airfares
-
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్‌కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్‌కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్‌కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
విమాన టికెట్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న చార్జీలు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి సమయంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్లను ఎత్తివేసింది. దీంతో ఇకపై దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై ఉన్న పరిమితులను తొలగించినట్లు దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు. గతంలో దేశీయ మార్గాల్లో ఛార్జీల పై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా తక్కువ చార్జీల వల్ల విమాన సంస్థలు, డిమాండ్ ఉన్న సమయాల్లో భారీ రేట్లతో ప్రయాణికులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్యాసింజర్లతో నింపేందుకు టిక్కెట్లపై డిస్కౌంట్లను అందించే అవకాశమే ఎక్కవగా ఉందంటూ నిపుణలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా విమాన రంగం వృద్ధి సాధిస్తుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్, ఇంధన ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత ఛార్జీల పరిమితులను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. The decision to remove air fare caps has been taken after careful analysis of daily demand and prices of air turbine fuel. Stabilisation has set in & we are certain that the sector is poised for growth in domestic traffic in the near future. https://t.co/qxinNNxYyu — Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 10, 2022 చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే! -
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్‌జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్‌లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్‌జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్‌ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టాల్లో ఎయిర్‌లైన్స్.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్‌కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్‌కు తగ్గట్లుగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు. ‘మ్యాక్స్’ సమస్యలు.. మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్‌జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్‌జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
ఆటో కన్నా విమాన చార్జీలే నయం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలే చౌకగా ఉన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఆటో రిక్షాలో కిలోమీటర్‌కు రూ . 5 వరకూ చార్జ్ చేస్తుండగా, విమానాల్లో కిలోమీటర్‌కు రూ. 4 మాత్రమే వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న క్రమంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్‌ల సమిష్టి నష్టాలు రూ 12,000 కోట్ల వరకూ ఉంటాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ వంటి సంస్ధలతో పాటు అన్ని ఎయిర్లైన్లు ఇంధన ధరల భారం, తక్కువ ప్రయాణ చార్జీలతో కుదేలవుతున్నాయి. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్ ధరలను పెంచకపోవడం ఎయిర్‌లైన్స్ నష్టాలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో మినహా అన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. -
విమానాల రద్దు సెగ: చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థల నిర్ణయంతో విమాన టికెట్ చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్ ఇండిగో, గో ఎయిర్ తమ సర్వీసులను రద్దు చేయడంతో కొన్ని కీలక మార్గాల్లో చార్జీల మోత మోగుతోంది. ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్ చేసుకోవడం, తిరిగి టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రధానమైన రూట్లలో 10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దేశీయ పెద్ద విమానయాన సంస్థలు ఇండిగో దాదాపు 65 విమానాలను, గో ఎయిర్ 11 విమానాలను రద్దు చేయడంతో లాస్ట్ మినిట్ ప్రయాణీకులకు భారీ షాక్ తగిలింది. విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ప్రతినిధి శరత్ దలాల్ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య వన్‌వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనావేశారు. దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందన్నారు. టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్ చేసుకున్న టికెట్ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రూట్లో కూడా బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలుకుతుండటం గమనార్హం. ఇండిగో అధికారిక వెబ్సైట్ అందించిన సమాచారం ఇండిగో బుధవారం 42 విమానాలను రద్దు చేసింది. ముంబయి, కోల్‌కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్ రూట్లు ఇందులో ఉన్నాయి. అయితే గో ఎయిర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాన్సిలేషన్ చార్జీలు రద్దు, రీషెడ్యూలింగ్ లాంటి చర్యలు చేపట్టుతున్నటు నిన్న ప్రకటించాయి. కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రాట్ అండ్ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్ మొరాయించిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
సమ్మర్ హాలిడేస్: చౌకగా విదేశీయానం
ముంబై: వేసవి సెలవులు వచ్చేశాయి. ఎక్కడికైనా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, విదేశీ ప్రయాణానికి సిద్ధం కండి. ఎందుకంటే ఈ సమ్మర్ లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లడం చాలా చౌకగా మారిందట. లండన్, సింగపూర్, సిడ్ని, కౌలాలంపూర్ వంటి విదేశాలకు వెళ్లడానికి విమాన ఛార్జీలు కిందకి దిగొచ్చాయని వెళ్లడైంది. అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 28 శాతం వరకు పడిపోయాయని తెలిసింది. బ్రూసెల్స్ విమానయాన సంస్థ వంటి విదేశీ క్యారియర్స్ ఆగమనంతో 2016 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానసంస్థల టిక్కెట్ ధరలు కిందకి దిగొచ్చాయని టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ ప్రయాణం రూ.31,800కి దిగొచ్చిందని, గతేడాది ఇదే నెలలో టిక్కెట్ ధర రూ.39,497గా ఉందని తెలిసింది. అంటే గతేడాది కంటే 19 శాతం తగ్గిపోయింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి సింగపూర్ ప్రయాణ ఛార్జీలు కూడా 22 శాతం పడిపోయి, రూ.22,715గా నమోదైనట్టు కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. 2016 ఏప్రిల్ లో ఈ ధర 29,069 రూపాయలుగా ఉన్నట్టు తెలిసింది. తమ రిపోర్టు ప్రకారం ఈ సమ్మర్ లో విమాన టిక్కెట్ ఖర్చులు గతేడాది కంటే తగ్గినట్టు తెలిసిందని కాక్స్ అండ్ కింగ్స్ బిజినెస్ హెడ్ జాన్ నాయర్ చెప్పారు. అన్నింటి కంటే ముంబాయి-కౌలాలంపూర్ ధర దాదాపు 28 శాతం వరకు తగ్గిపోయి, 20,377 రూపాయలుగా ఉందని రిపోర్టు పేర్కొంది. విదేశీ ఎయిర్ లైన్స్ ఎంట్రీతో పాటు ఇంధన ధరలు దిగిరావడంతో విమానసంస్థలు ధరలు తగ్గించినట్టు రిపోర్టు వెల్లడించింది. -
ఇక్కడే విమాన చార్జీలు చౌక
⇒ ఈ రంగంలో పోటీవల్లే: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ⇒ ఇంధన ధరలు, పన్నులు ఎక్కువే న్యూఢిల్లీ: విమాన చార్జీలు చౌకగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. విమానాలతో పాటు ఇంధనం ధరలు, పన్నులు కూడా అధికంగా ఉన్నప్పటికీ, అత్యంత పోటీ ధరలున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ఆయన తెలియజేశారు. విమానయానం మరింత చౌకగా ఉండేందుకు, సర్వీసులు లేని విమానాశ్రయాల అనుసంధానత కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అనుసంధానత స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు. ఈ ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్‌లో భాగంగా గంట విమాన ప్రయాణానికి రూ.2,500 పరిమితిని విధించామని చెప్పారాయన. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సర్కారు నిర్ణయంతో పెరగనున్న విమాన చార్జీలు?
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశీయ విమాన చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం ప్రత్యేకంగా ఒక లెవీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దూరాన్ని బట్టి వివిధ విమాన ప్రయాణాలపై లెవీ విధించనున్నట్లు ప్రకటించింది. విమానయాన సంస్థలు ఎటూ ఈ మొత్తాన్ని ప్రయాణికుల మీదే మోపుతాయి కాబట్టి టికెట్ల ధరలు పెరగడం ఖాయమని అంటున్నారు. లెవీ వివరాలు ఇలా ఉన్నాయి... వెయ్యి కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ. 7,500 లెవీ విధిస్తారు. అలాగే 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ. 8000, 1500 కిలోమీటర్లకు మించిన దూరం వెళ్లే స్వదేశీ విమానాలకు రూ. 8,500 చొప్పున ఈ రీజనల్ కనెక్టివిటీ లెవీ ఉంటుంది. దాంతో విమాన చార్జీలు కూడా ఆ మేరకు పెరగక తప్పదు. అయితే.. మొత్తం విమాన ప్రయాణానికి కలిపి ఈ లెవీ ఉంటుంది కాబట్టి, అది మొత్తం అన్ని టికెట్లకూ పంపిణీ అవ్వాలి. ఆ లెక్కన చూసుకుంటే తక్కువ మొత్తమే పెరగాలి. కానీ ఎంత మేర పెరుగుదల ఉంటుందనేది నిర్ణయం పూర్తిగా అమలైతే తప్ప తెలియదు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ లెవీ అమలవుతుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ తెలిపారు. -
టైగర్ ఎయిర్ టూ వే స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ: తక్కువ ధరల విమానయాన సంస్థ టైగర్ ఎయిర్ భారత విమాన ప్రయాణికులకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఆగ్నేయ ఆసియా బడ్జెట్ క్యారియర్ రూ13.599 ప్రారంభమయ్యే రాను పోను విమాన చార్జీలను బుధవారం ప్రకటించింది. దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాలనుంచి సింగపూర్ కు రెండువైపులా (టూ-వే) అన్ని చార్జీలు కలుపుకొని ఈ తగ్గింపు ధరలని తెలిపింది. ప్రత్యేక ఆఫర్ కింద నేటి నుంచి(నవంబర్ 2 ) నవంబర్ 13 మధ్య బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో ఫిబ్రవరి న 1, 2017 నుంచి 30 అక్టోబర్, 2017 మధ్య ప్రయాణం చేయొచ్చు. కొచీ, బెంగళూరు, లక్నో, హైదరాబాద్, తిరుచిరాపల్లి (తిరుచ్చి) నుంచి సింగపూర్ కు ఈ ధరలు వర్తిస్తాయని టైగర్ ఎయిర్ పేర్కొంది. అలాగే ఆసియా పసిఫిక్ గేట్ వే ద్వారా బాలి, బ్యాంకాక్, హ్యాంక్ కాంగ్, గోల్డ్ కోస్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ, తైపీ లాంటి ఎగ్జైటింగ్ డెస్టినేషన్ కు వెళ్లేవారు తమ ఎయిర్ లైన్స్ ను ఎంచుకోవచ్చని సూచించింది. కాగా సింగపూర్ ఎయిర్ లైన్స్ టైగర్ ఎయిర్ దేశంలోని ఎనిమిది ప్రధాన కేంద్రాలనుంచి వారానికి 50విమానాలను నడుపుతోంది. ఎ 320 విమానాల సముదాయంతో ఆసియాలో సింగపూర్, బంగ్లాదేశ్, చైనా, హాంగ్ కాంగ్, భారతదేశం, ఇండోనేషియా, మాకా, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, ఫిలిప్పీన్స్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి సంస్థ 40 దేశాలు విమాన సర్వీసులు అందిస్తోంది. -
విమాన టిక్కెట్లు మళ్లీ భగ్గుమంటాయా...?
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు ఈ పండుగ కాలంలో ధరలు మరింత ప్రియమవనున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్ విమానాల ఆపరేటింగ్ ఖర్చుల్లో 40శాతం నమోదయ్యాయట. 9.2శాతం ఈ ధరలు పెరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడం వరుసగా నాలుగో సారి. గత మూడు నెలల్లో ఆపరేటింగ్ ఖర్చుల్లో ఈ ధరలు 35శాతంగా నమోదయ్యాయి. ఇండియాలో అతిపెద్ద ఎయిర్ పోర్టు ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలు దేశీయ విమానాల్లో కిలో లీటర్ కు రూ. 46,729గా ఉన్నాయి. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల ఎంతమేరకు టిక్కెట్ ధరల పెరుగుదలపై ప్రభావం చూపనుందో విమాన సంస్థలు ప్రకటించలేదు. ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్, ఫ్యూయల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా టిక్కెట్ ధరలు ఎగబాకడానికి దోహదం చేస్తాయని తెలుస్తోంది. ఏప్రిల్ మధ్య కాలం నుంచి జూలై వరకూ పీక్ ట్రావెల్ సీజన్ నడుస్తుందని, ఈ కాలంలో చాలా టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు విమాన పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జూలై కు - సెప్టెంబర్ కు మధ్య ఎయిర్ లైన్స్ టిక్కెట్లకు చాలా సంస్థలు డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇన్ ఫుట్ ధరల ప్రకారమే విమాన సంస్థలు ధరలు నిర్ణయించవని, పోటీతత్వం, డిమాండ్ సప్లై బ్యాలెన్స్ లకు అనుగుణంగా ధరలు పెంచుతాయని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజివ్ కపూర్ తెలిపారు. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల విమానయాన సంస్థ ధరల విధానంపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. -
విమానయానం మరింత భారం
టికెట్లపై 2 శాతం ప్రాంతీయ కనెక్టివిటీ లెవీ * చిన్న పట్టణాలకూ విమాన సేవలు * ఎయిర్‌లైన్స్‌కు పన్ను ప్రయోజనాలు * పౌర విమానయాన విధానం ముసాయిదా న్యూఢిల్లీ: ఒకవైపు విమానచార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈవిధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది. అలాగే, విమానయాన సంస్థలకు కొన్ని కార్యకలాపాలపై పన్ను ప్రయోజనాలు కల్పించడంతో పాటు దేశీ ఎయిర్‌లైన్స్‌లో 50 శాతం పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తోంది. పౌర విమానయాన శాఖ శుక్రవారం ఈ మేరకు ముసాయిదా పాలసీని ఆవిష్కరించింది. భారీ ఆర్భాటాలు లేని సాధారణ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ప్రాంతీయంగా కనెక్టివిటీ పెంచే దిశగా ఎయిర్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అలాగే, చిన్న ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు.. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) కింద గంట వ్యవధి ఉండే ప్రయాణాలకు చార్జీపై గరిష్ట పరిమితి రూ. 2,500 ఉండనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సవరించిన ముసాయిదా విధానాన్ని ఆవిష్కరించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. వీటిపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉందన్నారు. దేశీయంగా 2022 నాటికి 30 కోట్లు, 2027 నాటికి 50 కోట్ల మేర టికెట్ల కొనుగోళ్లు జరిగేలా చూసేందుకు తగు పరిస్థితులను కల్పించే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. సామాన్యులకూ అందుబాటులోకి విమానయానం.. ఏవియేషన్ భారీగా విస్తరించడంతో పాటు సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి రావాలన్న ప్రధాని మోదీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే చెప్పారు. సుమారు ఏడాది పాటు దీనిపై కసరత్తు జరిగినట్లు వివరించారు. దేశీ, విదేశీ రూట్లలో టికెట్లపై 2 శాతం లెవీతో ఖజానాకు ఏటా రూ. 1,500 కోట్లు రాగలవని ఆయన తెలిపారు. ప్రాంతీయ రూట్ల విస్తరణకు ఈ నిధులను ఉపయోగిస్తామని చెప్పారు. ఎంఆర్వోకు ఊతం.. విమానాల మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రతిపాదించింది. ఎంఆర్వోకు సర్వీస్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపునివ్వడం, వ్యాట్ విధించకపోవడం వీటిలో ఉన్నాయి. ఆసియాలో ఎంఆర్వో కార్యకలాపాలకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దాలన్నది విధాన లక్ష్యం. ఇక, దేశీ విమానయాన కంపెనీలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే... దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు, 20 విమానాలు ఉండాలన్న వివాదాస్పద నిబంధనపై విమానయాన శాఖ పూర్తి స్పష్టతనివ్వలేదు. దీనికి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించింది. 5/20 నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం, లేదా యథాతథంగా కొనసాగించడం, లేదా దేశీయంగా కార్యకలాపాల క్రెడిట్స్‌ను విదే శీ రూట్ల సర్వీసులకు అనుసంధానించడం వీటిలో ఉన్నాయి. ప్రాంతీయ కనెక్టివిటీకి పెద్ద పీట..: ప్రాంతీయంగా ఎయిర్‌కనెక్టివిటీని పెంచేందుకు పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రాలు ఉచితంగా స్థలాన్ని అందించడం, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) విలువ ఆధారిత పన్నును(వ్యాట్) 1% లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేసేలా ఆర్సీఎస్ స్కీమును ప్రతిపాదించింది. ఈ స్కీము కింద ఆర్సీఎస్ ఎయిర్‌పోర్టుల్లో ఇంధనం కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్‌కు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండదు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఆర్భాటాలు లేని చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్.. విమానయాన శాఖ కొత్తగా షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్ (ఎస్సీఏ) అంశాన్ని ప్రస్తావించింది. కనెక్టివిటీ స్కీము కింద నడిపే సర్వీసులకు ఇవి ఎయిర్‌పోర్టు చార్జీలు కట్టనక్కర్లేదు. సుమారు రూ.2 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తోనూ ఎస్‌సీఏలను ఏర్పాటు చేయొచ్చు. ఇవి 100 లేదా అంతకన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం గల విమానాలతో సర్వీసులు నడపవచ్చు. ఇతర ఎయిర్‌లైన్స్‌తో కోడ్-షేర్ ఒప్పందాలూ కుదుర్చుకోవచ్చు. పురోగామి విధానం: ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థలు దీన్ని ‘పురోగామి’ విధానంగా అభివర్ణించాయి. లెవీ వల్ల టికెట్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. దీనివల్ల ప్రాంతీ యంగా కనెక్టివిటీని పెంచేందుకు కావల్సిన ఇన్ఫ్రాను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. తద్వారా చార్జీలు దిగిరావొచ్చని వారు పేర్కొన్నారు. ముసాయిదా ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల అభిప్రాయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొద్ది నెలల్లో తుది విధానాన్ని ఖరారు చేయనున్నారు. 3 వారాల వ్యవధిలో ప్రజలు దీనిపై తమ అభిప్రాయాన్ని శాఖకు పంపించవచ్చు. -
గ్రీస్ ఫెయిర్ కోసం సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: గ్రీస్‌లో ని తెసాలోనికిలో సె ప్టెంబర్ 5-13 దాకా జరగబోయే అంతర్జాతీయ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగల లఘు, చిన్న, మధ్య తరహా సం స్థలు (ఎంఎస్ఎంఈ) దరఖాస్తులు పంపాల్సిందిగా ఎంఎస్ఎం ఈ-డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ కోరింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) దీన్ని నిర్వహిస్తోంది. ఎంపికైన సంస్థలకు స్పేస్ రెంటు, విమాన చార్జీలు మొదలైన వాటి కోసం గరిష్టంగా రూ.1.25 లక్షల మేర సబ్సిడీ లభిస్తుందన్నారు. -
విమానయానం.. భారత్‌లోనే అత్యంత చౌక
సిడ్నీ: వంద రూపాయలకే విమాన టిక్కెట్, ప్రత్యేక ఆఫర్లు, తక్కువ మొత్తంతో విదేశీయానం.. ఇలాంటి వార్తలు ఈ మధ్య చదివుంటారు. ప్రపంచంలో అత్యంత చౌకగా విమానంలో ప్రయాణించే సదుపాయం భారత్‌లోనే ఉంది. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని తాజాగా స్పష్టం చేసింది. భారత్ తర్వాత మలేసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో చౌకగా విమానంలో ప్రయాణించవచ్చు. కాగా ప్రపంచంలో విమానయానంలో అత్యంత ఖరీదైన దేశం ఫిన్లాండ్. ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, లిథూనియా, ఆస్ట్రియా, ఈస్టోనియా ఉన్నాయి. -
రూ. 1887కే ఇండిగో విమాన టికెట్లు!!
వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ చవక ధరలకే ప్రయాణాలను అందించడం మొదలుపెట్టాయి. ఇప్పుడీ రేసులోకి ఇండిగో కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు.. అంటే, రూ. 1887కే అన్ని పన్నులతో కలుపుకొని టికెట్లు అందిస్తామని ప్రకటించింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. టికెట్ల బుకింగ్ గురువారం మొదలైంది. ఇలా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రకటించడంతో ఇండిగో ప్రత్యర్థి స్సైస్ జెట్ తన ఆఫర్‌ను గురువారం వరకు పొడిగించింది. ఈ ఆఫర్ కింద, దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి టికెట్ రూ. 1888 మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. (మళ్లీ 600కే విమాన టికెట్లు) ఇక ఎయిర్ ఏషియా ఇండియా అయితే 600 నుంచి 1900 వరకు మూడు రకాలుగా ధరలను నిర్ణయించింది. ప్రయాణ కాలాన్ని కూడా ప్రత్యర్థి సంస్థల్లా మూడు నాలుగు నెలలు కాకుండా ఏకంగా ఏడాదికి పైగా ఉంచింది. వీటన్నింటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా కూడా చవక ధరలకు దిగింది. ఏకంగా వంద రూపాయలకే పరిమిత కాలానికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో ఆ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. (రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం) -
ప్రయాణికుల పాట్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రవాణా సేవలను పూర్తిగా స్తంభింపజేసింది. సోమవారం అర్ధరాత్రి వరకు నగరానికి వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న సొంత డిపోలకు రాత్రికి రాత్రే తిరిగి వెళ్లిపోయాయి. ఇప్పటి వరకు రాత్రి పూట అర కొర సర్వీసులు నడిచేవి. ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేకపోయినా ఆర్టీసీ ఆ సర్వీసులను నడుపుతూ వచ్చింది. మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సుల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొంటే ఒక బస్సూ నడవదని, ఒకటి, రెండు సంఘాలు పాల్గొనకపోతే కొన్ని బస్సులను నడిపే అవకాశాలున్నాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నందున, అన్ని సంఘాలు విధిగా సమ్మెలో పాల్గొనాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పాయి. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఉద్యమ తీవ్రతను గుర్తించి కేఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసులను ఎప్పుడో నిలిపివేసింది. ఇక రైళ్లే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా మిగిలాయి. ఆకాశంలోనే విమాన చార్జీలు అత్యవసర పనులపై విమానాలను ఆశ్రయిస్తున్న వారి జేబులు చిల్లులు పడుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభానికి ముందు వరకు బెంగళూరు నుంచి విజయవాడకు చార్జీ రూ.2,600 నుంచి రూ.4,000 వరకు ఉండేది. ఇప్పుడు అమాంతం రూ.14 వేల వరకు పెరిగిపోయింది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గమ్య స్థానాలన్నింటికీ విమాన చార్జీలు భారీగా పెరిగాయని వారు తెలిపారు. కాగా సోమవారం వరకు పరిమితంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించిన విమాన ప్రయాణికులు, ఇకమీదట ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. గత వారంలో శుక్రవారం నుంచి వరుసగా మూడు దినాల సెలవు రావడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విమాన ప్రయాణికుల్లో కూడా చాలా మంది చార్జీలకు జడిసి బస్సులను ఆశ్రయించారు. గత గురువారం ప్రైవేట్ బస్సులో విజయవాడ వెళ్లడానికి ఒక టికెట్‌కు రూ.3 వేలు... అంటే మూడు రెట్లు అధికంగా చెల్లించడానికి సిద్ధపడినా సీట్లు లభించలేదు.