బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా..
హైదరాబాద్: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి-2 సినిమాను వివాదాలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. కట్టప్ప(సత్యరాజ్)కు వ్యతిరేకంగా కన్నడిగల ఆందోళన మొదలు.. ఏపీలో ఆరు షోలకు అనుమతినా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆరెకటిక కుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు.
సోమవారం హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆరెకటిక సంఘాలు.. బాహుబలి-2లో తమ కులాన్ని కించపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని డిమాడ్ చేశారు. ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ సహా పలువురు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
ఏమిటి వివాదం?: శుక్రవారం విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడారని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరెకటిక పోరాట సమితి ఆరోపించింది. అభ్యంతరం చెప్పాల్సిన సెన్సార్ బోర్డు సైతం కటిక చీకటి పదానికి అనుమతినివ్వడం దారుణమని మండిపడింది. దీనికి బాధ్యులైన బాహుబలి దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రాజమౌళి, శోభు, ప్రసాద్‌లపై ఆరెకటిక పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తీవ్ర హెచ్చరికలు: బాహుబలి-2 నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఆరెకటిక పోరాట సమితి హెచ్చరించింది. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.