
న్యూఢిల్లీ: బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది.
అంతేకాకుండా, ఈ విమాన పైలెట్లకు వెయ్యి గంటలు, కో పైలెట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. ఇందుకు అవసరమైన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు, ఉత్పత్తి దారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని పౌరవిమానయాన శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. భారత్‌కు చెందిన స్పైస్‌జెట్‌కు 13, జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు 5 బోయింగ్ 737 మ్యాక్స్8 రకం విమానాలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే ఈ విమానాలను నిలిపివేయగా స్పైస్ జెట్ మాత్రం తమ విమానాలు అత్యంత సురక్షితమైనవంటూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment