విమానం విండో ప్యానెల్ ఊడిపోవడంతో ఏర్పడిన భారీ రంధ్రం; విమానం లోపల సీటు పక్క నుంచి కనిపిస్తున్న రంధ్రం
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్‌లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.
బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు.
రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి.
ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్‌లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు.
నరకం అంచులకు వెళ్లొచ్చాం...
ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది.
ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.
ఆ విమానాల నిలిపివేత...
ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది.
– పోర్ట్‌ల్యాండ్ (అమెరికా)
తొలిసారి కాదు..
బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment