Tirumala Bramhostavams
-
చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శిమిచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : గరుడు వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం (ఫొటోలు)
-
తిరుమల: ఆన్లైన్ టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆన్లైన్ కల్యాణోత్సవ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదు. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. (చదవండి: సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ) -
సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. సింహం అంటే ముందుగా నరసింహ అవతారమే సాక్షత్కరిస్తుంది. భక్తుల మదిలో వెంకటాద్రి రాజసింహం మృగరాజుపై యోగముద్రంకిత స్వరూపంతో దర్శనమిచ్చారు. కాగా ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్
సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. (సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు) 24న ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకోని అల్పాహారం స్వీకరించి సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
తిరుమలలో వైభవంగా బ్రహ్మొత్సవాలు
-
వెంకన్న చెంత..జననేత
-
శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. తన వెంట తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని రాత్రి 7.11గంటలకు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు 7.21గంటలకు చేరుకున్నారు. తిరుమల పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం స్వామి వారి సన్నిధికి చేరుకుని ఆలయ అర్చకులకు పట్టువస్త్రాలను అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని వకుళామాత, ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహ స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు పలికారు. అక్కడే బియ్యంతో తులాభారం మొక్కు సమర్పించారు. ఆ తర్వాత వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్.గిరీష, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం ఉన్నారు. బియ్యంతో తులాభారం సమర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్ కుటుంబానికి అరుదైన గౌరవం బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన గౌరవం వైఎస్ కుటుంబానికే దక్కింది. ఇంతకు ముందెప్పుడూ సీఎం హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టువస్త్రాలను సమర్పించిన దాఖలాల్లేవు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సార్లు సమర్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. -
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించిన సీఎం వైఎస్ జగన్.. గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందించారు. అనంతరం సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్ఫణకు వెళ్తున్న సీఎం శ్రీ వైయస్.జగన్, పరివట్టం చుడుతున్న అర్చకులు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో.. టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల/సాక్షి, అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’ (మృత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో.. శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.23 నుంచి 7 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈఓ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సర్వం సిద్ధంచేశారు. తిరుమల సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు తిరుమలకు సీఎం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30న తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనా వివరాలు ఇలా ఉన్నాయి.. - సెప్టెంబరు 30న మ.1.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మ.3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. - అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి అక్కడ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి వెళ్తారు. - అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. - ఆ తరువాత తిరుమల వెళ్లి, అక్కడ మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. - రాత్రి 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. - రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబర్ 1న ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
30న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 30న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం 4.15 నిమిషాలకు అలిపిరి-చెర్లోపల్లి నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.15 నిమిషాలకు నందకం అతిథి గృహం వద్ద వకుళా మాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం యాత్రికుల ఉచిత సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాత్రి 7.05 నిమిషాలకు బేడి ఆంజనేయస్వామి వద్ద నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో ప్రారంభమయి.. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం... తిరుమల శ్రీవారి బ్రహ్మోతవ్సాల్లో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరుతూ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. శనివారం సాయంత్రం విజయవాడలో గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీలో చేపట్టిన సంస్కరణల గురించి గవర్నర్‌కు వైవీ తెలియజేశారు. శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు సులువుగా దర్శనం జరిగేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న విధి విధానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. గవర్నర్ ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం
తిరుమల: ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుంచి అక్టోబర్ 8వతేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తెలిపారు. భక్తులంతా టీటీడీ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల భద్రత, సామాన్యులకు స్వామివారి దర్శనం అందేలా తీసుకున్న చర్యల గురించి ఆయన ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఇవీ... రూ.7.53 కోట్లతో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను రూ.7.53 కోట్లతో నిర్వహిస్తున్నాం. తిరుమలలో ఇంజనీరింగ్ పనులతోపాటు పలు నిర్మాణాలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులపాటు ఘాట్ రోడ్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. గరుడ వాహనం ముందు రోజు నుంచి తిరుమల రెండు ఘాట్ రోడ్లల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తాం. గరుడ సేవ ముగిసిన అనంతరం అనుమతిస్తాం. నిరంతరం ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 406 బస్సులతో 1,669 ట్రిప్పులు తిప్పుతున్నాం. 90 వేల మంది తిరుమలకు చేరుకునేలా సదుపాయాలు కల్పించాం. బ్రహ్మోత్సవాల సమయంలో 2,200 ట్రిప్పులు నడిపి 2 లక్షల మందికి సరిపడేలా రవాణా సౌకర్యం కల్పిస్తాం.గరుడ వాహనం రోజు 3,176 ట్రిప్పులు నడపాలని ఆర్టీసీని కోరాం. భక్తుల కోసం 7 లక్షల లడ్డూ ప్రసాదాలు ఈసారి నాలుగు మాడ వీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులను అనుమతిస్తాం. చివరన ఉన్న భక్తులు సైతం ఉత్సవమూర్తులను సంతృప్తికరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉండవు. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. అక్టోబర్ 4న జరిగే గరుడ వాహన సేవ రోజు ప్రొటోకాల్ దర్శనాలు కూడా ఉండవు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి లడ్డూ అందించేలా ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నాం. 3 వేల మంది శ్రీవారి సేవకులు, 3,100 మంది పోలీసులు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తారు. గ్యాలరీల్లో నిరంతరం అన్నప్రసాదం.. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు, గ్యాలరీల్లో వేచిఉన్న వారందరికీ నిరంతరం నీటి సదుపాయంతో పాటు అన్నప్రసాదం వితరణకు ఏర్పాట్లు చేశాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం. అన్నదాన వితరణ భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తాం. తిరుమల ప్రధాన కూడళ్లల్లో 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, మాడవీధుల్లో 12 అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మెరుగైన పారిశుధ్యం కోసం అదనంగా 800 మంది కార్మికులను నియమించాం. 30న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30వతేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించాం. తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకులాదేవి అతిథిగృహాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. పీఎసీ–5కి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తాం. భక్తుల వసతి కోసం రూ.79 కోట్లతో దీన్ని నిర్మిస్తాం. 2,256 మంది భక్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగిస్తాం’ అని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
– శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు – వివిధ శాఖలతో సమావేశమైన ఏపీ డీజీపీ సాంబశివరావు తిరుపతి క్రైం : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు, విజిలెన్స్, టీటీడీ, వివిధ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. శనివారం తిరుపతిలోని పోలీసు గెస్ట్ హౌస్‌లో ఆయన వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు. గరుడసేవ రోజున ప్రత్యేక శ్రద్ధతో మరింత సిబ్బందిని పెంచాలన్నారు. అనుమానిత వ్యక్తులపై, తిరుపతి తిరుమలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను దృష్టిలో వుంచుకుని పనిచేయాలన్నారు. తిరుపతిలో కొత్త వ్యక్తులపై వారి కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. ఆర్టీసిబస్టాండు, రైల్వే స్టేషన్లలో నిఘా భద్రతను పెంచాలన్నారు. నిరంతరం బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లచే ముమ్మర తనిఖీలు చేయాలన్నారు. గరుడసేవ రోజున ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా శాఖతో కలసి వీటి కదలికలపై దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ లాఅండ్ ఆర్డర్ డీజీ ఆర్పీ ఠాగూర్, రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ ప్రభాకర్‌రావు, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఆర్టీసి, విజిలెన్స్ అ«ధికారులు, పోలీసు ఉన్నతా«ధికారులు పాల్గొన్నారు. -
ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు
– బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో ఈవో సమీక్ష – ప్రసారాలు మెరుగ్గా ఉండాలని ఆదేశం తిరుపతి అర్బన్: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రేక్షకులకు తన్మయత్వం కలిగేలా ఎస్వీబీసీ ప్రసారాలు మెరుగ్గా వుండాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని పరిపాలన భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమీక్షించారు. భక్తులు మరింత ఆకర్షితులయ్యేలా టీటీడీ చానల్ ప్రసారాలు వుండాలన్నారు. అవసరమైన అధునాతన కెమెరాలు, లెసెన్స్‌లు, రోప్ కెమెరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీవారి వాహన సేవలపై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిపుణులతో వ్యాఖ్యానాలు చేయించాలన్నారు. కెమెరాల ద్వారా చిత్రీకకరణకు అనుగుణంగా మాఢవీధులు, గ్యాలరీల్లో మరింత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీకి చెందిన ట్రస్టులు, పథకాలు, ఇతర సేవా సంక్షేమ కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. తిరుమల, తిరుపతిలోని వివిధ వేదికలపై ఏర్పాటు చేస్తున్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించాలని కోరారు. అనంతరం ఈవో డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలసి సమీక్షించారు. ఈసమావేశంలో టీటీడీ ఎఫ్ఎఅండ్సీఏవో బాలాజీ, సీఏవో రవిప్రసాద్, అన్నదానం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
గరుడ సేవరోజు నడక మార్గాలు తెరిచి ఉంచాలి
– బ్రహ్మోత్సవ భక్తులకు సురక్షిత రవాణా – టికెట్ల కోసం వేచి వుండకుండా చర్యలు – ఘాట్ రోడ్లలో క్రేన్లు, మెకానిక్‌లు అందుబాటులో ఉంచండి – ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అ«ధికారులకు ఈవో ఆదేశం తిరుపతి అర్బన్: తిరుమలలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరిగే రోజు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు, సురక్షిత ప్రయాణం, టికెట్ల కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఈవో ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణా ఏర్పాట్లు చేపట్టేందుకు రెండు విభాగాలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయాల్లో ఘాట్ రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు, టీటీడీ భద్రతా విభాగం, మెకానిక్ సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. ఐదు ప్రాంతాల్లో క్రేన్లు, సంక్లిష్ట ప్రాంతాల్లో అదనపు మెకానిక్‌లను సిద్ధంగా వుంచుకోవాలన్నారు. గరుడసేవ రోజు మరింత పటిష్ట ఏర్పాట్లు: బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన గరుడసేవ రోజు భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు, టీటీడీ భద్రతా విభాగం అ«ధికారులకు ఈవో సూచించారు. గరుడసేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా వుండనున్న నేపధ్యంలో అలిపిరి నడకమార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటలపాటు తెరచి వుంచాలని కోరారు. అందులో భాగంగానే అక్టోబర్ 16వతేదీ వరకు బ్రహ్మోత్సవాల రోజులతో పాటు శని, ఆదివారాల్లోను ఘాట్ రోడ్లను భక్తులకు సౌకర్యంగా తెరిచి వుంచాలన్నారు. తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు తిరుమలలోని పాపవినాశనంరోడ్, రింగ్‌రోడ్ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలన్నారు. అందుకోసం పోలీసులు, టీటీడీ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని యాత్రికులకు పార్కింగ్ కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు భక్తులు టికెట్లకోసం వేచివుండకుండా తగినంత కండక్టర్ సిబ్బంది అందుబాటులో వుంచుకోవాలన్నారు. ఆర్టీసి సిబ్బందికి ఎక్కడికక్కడ సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా వైర్లెస్ సెట్లు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని టీటీడీ అ«ధికారులను ఈవో ఆదేశించారు. శ్రీవారిమెట్టుకు ఉచిత బస్సులు : గరుడసేవ రోజు తిరుపతి, పరిసర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టుకు ఉచితంగా బస్సులు నడపనున్నట్టు ఈవో వెల్లడించారు. ఇందుకోసం 3 బస్సులను నిరంతరం తిప్పనున్నట్టు పేర్కొన్నారు. గరుడసేవ ముగిసిన తర్వాత కూడా భక్తులు శ్రీవారి మెట్టు నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకోనున్నట్టు తెలిపారు. ఉచిత బస్సులతో పాటు ఆర్టీసి బస్సులు యధాతథంగా నడుస్తాయని వివరించారు. రోజుకు 516 బస్సులు : బ్రహ్మోత్సవాల్లో రోజుకు 516 బస్సుల ద్వారా 2వేల ట్రిప్పులు తిప్పనున్నట్టు ఆర్టీసి ఆర్ఎం నాగశివుడు తెలిపారు. గరుడసేవ రోజు 540 బస్సులతో 3,500 ట్రిప్పులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈసమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆల్ ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.