
రూ. 1887కే ఇండిగో విమాన టికెట్లు!!
వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ చవక ధరలకే ప్రయాణాలను అందించడం మొదలుపెట్టాయి. ఇప్పుడీ రేసులోకి ఇండిగో కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు.. అంటే, రూ. 1887కే అన్ని పన్నులతో కలుపుకొని టికెట్లు అందిస్తామని ప్రకటించింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. టికెట్ల బుకింగ్ గురువారం మొదలైంది. ఇలా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రకటించడంతో ఇండిగో ప్రత్యర్థి స్సైస్ జెట్ తన ఆఫర్ను గురువారం వరకు పొడిగించింది. ఈ ఆఫర్ కింద, దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి టికెట్ రూ. 1888 మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. (మళ్లీ 600కే విమాన టికెట్లు)
ఇక ఎయిర్ ఏషియా ఇండియా అయితే 600 నుంచి 1900 వరకు మూడు రకాలుగా ధరలను నిర్ణయించింది. ప్రయాణ కాలాన్ని కూడా ప్రత్యర్థి సంస్థల్లా మూడు నాలుగు నెలలు కాకుండా ఏకంగా ఏడాదికి పైగా ఉంచింది. వీటన్నింటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా కూడా చవక ధరలకు దిగింది. ఏకంగా వంద రూపాయలకే పరిమిత కాలానికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో ఆ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. (రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం)