ప్రమాదంలో బతికిన పాప అంటూ వైరల్ అవుతున్న ఫొటో
జకార్తా: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు వార్తలను ట్రెండ్ చేస్తూ చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. గత సోమవారం ఇండోనేసియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పసిపాప ప్రాణాలతో బయటపడిందని ఓ వార్త గత రెండు రోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఆ పసిపాకు సంబంధించిన ఫొటో కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఈ వార్తకు సంబంధించిన పోస్ట్ ఐదు వేల సార్లు షేర్ కావడం గమనార్హం. (చదవండి: సముద్రంలో కూలిన విమానం)
ఈ పోస్ట్‌లో .. ‘ఈ పాపను రక్షించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. జేటీ610 విమాన ప్రమాదంలో బతికిన చిన్నారి. ఆమె తల్లి లైఫ్ జాకెట్‌తో కవర్ చేయడంతో ప్రాణాలతో బయట పడింది. దురదృష్టవశాత్తు ఆ పాప తల్లిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.’ అని క్యాప్షన్‌గా పేర్కొంటు ఓ పసిపాప ఫొటోను ట్రెండ్ చేశారు. (లయన్ విమాన ప‍్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి)
అయితే ఆ పాప ఈ ఏడాది జూలైలో ఇండోనేషియాలోనే చోటుచేసుకున్న నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన పాపని, ఆ ఫొటోనే తాజా ప్రమాదానికి ముడిపెడుతూ వైరల్ చేశారని ఆదేశ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి సుటోపా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఇది ఒక గాలివార్తని, ఇలాంటి పుకార్లను నమ్మి, ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సులవేసి నుంచి సెలయార్ తీరానికి వస్తుండగా నౌక మునిగిపోవడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నకిలీ వార్తలు ప్రచారం కావడం ఇదే తొలిసారేం కాదు. గతంలో చాలాసార్లు ట్రెండ్ అయ్యాయి. భారత్‌లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడైతే ఈ నకిలీ వార్తలకు అడ్డుఅదుపే లేకుండా పోయింది. అలాగే పిల్లలను ఎత్తుకుపోతున్నారనే వాట్సాప్ మెసేజ్‌లతో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. (చదవండి: వరదల్లో ఫేక్ న్యూస్ బురద)
Comments
Please login to add a commentAdd a comment