శ్రీవారి లడ్డూల స్కాంపై విచారణ
స్విమ్స్‌కు జాతీయ హోదాకు వినతి
కంచి పీఠానికి రూ.2 కోట్లు
పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన ఈవో శ్యామలరావు
తిరుమల: తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా పేరొందిన బ్రాండెడ్ హోటళ్లు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. బ్రాండెడ్ హోటళ్లు వాటి పేరు, ప్రఖ్యాతుల కోసం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు.
మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో మీడియాకు వివరించారు.
తిరుమలలోని బిగ్, జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.
లడ్డూల స్కాంపై విచారణ
చెన్నైలోని టీటీడీ సమాచారం కేంద్రం నుంచి శ్రీవారి ప్రసాదాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంపై విచారణ చేపట్టామని ఈవో చెప్పారు. సోమవారం ‘సాక్షి’లో ‘శ్రీవారి లడ్డూల గుటకాయ స్వాహా!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై విచారణ చేపట్టామన్నారు.
విచారణ అనంతరం లడ్డూలు పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఏస్వో శ్రీధర్ పాల్గొన్నారు.
పాలకమండలి ప్రధాన నిర్ణయాలివీ
» టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్‌టెన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు.
» దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా కమిటీ ఏర్పాటుకు ఆమోదం.
» స్విమ్స్ ఆస్పత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
» కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం.
» భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ మేరకు ఏపీ డిజిటల్ కారొరేషన్ సహకారంతో భక్తుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయం.
» మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం.
» కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం.
» భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం.
» ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
» ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
అరగంటలో ‘వైకుంఠ ఏకాదశి’ టికెట్లు ఖాళీ
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేసిన అరగంటకే ఖాళీ అయిపోయాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతిస్తుంది.
ఇందుకోసం ఆ పది రోజులకు 1.40 లక్షల రూ.300 టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. వీటి కోసం 14 లక్షలు మంది ఆన్‌లైన్‌లో పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment