kharagpur
-
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
MP: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో..
రాట్నం వడకడం అనేది సాంకేతిక విషయం కాదు. స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉన్న విలువైన చారిత్రక జ్ఞాపకం. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతీక్ష సోనీకి ఆ చారిత్రక జ్ఞాపకాల సమహారం అంటే ఇష్టం. వాటి నుంచి స్ఫూర్తి పొంది నలుగురికి సహాయపడడం అంటే ఇష్టం... మధ్యప్రదేశ్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రతీక్ష సోనీ బాల్యం నుంచి బాపూజీ గురించి వింటూ పెరిగింది. రాట్నం వడకడం ద్వారా స్వదేశీ ఖాదీ ఉద్యమానికి ఊపిరులూదిన మహాత్ముడి గురించి ఎన్నో కథలు విన్నది. అలా తనకు తెలియకుండానే రాట్నం వడకడంపై ఆసక్తి మొదలైంది. చివరికి అదే తన ఉపాధిగా మారింది. ‘మహాత్ముడు మాకు ఉపాధి కల్పించాడు. ఇంటి దగ్గరే రాట్నం వడుకుతూ ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటున్నాం. ఇదంతా ఆ మహాత్ముడి దయ’ అంటుంది పద్దెనిమిది సంవత్సరాల ప్రతీక్ష. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 93 మందికి పైగా మహిళలకు రాట్నం వడకడం నేర్పించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది ప్రతీక్ష. ‘ఒకరోజు కూలి దొరికి, మరొక రోజు దొరకక ఆర్థికంగా ఇబ్బందులు పడేదాన్ని. అప్పులు చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితులలో ప్రతీక్ష నాకు కొత్త దారి చూపించింది’ అంటుంది ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సుమిత్ర. ఇరవై సంవత్సరాల విమల పట్నంలో ఉద్యోగం చేయడానికి వెళ్లింది. అయితే మూడు నెలలు గడవకుండానే తాను అక్కడ ఉండడం కష్టమనే విషయం అర్థమైంది. తన జీతంలో సగం డబ్బులు ఇంటి అద్దెకే పోయేవి. అలా అని ఊరుకెళ్లలేని పరిస్థితి. అక్కడ ఏ పని దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతీక్ష గురించి తెలుసుకుంది. రాట్నం వడకడం నేర్చుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఊళ్లోనే ఉంటుంది విమల. ఇటీవల నేపియ పట్టణంలో జరిగిన స్వదేశి ఖాదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీక్ష– ‘ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్తేజం వస్తుంది. పదిమందికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వారు పరిచయం అవుతారు. అలాంటి వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అంటుంది. చదవండి: 54 ఏళ్ల క్రితం హడలెత్తించిన 'డ్రమ్ములో శవం' పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
షాకింగ్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
కోల్‌కతా: రైల్వే లైన్ ఓల్టేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలుసు. ఆ తీగలను తాకిన క్షణాల్లోనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. అదీ ప్లాట్ ఫారమ్‌పై ఉన్న వ్యక్తిపై తెగి పడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ఖారగ్పూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్ ఫారమ్‌పై టికెట్ కలెక్టర్(టీసీ) నిలుచుని ఉండగా.. ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు సుజన్ సింఘ్ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనంత్ రూపనగూడి అనే రైల్వే సిబ్బంది ట్విటర్లో వీడియో షేర్ చేశారు. ‘విచిత్రమైన ప్రమాదం. ఒక పెద్ద లూస్ కేబుల్ పక్షుల వల్ల ఓహెచ్ఈ తీగపై పడింది. దీంతో హైఓల్టేజ్ తీగ టీటీఈ తలపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. A freak accident - a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment - at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF — Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022 ఇదీ చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
డెడికేటెడ్ కారిడార్‌తో సరుకు రవాణా సులభం
సాక్షి, అమరావతి: రైల్వేలో సరుకు రవాణాకు 1,115 కి.మీ. మేర డెడికేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రైల్వేలో అతిపెద్ద డెడికేటెడ్ కారిడార్ ఇదే కానుంది. మొదటి దశలో సరుకు రవాణా కారిడార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా-కాన్పూర్ మధ్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్ ప్రస్తుతం ఆపరేషనల్ దశలో ఉంది. రెండో దశ కింద విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య 1,115 కి.మీ. మేర నిర్మించేందుకు సాధ్యాసాధ్య (ఫీజబిలిటీ) నివేదికను డీఎఫ్‌సీసీఐఎల్ (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వచ్చే ఏడాది ఆఖరు నాటికి సిద్ధం చేయనుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు ఈ కారిడార్ నిర్మించడానికి రూ.40 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీఎఫ్‌సీసీఐఎల్ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టును 2030 కల్లా పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కారిడార్‌ను చెన్నై-హౌరా మెయిన్‌లైన్‌కు సమాంతరంగా కోస్తా జిల్లాల మీదుగా నిర్మిస్తారు. దీన్ని 2018లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని రైల్వే ఫ్లై ఓవర్ల మీదుగా లేకుండా నిర్మించేందుకు డిజైన్ రూపొందించినట్లు కంటైనర్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఏపీకి వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అన్ని పోర్టులను కలుపుతూ.. ►ఈ డెడికేటెడ్ కారిడార్‌ను విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను అనుసంధానిస్తూ నిర్మిస్తారు. ►పోర్టులకు కనెక్టివిటీ ఉండటం వల్ల అవి అభివృద్ధి చెందడంతోపాటు సరుకు రవాణా ఎంతో సులభతరంగా ఉంటుంది. ►సాధారణంగా సరకు రవాణా రైళ్లు సగటున గంటకు 25-30 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ►డెడికేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఈ రైళ్లు 70-80 కి.మీ. వేగంతో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ►డెడికేటెడ్ కారిడార్‌ను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌తో నిర్మిస్తారు. సరుకు రవాణా ఛార్జీలు ఎంతో తగ్గుతాయి.. డెడికేటెడ్ కారిడార్ నిర్మాణంతో సరుకు రవాణా ఛార్జీలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. ఈ కారిడార్ నిర్మాణం ఏపీ పారిశ్రామిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. - ఎంవై యాదవ్, జీఎం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -
నిరసనల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: ఖరగ్‌పూర్ డివిజన్లో నిరసనల నేపథ్యంలో రైల్వే శాఖ పలురైళ్లను రద్దు చేసింది. హౌరా–సికింద్రాబాద్, హౌరా–కన్యాకుమారి, సంత్రాగచ్చి–పాండిచ్చేరి, అగర్తల–బెంగళూరు, గువాహటి–బెంగళూరు, గువాహటి–సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్–హౌరా, మైసూరు–హౌరా, పూరి–చెన్నై రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్యరైల్వేకు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు ఇంధన పొదుపు విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. సౌర విద్యుత్ వినియోగం, ఆక్యుపెన్సీ, సెన్సార్ల వినియోగం, ఎల్ఈడీ బల్బుల వినియోగం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే పంపుల వినియోగం వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డులు లభించాయి. ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎ.ఎ.ఫడ్కే, హైదరాబాద్ డివిజన్ ఇంజనీర్ డీఆర్ఎం ఎస్ఎస్ఆర్ ప్రసాద్‌లు అందుకున్నారు. -
‘ఐఐటీ–ఖరగ్‌పూర్’లో 121 నాన్ టీచింగ్ పోస్టులు
ఖరగ్‌పూర్(పశ్చిమ బెంగాల్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఖాళీలతోపాటు గతంలో భర్తీ కాకుండా మిగిలిన (బ్యాక్లాగ్) పోస్టులూ ఉన్నాయి. పోస్టుల వారీ వేకెన్సీ: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–1; ఎగ్జిక్యూటివ్–8; జూనియర్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–4; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్–16; జూనియర్ ఎగ్జిక్యూటివ్–25; జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్–4; ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్–3; సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–2; మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ/రేడియోలజీ/ఫిజియోథెరపీ)–4; స్టాఫ్ నర్స్–5; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్–2)–2; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్–36; జూనియర్ అసిస్టెంట్–6; సెక్యూరిటీ ఇన్స్పెక్టర్–2; డ్రైవర్(గ్రేడ్–2)–3. వేతనం: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్ నుంచి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు రూ.9,300–34,800+గ్రేడ్‌పే రూ.4,200. మిగిలిన పోస్టులకు రూ.5,200–20,200+గ్రేడ్‌పే రూ.2,000. విద్యార్హత: ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సంబంధిత కొలువులో 8 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ/తత్సమానం, సీనియర్ టెక్నీషియన్‌గా 8 ఏళ్ల అనుభవం; జూనియర్ ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సీనియర్ అసిస్టెంట్‌గా 8 ఏళ్ల అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం; స్టాఫ్ నర్స్: ఇంటర్మీడియెట్, జీఎన్ఎం, ఏడాది అనుభవం; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్: డిగ్రీ(సైన్స్)/సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా, వైర్‌మ్యాన్ లైసెన్స్/పర్మిట్ ఉండాలి; జూనియర్ అసిస్టెంట్: డిగ్రీ, 40 డబ్ల్యూపీఎం వేగంతో కంప్యూటర్‌పై కంపోజింగ్ (టైపింగ్) చేయగలగాలి. గరిష్ట వయోపరిమితి: పోస్టును బట్టి 30–45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసి, అప్లికేషన్ హార్డ్ కాపీని అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాల్సి ఉంటుంది. చివరి తేది: ఆన్లైన్లో అప్లై చేసేందుకు, హార్డ్ కాపీ పంపేందుకు: జనవరి 31 వెబ్సైట్: iitkgp.ac.in -
టీఎంసీ కార్యాలయంలో కాల్పులు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్‌లోగల టీఎంసీ కార్యాలయంలో గుర్తు తెలియని సాయుధులు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిందితులను గుర్తించాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య తీవ్ర స్థాయిలో బెంగాల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలపై పరస్పరం దాడులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో బీజేపీ నేత ఇంటిపై టీఎంసీకి చెందిన వ్యక్తులు బాంబు దాడులకు దిగడంతోపాటు పరస్పర ఘర్షణలకు దిగి గాయపరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టీఎంసీ కార్యాలయంలో కాల్పులు జరగడం కలకలాన్ని రేపుతోంది. -
భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి
ఫార్ములా1 కారును తయారుచేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు కోల్‌కతా: రష్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు ఓ ఫార్ములా 1 రేసింగ్ కారును తయారు చేశారు. ఈ కారుకు ‘కే-3’గా నామకరణం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే కాంపిటీషన్లో 800 మంది విద్యార్థులతో కూడిన 30 బృందాలు పాల్గొంటాయి. ఇప్పటికే మూడు రేసింగ్ కార్లను తయారు చేసిన ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఈసారి తక్కువ బరువు, ఎక్కువ మైలేజీ సామర్థ్యం కలిగిన కే-3ని తయారు చేశారు. ఈ కారు బరువు కేవలం 220 కిలోలు మాత్రమే. గతంలో రూపొందించిన కార్లు కేవలం 2 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇచ్చేవని, అందుకే కార్బన్ ఫైబర్ ప్యానల్స్‌ను ఉపయోగించి ఈ తక్కువ బరువున్న కారును తయారు చేశామన్నారు. ఈ కారును తయారు చేసిన విద్యార్థులంతా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే కావడం గమనార్హం. అయితే పూర్వ విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ సరికొత్త కారును రూపొందించామని టీమ్ లీడర్ కేతన్ ముంధ్రా తెలిపారు. -
ఐఐటీ స్కాలర్ కు అరుదైన గౌరవం
ఖరగ్ పూర్: ఐఐటీ ఖరగ్ పూర్ రీసెర్చ్ స్కాలర్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రికల్చర్, ఫుడ్ ఇంజనీరింగ్ లో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్న కే అశోక్ కుమార్.. కంకర నేలలో సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడంపై చేసిన కృషికిగాను అమెరికాలోని ఇంటర్నేషనల్ ప్లానెట్ ఇనిస్టిట్యూట్ 2,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 1.3లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ అందించింది. కొత్త రకపు వరి వంగడాన్ని సేంద్రీయ ఎరువులతో ఎలా పండించవచ్చో ఆయన చేసిన పరిశోధనకుగానూ ఈ గౌరవం ఆయనకు దక్కింది. -
చెత్త సేకరిస్తున్న ఐఐటీ విద్యార్థులు...
వెస్ట్ బెంగాల్ః వ్యర్థాలను రీ సైకిల్ చేయడం ఇప్పుడు ఖరగ్ పూర్ పట్టణంలో ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇవ్వడం అంత సులభం అయిపోయింది. ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు చెత్తను రీ సైక్లింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున ఓ ప్రత్యేక సేవను ఏర్పాటు చేసి, అటు పట్టణ వాసులకు సేవలు అందించడంతోపాటు వ్యాపారంగా కూడా మలచుకొన్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకున్న చెత్తను శుభ్రం చేయడం ఓ కార్యక్రమంగా చేపట్టారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున క్యాంపస్ లోపల, చుట్టుపక్కల ఉండే ప్రజల నుంచి చెత్తను సేకరించేందుకు ఓ ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకొని ట్రక్ ను పంపించే సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చారు. పీహెచ్ డీ విద్యార్థి అభిమన్యుకర్ అతని స్నేహితులతో కలసి 'గెయిన్ వేస్ట్' పేరున ప్రారంభించిన సామాజిక వ్యవస్థాపక వెంచర్ ఇప్పుడు ఎంతో పేరు తెచ్చుకుంది. పొడి చెత్త, బాటిల్స్, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి సేకరించి వాటిని ఈ విద్యార్థులు రీ సైక్లింగ్ చేసి అమ్ముతున్నారు. 2014లో ప్రారంభించిన వ్యాపారంలో విద్యార్థులు నెలకు కనీసం 20 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. చెత్తను సేకరించేందుకు కొంతమంది కూలీలను పెట్టుకొన్నామని, వారితో ఓ డిజిటల్ వేయింగ్ మెషీన్ ను కూడా పంపించి, రేటు కార్డు ప్రకారం ఒక్కో చెత్తకు ఒక్కోరకమైన రేటును వసూలు చేస్తామని ఓ మెకానికల్ విద్యార్థి చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు కస్టమర్లుగా ఉన్నారు. మొదట్లో చెత్తను వేరు చేయడం కొంత కష్టమైందని ప్రస్తుతం అటువంటి సమస్యలు పెద్దగా లేవని ఓ విద్యార్థి పేర్కొన్నాడు. -
1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని
సిటీబ్యూరో: తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ కోసం ఓ వీరాభిమాని సైకిల్‌పై 1,500 కిమీ ప్రయాణం చేసి వచ్చి కలిశాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన అద్దంకి రవికి పవన్‌పై ఎనలేని అభిమానం. రవి ఏప్రిల్ 3న ఖరగ్‌పూర్ నుంచి సైకిల్‌పై బయల్దేరి నెలరోజుల పాటు 1,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి గురువారం సాయంత్రం తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. అనంతరం రవి మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పవన్‌ను కలవాలన్న తన కోరిక తీరిందని సంబరపడ్డాడు. -
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
భువనగిరి, న్యూస్‌లైన్: నేత కార్మికుడి కొడుకైనా పట్టుదలతో చదివి ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు సంపాదించాడు. బీటెక్ కోర్సు అయిపోయే దశలో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న నల్లగొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన బోగ శ్రవణ్‌కుమార్(22) కళాశాల హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఐఐటీ యాజమాన్యం శ్రవణ్ తల్లిదండ్రులకు తెలియజేయడంతోపాటు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రెండు విమాన టికెట్లు కూడా పంపించింది. ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపిక కాకపోవడం వల్లే శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శ్రవణ్ 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. -
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
-
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
పై-లీన్ తుపాన్ ప్రభావంతో ఒడిశాలోని భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. చెన్నై - హౌరా ఎక్స్‌ప్రెస్, చెన్నై - హౌరా మెయిల్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ముజఫర్‌నగర్- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 7 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. అలాగే హౌరా - కన్యాకుమారీ 15 గంటలు, తిరుపతి - భువనేశ్వర్, షాలిమార్ - యశ్వంత్ పూర్, పురులియా - విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లు 8 గంటలు, యశ్వంత్ పూర్ - హౌరా 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ పేర్కొంది. సంత్రగచ్చి- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైల్‌ను ఖరగ్‌పూర్ మీదగా మళ్లిస్తున్నట్లు తెలిపింది.