సాక్షి, అమరావతి: రైల్వేలో సరుకు రవాణాకు 1,115 కి.మీ. మేర డెడికేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రైల్వేలో అతిపెద్ద డెడికేటెడ్ కారిడార్ ఇదే కానుంది. మొదటి దశలో సరుకు రవాణా కారిడార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా-కాన్పూర్ మధ్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్ ప్రస్తుతం ఆపరేషనల్ దశలో ఉంది. రెండో దశ కింద విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య 1,115 కి.మీ. మేర నిర్మించేందుకు సాధ్యాసాధ్య (ఫీజబిలిటీ) నివేదికను డీఎఫ్‌సీసీఐఎల్ (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వచ్చే ఏడాది ఆఖరు నాటికి సిద్ధం చేయనుంది.
విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు ఈ కారిడార్ నిర్మించడానికి రూ.40 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీఎఫ్‌సీసీఐఎల్ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టును 2030 కల్లా పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కారిడార్‌ను చెన్నై-హౌరా మెయిన్‌లైన్‌కు సమాంతరంగా కోస్తా జిల్లాల మీదుగా నిర్మిస్తారు. దీన్ని 2018లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని రైల్వే ఫ్లై ఓవర్ల మీదుగా లేకుండా నిర్మించేందుకు డిజైన్ రూపొందించినట్లు కంటైనర్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఏపీకి వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
అన్ని పోర్టులను కలుపుతూ..
►ఈ డెడికేటెడ్ కారిడార్‌ను విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను అనుసంధానిస్తూ నిర్మిస్తారు.
►పోర్టులకు కనెక్టివిటీ ఉండటం వల్ల అవి అభివృద్ధి చెందడంతోపాటు సరుకు రవాణా ఎంతో సులభతరంగా ఉంటుంది.
►సాధారణంగా సరకు రవాణా రైళ్లు సగటున గంటకు 25-30 కి.మీ. వేగంతో వెళుతున్నాయి.
►డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఈ రైళ్లు 70-80 కి.మీ. వేగంతో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
►డెడికేటెడ్ కారిడార్‌ను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌తో నిర్మిస్తారు.
సరుకు రవాణా ఛార్జీలు ఎంతో తగ్గుతాయి..
డెడికేటెడ్ కారిడార్ నిర్మాణంతో సరుకు రవాణా ఛార్జీలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. ఈ కారిడార్ నిర్మాణం ఏపీ పారిశ్రామిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది.
- ఎంవై యాదవ్, జీఎం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment