విద్యుత్‌దీప కాంతుల్లో తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల/సాక్షి, అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’ (మృత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో.. శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణ చేస్తారు.
రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.23 నుంచి 7 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈఓ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సర్వం సిద్ధంచేశారు. తిరుమల సీవీఎస్‌వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
రేపు తిరుమలకు సీఎం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనా వివరాలు ఇలా ఉన్నాయి..
- సెప్టెంబరు 30న మ.1.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మ.3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
- అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి అక్కడ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి వెళ్తారు.
- అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.
- ఆ తరువాత తిరుమల వెళ్లి, అక్కడ మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
- రాత్రి 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు.
- రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబర్ 1న ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment