‘మాటలకు అందని విషాదం.. కానీ నవ్వుతూనే ఉండాలి’  | Lion Air Flight Crash Takes Him Away Fiance Wears Wedding Gown Alone | Sakshi
Sakshi News home page

‘మాటలకు అందని విషాదం.. కానీ నవ్వుతూనే ఉండాలి’ 

Published Thu, Nov 15 2018 3:46 PM | Last Updated on Thu, Nov 15 2018 3:48 PM

Lion Air Flight Crash Takes Him Away Fiance Wears Wedding Gown Alone - Sakshi

నందా కొన్న పెళ్లి గౌనులో సయారా (ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో)

‘ప్రాణం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. నువ్వు లేకపోతే నేను బతకలేను.. నీ ఙ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తా.. ’సాధారణంగా ప్రతీ ప్రేమ జంట చేసుకునే బాసలు ఇవి. అయితే నిజమైన ప్రేమికులు మాత్రమే ఈ బాసల్ని నిలబెట్టుకుంటారు. నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తారు. ఇండోనేషియాకు చెందిన సయారా కూడా ఈ కోవకు చెందిన వారే. అందుకే తనకు కాబోయే భర్త భౌతికంగా దూరమైనప్పటికీ తన మనసులో మాత్రం సజీవంగా ఉన్నాడని భావిస్తున్నారు. అతడి ఙ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు.

ఇండోనేషియాకు చెందిన సయారా, డాక్టర్‌ నంద ప్రతామా చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అనుమతి పొందిన అనంతరం.. నవంబరు 11న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం పంగ్‌కల్‌ పినాంగ్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి బట్టలు కూడా కొనేశారు. ఈ క్రమంలో... నందా జకార్తాలో జరిగే ఓ కాన్ఫరెన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే వారి పాలిట శాపంగా మారింది. విమాన ప్రమాదంలో నందా మరణించడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

అసలేం జరిగిందంటే..
అక్టోబరు 29న జకార్తా నుంచి పంగ్‌కల్‌ పినాంగ్‌ సిటీకి బయల్దేరిన లయన్‌ ఎయిర్‌ జెట్‌ విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. బయల్దేరిన 13 నిమిషాలకే చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 189 మంది మరణించారు. ఇంతవరకు వారిలో చాలా మంది ఆనవాళ్లు కూడా లభించలేదు. వారిలో నందా కూడా ఒకరు. ఈ ఘటన సయారా జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పది రోజుల్లో పెళ్లి జరుగుతుందని ఎన్నో కలలుగన్న ఆమెకు ఊహించని షాక్‌ ఇచ్చింది. 

నువ్వు చెప్పావు కదా.. అందుకే ఇలా..
కాన్ఫరెన్సు ముగించుకున్న తర్వాత జకార్తా నుంచి బయల్దేరే ముందు నందా సయారాకు ఫోన్‌ చేశాడు. ప్రమాదాన్ని ముందే ఊహించాడో ఏమో... అందుకే తానెంతో ముచ్చట పడి కొన్న పెళ్లి గౌనులో ఫొటోలు దిగి తనకు పంపించాలని కోరాడు. సరేనన్న సయారా... నందా కోసం వెడ్డింగ్‌ గౌన్‌ వేసుకుని, తెల్ల గులాబీలతో కూడిన బొకే చేతిలో పట్టుకుని పెళ్లికూతురిలా అలంకరించుకుని.. ఆ ఫొటోలను నందాకు పంపింది. ఇదంతా జరిగిన కొన్ని గంటల తర్వాత నందా ప్రయాణించే విమానం సముద్రంలో గల్లంతయ్యిందనే వార్త సయారా ఆశల్ని చిదిమేసింది. నందా ఇక లేడన్న విషయం తెలిసి ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

తను లేకుంటేనేం..
నందా తనకు భౌతికంగా దూరమయ్యాడే తప్ప తన మనసులో సజీవంగానే ఉన్నాడు కదా భావించిన సయారా... నవంబరు 11న తమ పెళ్లి జరగాల్సి ఉండటంతో మరోమారు పెళ్లి దుస్తులు ధరించి ఫొటోలు దిగింది. ‘మాటలకు అందని విషాదం నాది. కానీ నీ కోసం నేను నవ్వుతూనే ఉండాలి. ఏడుపు ముఖంతో ఉండాలనుకోవడం లేదు. ధైర్యంగా ఉండాలని నువ్వు చెప్పావు కదా. అలానే ఉన్నాను’  అనే క్యాప్షన్‌తో సయారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 26 ఏళ్ల ప్రాయంలో సయారా జీవితంలో చోటుచేసుకున్న విషాదం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఆమెకు వచ్చిన కష్టం పగవాళ్లకు కూడా రావొద్దంటూ వారు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement