చెత్త సేకరిస్తున్న ఐఐటీ విద్యార్థులు...
వెస్ట్ బెంగాల్ః వ్యర్థాలను రీ సైకిల్ చేయడం ఇప్పుడు ఖరగ్ పూర్ పట్టణంలో ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇవ్వడం అంత సులభం అయిపోయింది. ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు చెత్తను రీ సైక్లింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున ఓ ప్రత్యేక సేవను ఏర్పాటు చేసి, అటు పట్టణ వాసులకు సేవలు అందించడంతోపాటు వ్యాపారంగా కూడా మలచుకొన్నారు.
పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకున్న చెత్తను శుభ్రం చేయడం ఓ కార్యక్రమంగా చేపట్టారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున క్యాంపస్ లోపల, చుట్టుపక్కల ఉండే ప్రజల నుంచి చెత్తను సేకరించేందుకు ఓ ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకొని ట్రక్ ను పంపించే సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చారు. పీహెచ్ డీ విద్యార్థి అభిమన్యుకర్ అతని స్నేహితులతో కలసి 'గెయిన్ వేస్ట్' పేరున ప్రారంభించిన సామాజిక వ్యవస్థాపక వెంచర్ ఇప్పుడు ఎంతో పేరు తెచ్చుకుంది.
పొడి చెత్త, బాటిల్స్, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి సేకరించి వాటిని ఈ విద్యార్థులు రీ సైక్లింగ్ చేసి అమ్ముతున్నారు. 2014లో ప్రారంభించిన వ్యాపారంలో విద్యార్థులు నెలకు కనీసం 20 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. చెత్తను సేకరించేందుకు కొంతమంది కూలీలను పెట్టుకొన్నామని, వారితో ఓ డిజిటల్ వేయింగ్ మెషీన్ ను కూడా పంపించి, రేటు కార్డు ప్రకారం ఒక్కో చెత్తకు ఒక్కోరకమైన రేటును వసూలు చేస్తామని ఓ మెకానికల్ విద్యార్థి చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు కస్టమర్లుగా ఉన్నారు. మొదట్లో చెత్తను వేరు చేయడం కొంత కష్టమైందని ప్రస్తుతం అటువంటి సమస్యలు పెద్దగా లేవని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.