Allola DIVYA REDDY: గోమాత | Klimom Goshala Founder Allola DIVYA REDDY Exclusive Sakshi Interview | Sakshi
Sakshi News home page

Allola DIVYA REDDY: గోమాత

Published Fri, Aug 26 2022 12:18 AM | Last Updated on Fri, Aug 26 2022 12:18 AM

Klimom Goshala Founder Allola DIVYA REDDY Exclusive Sakshi Interview

ఈ ఏడాది మే నెలలో సుప్రీం కోర్టులో పిల్‌ వేసిన సందర్భంగా కోర్టు ఆవరణలో...

ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది.  పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి.

పెట్‌ రైట్స్‌ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు.

ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ ఇప్పుడు ఎకలాజికల్‌ ఇంజనీరింగ్‌ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె.

ఏటూ మిల్క్‌ మన ఆవులవే!
‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్‌ వర్క్స్‌లో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా రిటైర్‌ అయ్యారు. నేను ఇంజనీరింగ్‌ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్‌. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను.

మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్‌ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్‌ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్‌లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్‌ పెట్టారు.    

దేశ పర్యటన
మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్‌ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను.  

 సేంద్రియం మనకు కొత్త కాదు!
మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను.

రెడ్‌ సింధీ, సహీవాల్, గిర్‌ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్‌ నిలవలేదు, సొంత బ్రీడ్‌ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె.

ఆవు నన్ను ఎంచుకుంది!
అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను.
– అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్‌ గోశాల

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement