తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం | Surrogate calf was born at SV Goshala in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం

Jun 26 2023 4:37 AM | Updated on Jun 26 2023 8:47 AM

Surrogate calf was born at SV Goshala in Tirupati - Sakshi

తిరుపతి రూరల్‌: దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహి­వాల్‌ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా టీటీడీ పరిధిలోని తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో మే­లు­జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్‌ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారని చెప్పారు. వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు తెలిపారు.

ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్‌ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసం దాతలు ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చా
రని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  

ఐదేళ్లలో 324 సాహివాల్‌ గోజాతి దూడల ఉత్పత్తి  
ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సరోగసి పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్‌ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్లోభాగంగా పిండమార్పిడి చేసిన ఆవుల్లో ఇప్పటివరకు 11 గర్భం దాల్చినట్లు చెప్పారు.

ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్‌ పెయ్యదూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో పది సాహివాల్‌ దూడలు జన్మించనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్‌ సభ్యులు రామ్‌సునీల్‌రెడ్డి, గో సంరక్షణశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్‌ వీరబ్రహ్మయ్య, వెంకట్‌నాయుడు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement