ఆబాల గోపాలం: సంగారెడ్డి సమీపంలో ఓ ప్రైవేటు ఫాంలో గిర్ జాతి గోకులం
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు.
కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది.
యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే!
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్‌పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి.
గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు
ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది.
తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు
‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది.
అంతటా చేపట్టాలి
వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన)
సేవ్ స్వదేశీ ఆవు
దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది)
Comments
Please login to add a commentAdd a comment