న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్‌జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్‌లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్‌జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్‌ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కష్టాల్లో ఎయిర్‌లైన్స్..
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్‌వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్‌కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది.
ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు..
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్‌లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్‌లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్‌కు తగ్గట్లుగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు.
‘మ్యాక్స్’ సమస్యలు..
మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్‌జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్‌జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
Published Fri, Mar 15 2019 5:14 AM | Last Updated on Fri, Mar 15 2019 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment