transport services
-
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు సేవలను అందిస్తున్న ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంస్థ గరుడవేగ.. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కూడా కొత్త బ్రాంచీలను ప్రారంభించనుంది. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా ఉన్న పార్శిళ్లకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న బంధువులకు చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గరుడ వేగ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, విదేశాల్లో తమవారికి దూరంగా ఉన్నప్పటికీ కానుకలు పంపించి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందన్న గరుడవేగ.. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సదుపాయాలను ఆఫర్ల రూపంలో అందించనుంది. ఈ సందర్భంగా వినియోగదారులకు కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. -
మా కుటుంబానికి చావే దిక్కు
హిమాయత్‌నగర్: న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాం..వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కలిశాం. అయినా న్యాయం జరగలేదు. నాపై దాడులు జరిగాయి, నా వద్ద కార్లను బలవంతంగా లాక్కున్నారు నాకు న్యాయం చేయమని పోలీసులను కోరితే వ్యగ్యంగా మాట్లాడి మానసిక క్షోభకు గురి చేశారని ‘జోయిల్ అసోసియేట్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్’ పార్టనర్స్ తలారి సుజాత, శాంతరమేష్లు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధార భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయం జరగకపోతే మరికొద్ది రోజుల్లో నేను, నా భార్య, నా కుమార్డె, కుమారుడు కలసి ఆత్మహత్య చేసుకుంటామంటూ విలపించారు. శాంతరమేష్ మాట్లాడుతూ..మాది పశ్చిమగోదావరి జిల్లా దొంబేర గ్రామం. 1996లో నగరానికి వలస వచి, నేరెడ్‌మేట్‌లో ఉంటున్నాం. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. మేం ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీలో 16 కార్లు తీసుకుని నా తమ్ముడు రామకృష్ణకు చెందిన ‘లాజిస్టిక్’ అనే సంస్థకు లీజుకు ఇచ్చాం. మాకు రూ.50 లక్షలు నష్టం చూపించాడు. దీంతో కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి రూ.4 వడ్డీతో రూ.15లక్షలు అప్పుగా తీసుకుని నా తమ్ముడు రామకృష్ణకు ఇప్పించాను. రామకృష్ణ తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో మధ్యలో ఉన్న కారణంగా నావి 13 కార్లను కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిలు దౌర్జన్యంగా లాక్కున్నారు. ఈ విషయంపై నేరెడ్మేట్ పోలీసులను సంప్రదిస్తే చర్యలు తీసుకోవాల్సిన వాళ్లు వ్యగ్యంగా మాట్లాడుతూ నన్ను మానసిక క్షభకు గురి చేస్తున్నారన్నారు. నా ఇద్దరు పిల్లలను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. -
క్లిక్ దూరంలో సరుకు రవాణా..
• దేశంలో విస్తరిస్తున్న అగ్రిగేటర్లు • తక్కువ రేట్లకే రవాణా సేవలు • వ్యవస్థీకృతం అవుతున్న పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ తను విక్రయించే వస్తువుల్లో దేన్నీ తను తయారు చేయదు. అలా తయారుచేసి... విక్రయించేవాళ్లందరినీ కలుపుతుంది. క్యాబ్ రవాణా సంస్థ ఉబెర్‌కు... సొంత కార్లేమీ లేవు. కార్లుండి వాటిని ట్యాక్సీలుగా నడిపేవారిని, డ్రైవర్లచేత నడిపించే వారిని టెక్నాలజీతో కలుపుతుంది. ఇవేకాదు. రియల్ ఎస్టేట్, ఆరోగ్య పరీక్షలు, వార్తలు, రవాణా... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అగ్రిగేటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. అవసరం ఉన్నవాళ్లని... ఆ అవసరం తీర్చేవాళ్లని కలిపేవే ఈ అగ్రిగేటర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది అగ్రిగేటర్ల రాజ్యం. వాటి దగ్గర భౌతిక ఆస్తులుండవు. టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. ఇపుడు సరకు రవాణాలో ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది. దేశంలో సరకు రవాణా రంగంలో ఏటా రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీటిలో టాప్–10 ట్రాన్స్పోర్ట్ కంపెనీల వాటా 2 శాతంలోపే. చాలావరకూ అవ్యవస్థీకృతంగానే ఉండటంతో మధ్యవర్తులదే రాజ్యం. పైపెచ్చు లావాదేవీలన్నీ నగదు రూపంలోనే. వాహనంపై యజమానికి నియంత్రణ ఉండటం లేక డ్రైవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. సరుకు క్షేమంగా గమ్యం చేరడం ఒక ఎత్తైతే.. రవాణా డబ్బులు చేతికందే వరకు సగటు యజమానుల తిప్పలు అన్నీఇన్నీ కావు. ఈ మధ్యవర్తులకు అడ్డుకట్ట వేసి... అంతా పారదర్శకంగా నిర్వహించటానికి టెక్నాలజీ ఆసరాగా అగ్రిగేటర్లు రంగంలోకి దిగుతున్నారు. పెద్ద పెద్ద సంస్థలతో పాటు కార్పొరేట్ దిగ్గజాలూ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ అగ్రిగేటర్లు ఏం చేస్తాయంటే... ఫోర్టిగో, ట్రక్ సువిధ, ట్రక్ మండి, ఫ్రెయిట్ బజార్, స్మార్ట్‌షిఫ్ట్, ఆటో లోడ్, ఫ్రెయిట్ టైగర్, మూవో, ట్రక్కీ, బ్లాక్‌బక్, గోగో ట్రక్, కార్గో ఎక్సే్చంజ్, రిటర్న్ట్రక్స్.కామ్ వంటివన్నీ సరకు రవాణా ఆగ్రిగేటర్లే. ఒక్కొక్కరిదీ ఒకో వ్యూహం. వాహనంలో పూర్తిగా సరుకు నింపకపోయినా... ఇతర కస్టమర్ల సరుకుల్ని కూడా కలిపి రవాణా చేస్తుంటాయివి. వీటిని ఆశ్రయించిన వినియోగదారులకు 10–20 శాతం తక్కువ ధరకే సేవలందుతున్నాయి. సాధారణంగా ఆఫ్‌లైన్‌లో వాహన యజమానులు రానూపోనూ ఛార్జీల్ని ఒకేసారి వసూలు చేస్తుంటారు. అగ్రిగేటర్ల రాకతో ఆ పరిస్థితి లేదు. ఒకవైపుకే వసూలు చేస్తున్నారు కూడా. వాహనం ఎటు వెళుతోందో తెలుసుకునేందుకు జీపీఎస్... రియల్ టైమ్ ఇన్వాయిస్... శిక్షణ పొందిన డ్రైవర్లు ఇలా పలు సంస్థలు ప్రత్యేకమైన సేవలందిస్తున్నాయి. వాహన యజమానులకు రుణాలూ ఇప్పిస్తున్నాయి. వాహనం దారి మధ్యలో నిలిచిపోతే వెంటనే మరో వాహనంలో సరుకును తరలించటం కూడా చేస్తున్నారు. ‘‘సరుకు రవాణాలో వచ్చే మూడేళ్లలో మెజారిటీ వాటా వ్యవస్థీకృతమవుతుంది’’ అని ఫోర్టిగో సహ వ్యవస్థాపకులు వివేక్ మల్హోత్రా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తాము పూర్తిగా క్యాష్‌లెస్ లావాదేవీలే చేస్తున్నామన్నారు. ‘‘వాహనాల ట్రాకింగ్ ఉండాలని మా కస్టమర్లు అడుగుతున్నారు. గ్యారం టీ చెల్లింపులు, రవాణాకు హామీ ఉంటోంది కనక మాతో ట్రాన్స్పోర్టర్లు చేతులు కలుపుతున్నారు’’ అని వివరించారాయన. పనితీరులో పారదర్శకత... సరుకు రవాణా చేయదల్చుకున్నవారు అగ్రిగేటర్ వెబ్సైట్ లేదా యాప్‌లో సమాచారాన్ని పోస్ట్ చేయాలి. సరుకు రకం, బరువు, దూరాన్నిబట్టి వాహన యజమానులు చార్జీ చెబుతారు. ఇద్దరికీ సమ్మతమైతే డీల్ కుదురుతుంది. అగ్రిగేటర్లు వాహన యజమాని నుంచిగానీ, కస్టమర్ నుంచి గానీ... కొందరైతే ఇద్దరి నుంచీ కొంత కమిషన్ వసూలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం వాహనాలు రోడ్డెక్కుతాయి కనక అదనపు ట్రిప్పులకు ఆస్కారముంటుంది. ‘సరుకు రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న కస్టమర్లూ ఉన్నారు. డిమాండ్ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం’ అని స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య నందకుమార్ తెలిపారు. వాహన యజమానుల ఆదాయం భారీగా పెరిగింది. లెండింగ్‌కార్ట్ ద్వారా వారికి రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. మహీంద్రా గ్రూప్ స్మార్ట్‌షిఫ్ట్ సీడ్ ఇన్వెస్టర్‌గా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్కులు : 25 లక్షలు 1–5 ట్రక్కులున్నవారు : 80 శాతం 20 కన్నా ఎక్కువ ట్రక్కులున్న వారు : 10 శాతం 5– 20 ట్రక్కులున్న వారు : 10 శాతం తేలికపాటి రవాణా వాహనాలు : 20 లక్షలపైనే -
గరుడ సేవరోజు నడక మార్గాలు తెరిచి ఉంచాలి
– బ్రహ్మోత్సవ భక్తులకు సురక్షిత రవాణా – టికెట్ల కోసం వేచి వుండకుండా చర్యలు – ఘాట్ రోడ్లలో క్రేన్లు, మెకానిక్‌లు అందుబాటులో ఉంచండి – ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అ«ధికారులకు ఈవో ఆదేశం తిరుపతి అర్బన్: తిరుమలలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరిగే రోజు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు, సురక్షిత ప్రయాణం, టికెట్ల కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఈవో ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణా ఏర్పాట్లు చేపట్టేందుకు రెండు విభాగాలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయాల్లో ఘాట్ రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు, టీటీడీ భద్రతా విభాగం, మెకానిక్ సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. ఐదు ప్రాంతాల్లో క్రేన్లు, సంక్లిష్ట ప్రాంతాల్లో అదనపు మెకానిక్‌లను సిద్ధంగా వుంచుకోవాలన్నారు. గరుడసేవ రోజు మరింత పటిష్ట ఏర్పాట్లు: బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన గరుడసేవ రోజు భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు, టీటీడీ భద్రతా విభాగం అ«ధికారులకు ఈవో సూచించారు. గరుడసేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా వుండనున్న నేపధ్యంలో అలిపిరి నడకమార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటలపాటు తెరచి వుంచాలని కోరారు. అందులో భాగంగానే అక్టోబర్ 16వతేదీ వరకు బ్రహ్మోత్సవాల రోజులతో పాటు శని, ఆదివారాల్లోను ఘాట్ రోడ్లను భక్తులకు సౌకర్యంగా తెరిచి వుంచాలన్నారు. తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు తిరుమలలోని పాపవినాశనంరోడ్, రింగ్‌రోడ్ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలన్నారు. అందుకోసం పోలీసులు, టీటీడీ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని యాత్రికులకు పార్కింగ్ కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు భక్తులు టికెట్లకోసం వేచివుండకుండా తగినంత కండక్టర్ సిబ్బంది అందుబాటులో వుంచుకోవాలన్నారు. ఆర్టీసి సిబ్బందికి ఎక్కడికక్కడ సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా వైర్లెస్ సెట్లు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని టీటీడీ అ«ధికారులను ఈవో ఆదేశించారు. శ్రీవారిమెట్టుకు ఉచిత బస్సులు : గరుడసేవ రోజు తిరుపతి, పరిసర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టుకు ఉచితంగా బస్సులు నడపనున్నట్టు ఈవో వెల్లడించారు. ఇందుకోసం 3 బస్సులను నిరంతరం తిప్పనున్నట్టు పేర్కొన్నారు. గరుడసేవ ముగిసిన తర్వాత కూడా భక్తులు శ్రీవారి మెట్టు నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకోనున్నట్టు తెలిపారు. ఉచిత బస్సులతో పాటు ఆర్టీసి బస్సులు యధాతథంగా నడుస్తాయని వివరించారు. రోజుకు 516 బస్సులు : బ్రహ్మోత్సవాల్లో రోజుకు 516 బస్సుల ద్వారా 2వేల ట్రిప్పులు తిప్పనున్నట్టు ఆర్టీసి ఆర్ఎం నాగశివుడు తెలిపారు. గరుడసేవ రోజు 540 బస్సులతో 3,500 ట్రిప్పులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈసమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆల్ ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో రవాణా సేవలు
హైదరాబాద్: రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్లైన్లో అందించనున్నారు. ఈ సదుపాయం మే 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సేవల ఫీజును మాత్రం మీ సేవలో చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
రవాణా సేవలకు ఛార్జీల మోత
► జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం ► ఖజానాకు ఆదాయం పెంపే లక్ష్యం విశాఖపట్నం : వాహనదారులపై మరో భారం పడింది. రవాణా సేవలు పొందే వినియోగదారుల నుంచి సర్వీస్, యూజర్ ఛార్జీల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో ఆయా సేవలు బట్టి ధరలు అమాంతంగా పెంచారు. 50 నుంచి 100 శాతం వరకూ ఛార్జీల మోత మోగించారు. దీంతో ఏడాదికి జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం పడనుంది. డ్రైవింగ్ లెసైన్స్‌లు, కొత్త వాహనాల రిజస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రోడ్ టాక్స్ చెల్లించే వారికి ధరల భారం ఉంటుంది. 2014-15 ఏడాదిలో ఫీజుల రూపంలో రూ.23.16 కోట్లకు గానూ రూ.20.17 కోట్లు రాబట్టారు. యూజర్ ఛార్జీలు రూ.8.04 కోట్లకు రూ.6.49 కోట్లు వసూలు చేశారు. పన్నులు, ఇతరత్రా సేవలుగా ఫీజులు, యూజర్ ఛార్జీల చెల్లింపులతో సర్వీసు ఛార్జీలు ముడిపడి ఉండగా వాటిని వసూలు చేస్తారు. రవాణా ఆదాయ లక్ష్యం రూ.348 కోట్లు ! రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఏడాదికి సుమారు రూ.348 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. గతేడాదితో పోల్చితే దాదాపు 15 శాతం ఆదాయ లక్ష్యాన్ని పెంచినట్టు భోగట్టా. ఆయా జిల్లాలకు ఆదాయ లక్ష్యం 15 నుంచి 20 శాతం పెంచినట్టు తెలిసింది. అయితే సీఎం చైనా పర్యటనలో ఉండటంతో లక్ష్యం పూర్తిగా ఖరారు కాలేదు. సీఎం ఆమోదంతో ఒక్కో జిల్లాకు ఆదాయ లక్ష్యం అధికారికంగా ప్రకటించనున్నారు. 2014-15 ఏడాదికి రూ.302 కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.225.27 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాదిలో 75 శాతం ఫలితాలతో రాష్ట్రంలో విశాఖకు ఐదో స్థానం దక్కింది. ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు ఆదాయ వసూళ్లు తగ్గాయని, లక్ష్య సాధన కోసం అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని రవాణశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు బోధించినట్టు సమాచారం. త్రైమాసిక పన్నుల వసూళ్లలో అలసత్వం ప్రదర్శించవద్దని కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. తనిఖీలు విస్తృతం చేసి పన్నుల ద్వారా ఆదాయం రాబట్టాలని తెలియజేసినట్టు వినికిడి. -
నూతన సర్వర్ ద్వారా రవాణా సేవలు
చిత్తూరు(జిల్లాపరిషత్) న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ సోమవారం నుంచి నూతన సర్వర్ ద్వారా ప్రజలకు సేవలను ప్రారంభించింది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర సేవలను నూతన సర్వర్ ద్వారా అందించినట్టు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. నూతన రాష్ట్రానికి సం బంధించి ఏపీ జిల్లా సీరీస్ త్వరలో మారుతుందన్నారు. తెలంగాణ రా ష్ట్రానికి ఇచ్చిన టీజీ కోడ్‌ను టీఎస్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకా శం ఉందని ఆయన పేర్కొన్నారు. పాత పర్మిట్లు చెల్లుతాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసుకు న్న పర్మిట్లు రెండు రాష్ట్రాల్లో చెల్లుబాటవుతాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం జూన్ 1న 46 జీవోను జారీ చేసిందని ఎం.బసిరెడ్డి తెలిపా రు. దీంతో పర్మిట్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో సంబంధిత వాహనా లు తిరగవచ్చన్నారు. జూన్ 1వ తేదికి ముందు జీవితకాలం పన్ను చెల్లించి న వాహనాలు తెలంగాణలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, తెలంగాణ పరిధిలో చెల్లించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో చెల్లించాల్సిన అవసరం లేద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం దన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధిం చి ఇప్పుడున్న పర్మిట్లు అలాగే కొనసాగించనున్నట్టు తెలిపారు. నూతన రాష్ట్రంలో జరిగే లావాదేవీలు ఆయా రాష్ట్రాలకు పరిమితం కానున్నాయని, మన రాష్ట్రంలో పర్మిట్ తీసుకున్న వాహనాలు అక్కడకు వెళితే అక్కడ తప్పనిసరిగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
31,1 తేదీల్లో ’రవాణా’ సేవలు బంద్
సాక్షి, కర్నూలు: విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ రెండు రోజుల పాటు రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం త్రీ టైర్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ విధానం ద్వారా రవాణాశాఖ ఆన్లైన్లో సేవలు అందిస్తోంది. దీని ప్రధాన సర్వర్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 31, జూన్ 1 తేదీల్లో ప్రధాన సర్వర్‌ను పూర్తిగా ఆపేయనున్నారు. దీంతో డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. దీంతోపాటు వాహనాల విక్రయ సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ సంఖ్య(టీఆర్ నంబరు)ను జారీ చేయాలన్నా రవాణాశాఖ ప్రధాన సర్వర్‌తో అనుసంధానం కావాల్సి ఉండడం, ఆ నంబరు లేకుండా వాహనాలు రోడ్డెక్కే అవకాశం లే కపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు రోజులపాటు షోరూములో వాహనా విక్రయాలు కూడా సాగే పరిస్థితి లేదు. వాహనాలకు సంబంధించి వివిధ రకాల పన్ను, లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సుల రుసుములకు సంబంధించి ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లింపులు కూడా ఆగిపోతాయి. 29, 30 తేదీల్లో అదనపు పని గంటలు మే 31, జూన్ ఒకటో తేదీల్లో సేవలు నిలిచిపోనున్నందునా అందుకు ప్రతిగా మే 29, 30 తేదీల్లో అదనపు గంటలు పని చేసేందుకు రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కౌంటర్లో సేవలు అందిస్తారు. మే 29, 30 తేదీల్లో మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. -
ప్రయాణికుల పాట్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రవాణా సేవలను పూర్తిగా స్తంభింపజేసింది. సోమవారం అర్ధరాత్రి వరకు నగరానికి వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న సొంత డిపోలకు రాత్రికి రాత్రే తిరిగి వెళ్లిపోయాయి. ఇప్పటి వరకు రాత్రి పూట అర కొర సర్వీసులు నడిచేవి. ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేకపోయినా ఆర్టీసీ ఆ సర్వీసులను నడుపుతూ వచ్చింది. మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సుల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొంటే ఒక బస్సూ నడవదని, ఒకటి, రెండు సంఘాలు పాల్గొనకపోతే కొన్ని బస్సులను నడిపే అవకాశాలున్నాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నందున, అన్ని సంఘాలు విధిగా సమ్మెలో పాల్గొనాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పాయి. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఉద్యమ తీవ్రతను గుర్తించి కేఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసులను ఎప్పుడో నిలిపివేసింది. ఇక రైళ్లే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా మిగిలాయి. ఆకాశంలోనే విమాన చార్జీలు అత్యవసర పనులపై విమానాలను ఆశ్రయిస్తున్న వారి జేబులు చిల్లులు పడుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభానికి ముందు వరకు బెంగళూరు నుంచి విజయవాడకు చార్జీ రూ.2,600 నుంచి రూ.4,000 వరకు ఉండేది. ఇప్పుడు అమాంతం రూ.14 వేల వరకు పెరిగిపోయింది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గమ్య స్థానాలన్నింటికీ విమాన చార్జీలు భారీగా పెరిగాయని వారు తెలిపారు. కాగా సోమవారం వరకు పరిమితంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించిన విమాన ప్రయాణికులు, ఇకమీదట ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. గత వారంలో శుక్రవారం నుంచి వరుసగా మూడు దినాల సెలవు రావడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విమాన ప్రయాణికుల్లో కూడా చాలా మంది చార్జీలకు జడిసి బస్సులను ఆశ్రయించారు. గత గురువారం ప్రైవేట్ బస్సులో విజయవాడ వెళ్లడానికి ఒక టికెట్‌కు రూ.3 వేలు... అంటే మూడు రెట్లు అధికంగా చెల్లించడానికి సిద్ధపడినా సీట్లు లభించలేదు.