Sakshi News home page

నాలుగోసారీ ఛేదించాం

Published Fri, Oct 20 2023 3:48 AM | Last Updated on Sat, Oct 21 2023 9:39 AM

Another victory for India in the World Cup - Sakshi

మళ్లీ అదే వ్యూహం... అదే ఫలితం... పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం... ఆపై మెరుపు బ్యాటింగ్‌తో వేగంగా విజయాన్నందుకోవడం... 199, 272, 191, 256... ఇలా ప్రత్యర్థి స్కోర్లు మారడమే తప్ప భారత జట్టు ఆట మారలేదు... సమష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది... వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా తమ విజయాల స్కోరును 4/4గా మార్చుకుంది... బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై సులువైన విజయంతో రోహిత్‌ బృందం సత్తా చాటింది. 

బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ నామమాత్రపు స్కోరుకు పరిమితం కాగా... రోహిత్, గిల్, కోహ్లి బ్యాటింగ్‌తో అలవోకగా భారత జట్టు లక్ష్యం చేరింది... చిన్నపాటి లక్ష్యంలో కూడా చివర్లో చెలరేగి కోహ్లి 48వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడం మ్యాచ్‌లో హైలైట్‌.  

పుణే: తిరుగులేని ప్రదర్శనతో భారత్‌ వరల్డ్‌కప్‌లో మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), తన్‌జీద్‌ హసన్‌ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహ్ముదుల్లా (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు.

అనంతరం భారత్‌ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా... గిల్‌ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (40 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. భారత్‌ ఆదివారం జరిగే తమ తర్వాతి పోరులో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 

ఓపెనర్ల జోరు... 
బంగ్లాకు ఓపెనర్లు తన్‌జీద్, దాస్‌ శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చారు. శార్దుల్‌ తొలి ఓవర్లో తన్‌జీద్‌ వరుసగా 6, 4, 6 బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 41 బంతుల్లో తన్‌జీద్‌ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని కుల్దీప్‌ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. అంతే...ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా విఫలమయ్యారు.

93/0తో ఒకదశలో పటిష్ట స్థితిలో కనిపించిన జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. నజు్మల్‌ (8), మిరాజ్‌ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... 62 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న దాస్‌ వీరిని అనుసరించాడు. తౌహీద్‌ (16) బంతులు వృథా చేయగా, ముషి్ఫకర్‌ రహీమ్‌ (46 బంతుల్లో 38; 1 ఫోర్, 1 సిక్స్‌) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

అయితే మన పటిష్ట బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. చివర్లో మహ్ముదుల్లా ధాటిగా ఆడటంతో బంగ్లా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గాయం కారణంగా కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్, ప్రధాన పేసర్‌ తస్కీన్‌ అహ్మద్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆట ఆరంభానికి ముందే బంగ్లా బలహీన పడింది.  

కీలక భాగస్వామ్యాలు... 
ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్‌ తనదైన శైలిలో దూకుడు చూపిస్తూ వరుస బౌండరీలతో దూసుకుపోయాడు. మరోవైపు నసుమ్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో జోరు పెంచిన గిల్‌... ముస్తఫిజుర్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే హసన్‌ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన రోహిత్‌ తర్వాతి బంతికి అదే తరహా షాట్‌ ఆడబోయి వెనుదిరగడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి బాధ్యత తీసుకోగా... 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత గిల్‌  నిష్క్రమించాడు.

చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ (34 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగా, వీరిని నిలువరించలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. 

48 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు కోహ్లి మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. రోహిత్‌ (31) మూడో స్థానంలో ఉన్నాడు.  

4 వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో భారత జట్టుపై ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు/సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు హాఫ్‌ సెంచరీలు/సెంచరీలు చేసిన మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓటమి చెందగా... నాలుగోసారి మాత్రం భారత్‌ గెలిచింది.   

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తన్‌జీద్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 51; లిటన్‌ దాస్‌ (సి) గిల్‌ (బి) జడేజా 66; నజ్ముల్‌ (ఎల్బీ) (బి) జడేజా 8; మిరాజ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 3; తౌహీద్‌ (సి) గిల్‌ (బి) శార్దుల్‌ 16; ముష్ఫికర్‌ (సి) జడేజా (బి) బుమ్రా 38; మహ్ముదుల్లా (బి) బుమ్రా 46; నసుమ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 14; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 1; షరీఫుల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–93, 2–110, 3–129, 4–137, 5–179, 6–201, 7–233, 8–248. 
బౌలింగ్‌: బుమ్రా 10–1–41–2, సిరాజ్‌ 10–0–60–2, పాండ్యా 0.3–0–8–0, కోహ్లి 0.3–0–2–0, శార్దుల్‌ 9–0–59–1, కుల్దీప్‌ 10–0–47–1, జడేజా 10–0–38–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) తౌహీద్‌ (బి) హసన్‌ 48; గిల్‌ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్‌ 53; కోహ్లి (నాటౌట్‌) 103; అయ్యర్‌ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్‌ 19; రాహుల్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–88, 2–132, 3–178. బౌలింగ్‌: షరీఫుల్‌ 8–0–54–0, ముస్తఫిజుర్‌ 5–0–29–0, నసుమ్‌ 9.3–0–60–0, హసన్‌ 8–0–65–1, మిరాజ్‌ 10–0–47–2, మహ్మదుల్లా 1–0–6–0.  

ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా  X  పాకిస్తాన్‌  
వేదిక: బెంగళూరు
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement