బ్రహ్మోత్సవాల రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన ఈవో డాక్టర్ సాంబశివరావు , చిత్రంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తదితరులు
– బ్రహ్మోత్సవ భక్తులకు సురక్షిత రవాణా
– టికెట్ల కోసం వేచి వుండకుండా చర్యలు
– ఘాట్ రోడ్లలో క్రేన్లు, మెకానిక్‌లు అందుబాటులో ఉంచండి
– ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అ«ధికారులకు ఈవో ఆదేశం
తిరుపతి అర్బన్:
తిరుమలలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరిగే రోజు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు, సురక్షిత ప్రయాణం, టికెట్ల కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఈవో ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణా ఏర్పాట్లు చేపట్టేందుకు రెండు విభాగాలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయాల్లో ఘాట్ రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు, టీటీడీ భద్రతా విభాగం, మెకానిక్ సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. ఐదు ప్రాంతాల్లో క్రేన్లు, సంక్లిష్ట ప్రాంతాల్లో అదనపు మెకానిక్‌లను సిద్ధంగా వుంచుకోవాలన్నారు.
గరుడసేవ రోజు మరింత పటిష్ట ఏర్పాట్లు:
బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన గరుడసేవ రోజు భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు, టీటీడీ భద్రతా విభాగం అ«ధికారులకు ఈవో సూచించారు. గరుడసేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా వుండనున్న నేపధ్యంలో అలిపిరి నడకమార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటలపాటు తెరచి వుంచాలని కోరారు. అందులో భాగంగానే అక్టోబర్ 16వతేదీ వరకు బ్రహ్మోత్సవాల రోజులతో పాటు శని, ఆదివారాల్లోను ఘాట్ రోడ్లను భక్తులకు సౌకర్యంగా తెరిచి వుంచాలన్నారు.
తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు
తిరుమలలోని పాపవినాశనంరోడ్, రింగ్‌రోడ్ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలన్నారు. అందుకోసం పోలీసులు, టీటీడీ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని యాత్రికులకు పార్కింగ్ కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు భక్తులు టికెట్లకోసం వేచివుండకుండా తగినంత కండక్టర్ సిబ్బంది అందుబాటులో వుంచుకోవాలన్నారు. ఆర్టీసి సిబ్బందికి ఎక్కడికక్కడ సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా వైర్‌లెస్ సెట్‌లు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని టీటీడీ అ«ధికారులను ఈవో ఆదేశించారు.
శ్రీవారిమెట్టుకు ఉచిత బస్సులు :
గరుడసేవ రోజు తిరుపతి, పరిసర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టుకు ఉచితంగా బస్సులు నడపనున్నట్టు ఈవో వెల్లడించారు. ఇందుకోసం 3 బస్సులను నిరంతరం తిప్పనున్నట్టు పేర్కొన్నారు. గరుడసేవ ముగిసిన తర్వాత కూడా భక్తులు శ్రీవారి మెట్టు నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకోనున్నట్టు తెలిపారు. ఉచిత బస్సులతో పాటు ఆర్టీసి బస్సులు యధాతథంగా నడుస్తాయని వివరించారు.
రోజుకు 516 బస్సులు :
బ్రహ్మోత్సవాల్లో రోజుకు 516 బస్సుల ద్వారా 2వేల ట్రిప్పులు తిప్పనున్నట్టు ఆర్టీసి ఆర్‌ఎం నాగశివుడు తెలిపారు. గరుడసేవ రోజు 540 బస్సులతో 3,500 ట్రిప్పులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈసమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆల్ ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు, ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు, టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.