అనంతరం పలు విభాగాల తనిఖీ
క్యూలైన్ల వద్ద పారిశుధ్యంపై తీవ్ర ఆగ్రహం
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్న ఈవో
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జె.శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో (ఎఫ్‌ఏసీ) ఎ.వి.ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం సతీమణితో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆయనకు స్వామి విశిష్టతను తెలిపారు.
దర్శనం అనంతరం ఈవోని వేద పండితులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. దీనికిముందు సంప్రదాయాన్ని అనుసరించి ఈవో తొలిగా వరాహస్వామిని దర్శించుకుని క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీఎస్‌వో నరసింహకిషోర్, అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
హైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీస్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారన్నారు. ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం తన అదృష్టమని, స్వామి ఆశీస్సులతో ఈ మహాద్భాగ్యం దక్కిందని చెప్పారు.
ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన సాగేలా చర్యలు చేపడతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ టెంపుల్ తిరుమల అని గుర్తుచేశారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషంగా తిరుగుప్రయాణం అవ్వాలనే ప్రయత్నం చేస్తానన్నారు.
ఆగమశాస్త్రం అనుసారం శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేకదృష్టి ఉందన్నారు. టీటీడీ నిధులు దుబారా కాకుండా సక్రమంగా వినియోగిస్తామని చెప్పారు. గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడతామన్నారు. అలాంటి చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నూతన ఈవో తనిఖీలు
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్యామలరావు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్‌లో భక్తులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల వద్ద పారిశుధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిరోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు.
క్యూలైన్ల వద్ద భక్తులకు అందించే తాగునీటిని పరిశీలించి ల్యాబ్‌కు పంపించాలని అధికారులకు సూచించారు. హెల్త్ విభాగంలో ఇద్దరు అధికారులకు మెమో జారీచేసే యోచనలో ఉన్నారు. తనిఖీల అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. క్యూలైన్లలో ఆహారం, తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని, నీటిని ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించామని తెలిపారు.
క్యూలైన్‌లో పాలను సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై విచారిస్తామన్నారు. కాలిబాటలో టికెట్లు ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారని, దీనిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. క్యూలైన్ల పైన కూడా సమీక్షించి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment