కళ్లుతిరిగి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వైనం
విజయనగరం అర్బన్/సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రం విజయనగరంలోని కాటవీధిలోగల బీసీ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. శ్యామలరావు ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత మంచినీళ్లు తాగి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్తూ కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయినట్టు వార్టెన్ జానకిరావు తెలిపారు.
అతడిని వెంటనే నగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే విద్యార్థి మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు తెలిపారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిని కాదని దూరంగా ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లడం వల్లే తమ మేనల్లుడి ప్రాణాలు పోయాయని శ్యామలరావు మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్యామలరావు మృతికి కారణం ఏమిటనేది తెలియదని బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి ఈడీ పెంటోజీరావు చెప్పారు. హాస్టల్‌లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో శ్యామలరావుకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం హాస్టల్‌లో విద్యార్థులెవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు.
నివేదిక ఇవ్వండి: మంత్రి సవిత ఆదేశం
విజయనగరంలోని బీసీ హాస్టల్ విద్యార్థి కొణతాల శ్యామలరావు మృతికి కారణాలపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ విద్యార్థి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను విచారించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment