బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం | Dharma Reddy Says All Set To Tirumala Brahmotsavalu | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం

Published Fri, Sep 27 2019 4:44 AM | Last Updated on Fri, Sep 27 2019 5:29 AM

Dharma Reddy Says All Set To Tirumala Brahmotsavalu - Sakshi

తిరుమల: ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుంచి అక్టోబర్‌ 8వతేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తెలిపారు. భక్తులంతా టీటీడీ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల భద్రత, సామాన్యులకు స్వామివారి దర్శనం అందేలా తీసుకున్న చర్యల గురించి ఆయన ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఇవీ...

రూ.7.53 కోట్లతో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను రూ.7.53 కోట్లతో నిర్వహిస్తున్నాం. తిరుమలలో ఇంజనీరింగ్‌ పనులతోపాటు పలు నిర్మాణాలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులపాటు ఘాట్‌ రోడ్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. గరుడ వాహనం ముందు రోజు నుంచి తిరుమల రెండు ఘాట్‌ రోడ్లల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తాం. గరుడ సేవ ముగిసిన అనంతరం అనుమతిస్తాం. నిరంతరం ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 406 బస్సులతో 1,669 ట్రిప్పులు తిప్పుతున్నాం. 90 వేల మంది తిరుమలకు చేరుకునేలా సదుపాయాలు కల్పించాం. బ్రహ్మోత్సవాల సమయంలో 2,200 ట్రిప్పులు నడిపి 2 లక్షల మందికి సరిపడేలా రవాణా సౌకర్యం కల్పిస్తాం.గరుడ వాహనం రోజు 3,176 ట్రిప్పులు నడపాలని ఆర్టీసీని కోరాం.

భక్తుల కోసం 7 లక్షల లడ్డూ ప్రసాదాలు
ఈసారి నాలుగు మాడ వీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులను అనుమతిస్తాం. చివరన ఉన్న భక్తులు సైతం ఉత్సవమూర్తులను సంతృప్తికరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉండవు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం ఉంటుంది. అక్టోబర్‌ 4న జరిగే గరుడ వాహన సేవ రోజు ప్రొటోకాల్‌ దర్శనాలు కూడా ఉండవు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి లడ్డూ అందించేలా ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నాం. 3 వేల మంది శ్రీవారి సేవకులు, 3,100 మంది పోలీసులు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తారు.

గ్యాలరీల్లో నిరంతరం అన్నప్రసాదం..
బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు, గ్యాలరీల్లో వేచిఉన్న వారందరికీ నిరంతరం నీటి సదుపాయంతో పాటు అన్నప్రసాదం వితరణకు ఏర్పాట్లు  చేశాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం. అన్నదాన వితరణ భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తాం. తిరుమల ప్రధాన కూడళ్లల్లో 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, మాడవీధుల్లో 12 అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మెరుగైన పారిశుధ్యం కోసం అదనంగా 800 మంది కార్మికులను నియమించాం.

30న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30వతేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించాం. తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకులాదేవి అతిథిగృహాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తారు. పీఎసీ–5కి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తాం. భక్తుల వసతి కోసం రూ.79 కోట్లతో దీన్ని నిర్మిస్తాం. 2,256 మంది భక్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగిస్తాం’ అని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement