తిరుపతి, సాక్షి: తొక్కిసలాట ఘటన దురదృష్టకర ఘటనేనని టీటీడీ చైర్మన్, ఈవో సంయుక్త ప్రెస్‌మీట్‌లో మరోసారి ప్రకటించారు. అంతేకాదు.. విబేధాలు ఉన్నాయంటూ నడుస్తున్న ప్రచారంపైనా ఇద్దరూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
జనవరి 8వ తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగింది. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేశాం. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేసారు
కొన్ని ప్రసార మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో టీటీడీ(TTD)పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయం. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించండి. పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందరు సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు అని ప్రకటించారు.
సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీటీడీ ఈఓ(TTD EO) శ్యామలరావు అన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును నేను విభేదించానన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం. చైర్మన్‌తో పాటు సభ్యులతో, అదనపు ఈఓ తో నాకు విభేదాలు ఉన్నట్టు సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాలు పూర్తి అవాస్తవం. అలాగే సమన్వయం లోపం వల్ల తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందన్న వార్తలూ అవాస్తవం. వైకుంఠ ద్వార దర్శన పని ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలను పట్టించుకోలేదు.
వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు బాగానే చేశాం. కానీ తిరుపతిలో జరిగిన ఘటన ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. టోకెన్లకు వదిలినప్పుడు తొక్కిసలాట అనుకోకుండా జరిగింది. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
అందరి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము. ఆరునెలల్లో అనేక మార్పులు చేశాం. ప్రక్షాళనలో భాగంగా కల్తీనెయ్యి వినియోగాన్ని గుర్తించి కల్తీనెయ్యి సరఫరా చేసిన సరఫరాదారులపై చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాల్లో నాణ్యత తీసుకొచ్చాం. దళారీలను అరికట్టాం, వేల సంఖ్యలో ఉన్న ఆన్ లైన్ బ్రోకర్ల బెడదను నివారించాం. సీఎం ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులూ లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్ లో ఇంకా అనేక మార్పులు తీసుకొని రావాల్సి ఉంది. మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే వచ్చే ఏడాది నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.
పవన్ ఏమన్నారంటే..
ఇదిలా ఉంటే.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు జరిగిందని.. క్షమించమని భక్తులను కోరారు. ఘటనలో టీటీడీ బోర్డు వైఫల్యం ఉందని, ఈవో శ్యామలా రావు, ఏఈవో వెంకయ్య చౌదరి మధ్య గ్యాప్ ఉందని వ్యాఖ్యానించారు. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. ఈ సందర్భంగా వారిద్దరికి పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment