సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రవాణా సేవలను పూర్తిగా స్తంభింపజేసింది. సోమవారం అర్ధరాత్రి వరకు నగరానికి వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న సొంత డిపోలకు రాత్రికి రాత్రే తిరిగి వెళ్లిపోయాయి. ఇప్పటి వరకు రాత్రి పూట అర కొర సర్వీసులు నడిచేవి. ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేకపోయినా ఆర్టీసీ ఆ సర్వీసులను నడుపుతూ వచ్చింది.
మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సుల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొంటే ఒక బస్సూ నడవదని, ఒకటి, రెండు సంఘాలు పాల్గొనకపోతే కొన్ని బస్సులను నడిపే అవకాశాలున్నాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నందున, అన్ని సంఘాలు విధిగా సమ్మెలో పాల్గొనాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పాయి. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఉద్యమ తీవ్రతను గుర్తించి కేఎస్‌ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసులను ఎప్పుడో నిలిపివేసింది. ఇక రైళ్లే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా మిగిలాయి.
ఆకాశంలోనే విమాన చార్జీలు
అత్యవసర పనులపై విమానాలను ఆశ్రయిస్తున్న వారి జేబులు చిల్లులు పడుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభానికి ముందు వరకు బెంగళూరు నుంచి విజయవాడకు చార్జీ రూ.2,600 నుంచి రూ.4,000 వరకు ఉండేది. ఇప్పుడు అమాంతం రూ.14 వేల వరకు పెరిగిపోయింది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గమ్య స్థానాలన్నింటికీ విమాన చార్జీలు భారీగా పెరిగాయని వారు తెలిపారు. కాగా సోమవారం వరకు పరిమితంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించిన విమాన ప్రయాణికులు, ఇకమీదట ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. గత వారంలో శుక్రవారం నుంచి వరుసగా మూడు దినాల సెలవు రావడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విమాన ప్రయాణికుల్లో కూడా చాలా మంది చార్జీలకు జడిసి బస్సులను ఆశ్రయించారు. గత గురువారం ప్రైవేట్ బస్సులో విజయవాడ వెళ్లడానికి ఒక టికెట్‌కు రూ.3 వేలు... అంటే మూడు రెట్లు అధికంగా చెల్లించడానికి సిద్ధపడినా సీట్లు లభించలేదు.
ప్రయాణికుల పాట్లు
Published Tue, Aug 13 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement