
మైతేయిల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు అల్లర్లకు దారితీసింది
తెలంగాణ ఆరె కటిక సంఘం పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జాతీయ స్థాయిలో ఎస్సీ హోదా కల్పించాలన్న ఆరె కటిక సంఘం పిటిషన్‌పై విచారణకు నో
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్‌లో జరిగిన అల్లర్లను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది కాబట్టి.. పార్లమెంట్‌నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక (ఖటిక్) అసోసియేషన్ జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గంలో ఉన్నారని ఆరె కటిక అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది.
శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది రహీమ్, రాజు సోంకర్‌లు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. ‘అసలు మీ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం?’అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.
‘మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులస్తులకు సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఏం జరిగింది? మణిపూర్‌లో ఎలా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
అందుకు సైతం ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ..‘కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లినా మీకు పరిష్కారం దొరకదు. కాబట్టి పార్లమెంట్‌ను ఆశ్రయించండి’ అని చెప్పింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది రహీమ్ చెప్పగా కేసును ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment