ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు.
ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.
2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ.
ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్‌నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి.
నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది.
ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి.
భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం.
మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం.
ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు.
సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్‌సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్‌లైన్‌లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి.
వట్టి బెదిరింపులేనా?
Published Tue, Oct 22 2024 12:08 AM | Last Updated on Tue, Oct 22 2024 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment