సాక్షి, తిరుపతి: క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కౌంటర్ ఇచ్చారు.
తొక్కిసలాట ఘటనకు టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగా జరగలేదన్నారు.
కాగా, తొక్కిసలాట ఘటనపై ఇవాళ పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు.. ఈవో, ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.
ఇదీ చదవండి: పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్స
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమాచారం పాలకమండలికి టీటీడీ అధికారులు ఇవ్వలేదని.. సమన్వయ లోపం కారణంగానే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటు ఈవోని సభ్యులు నిలదీశారు. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 2 నుండి 5 లక్షలు టీటీడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ త్రయోదశి తర్వాత టోకెన్ లేకుండా సర్వదర్శనానికి అనుమతించాలని పాలకమండలిలో చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment