Anilkumar singhal
-
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. చదవండి: మండేకాలం.. జాగ్రత్త సుమా..! -
మాస్క్ తప్పనిసరి నిబంధన పొడిగింపు
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి నిబంధనను ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రాత్రి కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలు జారీ చేశారు. నోరు, ముక్కు మూసి ఉండేలా మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లేని వారిని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోకి అనుమతించినట్లయితే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. కరోనా నిబంధనలు అతిక్రమించిన వ్యాపార, వాణిజ్య సంస్థలను ఒకటి, రెండు రోజులు మూసివేస్తామన్నారు. మార్గదర్శకాలు అమలయ్యేలా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. కరోనా మూడో దశ వ్యాప్తి కట్టడికి గత నెల 18 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగించారు. 14వ తేదీ వరకు రాత్రి 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకోవాలని సింఘాల్ ఆదేశించారు. (చదవండి: చిక్కీ, గుడ్ల సరఫరాపై టీడీపీ అవాకులు చెవాకులు) -
పిల్లలకు కోవిడ్ వస్తే ఆ మందులు వాడొద్దు.. మారిన మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు చికిత్సలో యాంటీవైరల్స్, మోనోక్లోనల్ యాంటీబాడిస్ వాడకూడదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా పిల్లల చికిత్స, కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాంతాల్లో పనిచేసే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం విడుదల చేశారు. మార్గదర్శకాలు ఇవే.. 5 ఏళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు లేకుండా ఉండేలా తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6–11 ఏళ్ల పిల్లలు మాస్క్ వినియోగించవచ్చు. 12 ఏళ్లు, ఆ పైబడిన పిల్లలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. 15–18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలి. ఆస్పత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలోనే పాజిటివ్ అయిన పిల్లల చికిత్సలో స్టిరాయిడ్లు వినియోగించాలి. 2, 3 రోజులు జ్వరంతో బాధపడుతుండటంతోపాటు ర్యాష్, కళ్లకలక, హైపర్ టెన్షన్, శరీరంపై దద్దుర్లు, దురదలు, డయేరియా లక్షణాలున్నా.. ఈఎస్సార్ 40, సీఆర్పీ 5 కన్నా ఎక్కువగా ఉన్నా మిస్–సీగా పరిగణించి చికిత్స అందించాలి. లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలున్న వారికి యాంటీబాడీలు వాడకూడదు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, న్యూమోనియాతో బాధపడేవారికి, సెప్టిక్ షాక్‌కు గురైనవారికి మాత్రమే చికిత్సలో యాంటీబయోటిక్స్ వాడాలి. 3–5 రోజుల్లో సిరాయిడ్స్ వాడకూడదు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి 5వ రోజు నుంచి స్టిరాయిడ్స్ వినియోగించాలి. పరిస్థితిని బట్టి 10–14 రోజుల వరకు డోసు తగ్గించుకుంటూ వెళ్లాలి. -
18 నుంచి రాత్రి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 18 నుంచి 31 వరకూ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, మీడియా, పెట్రోల్ బంకుల కార్యకలాపాలకు.. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ఇతర అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ, ఇతర నిబంధనలను అమలుచేయడంతోపాటు, పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఆ నిబంధనలు.. ► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. లేనిపక్షంలో రూ.100 జరిమానా. ► మాస్క్‌లేని వారిని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లోకి అనుమతిస్తే యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమాన. ► నిబంధనలు అతిక్రమించినట్లయితే స్థానిక పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రతను బట్టి ఒకట్రెండు రోజులు మూసివేత. ► పెళ్లిళ్లు, శుభకార్యాలు, సామాజిక కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌లో అయితే 100 మందికి మించకూడదు. వారందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం నిబంధన పాటించాలి. ► సినిమా హాళ్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సీటు విడిచి సీటులో ప్రేక్షకులు కూర్చోవాలి. ► ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలి. 8 దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులు మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి. ► ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2004, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆళ్ల నాని ఇక రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలును ఈనెల 18కు వాయిదా వేసిందన్నారు. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్దఎత్తున పల్లెలకు ప్రజలు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మార్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
15లోగా 100% మొదటి డోసు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనీల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు.. టీకా బృందాలు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలి. జిల్లా కలెక్టర్లు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలి. ఎవరైనా మాస్క్ ధరించకపోయినా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధించాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ► ఒమిక్రాన్ కేసులు నమోదైన యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయేల్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు, వీరి సన్నిహితులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకున్న గర్భిణికి శిశు సంరక్షణ కిట్ పేరిట 2016 నుంచి 2019 వరకూ రూ.695 విలువ చేసే కిట్ ఇచ్చేవారని, ఇప్పుడు గర్భిణికి ప్రసవం అనంతరం ఆసరా కింద భారీగా నగదు ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు, సిజేరియన్ అయితే రూ.3 వేలను 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆ మొత్తం నుంచే శిశువుల సంరక్షణకు కావాల్సినవి గర్భిణులే కొనుక్కుంటున్నారన్నారు. ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ శీర్షికన కిట్ల పంపిణీని నిలిపివేసినట్టు ఓ పత్రిక రాసిందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కేవలం శిశు సంరక్షణ కిట్ మాత్రమే ఇచ్చి.. ఎలాంటి నగదు ఇచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు గర్భిణికి రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ప్రసవం కాగానే ప్రతి ఒక్కరికీ నగదు జమ అవుతోందన్నారు. 46.79 శాతం మందికి రెండు డోసులూ పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 46.79 శాతం మందికి కోవిడ్ టీకా రెండు డోసులూ పూర్తయినట్టు సింఘాల్ చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన 3.47 కోట్ల మంది టీకాకు అర్హులని గతంలో తాము అంచనా వేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్లుగా సమాచారం పంపించిందన్నారు. దీన్ని బట్టి ఇప్పటివరకూ 46.79% మందికి రెండు డోసులు టీకా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో 1,84,90,379 మందికి రెండు డోసులు వేశామన్నారు. 1,32,65,148 మందికి తొలి డోసు పూర్తయిందని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం చాలా ముందుందని తెలిపారు. కరోనా కేసులు తగ్గినా 104 కాల్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని, ఎవరు ఫోన్ చేసినా సమాచారం వస్తుందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మొదలుకొని కొత్త మెడికల్ కాలేజీల వరకూ నిర్మాణం జరుగుతున్నాయని, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంచామని, గత 6 నెలల్లోనే రూ.1,013 కోట్లను ఆరోగ్యశ్రీ కింద వ్యయం చేశామన్నారు. -
ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరి
సాక్షి, అమరావతి: పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని, ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్ అయ్యేలోగా ఇవన్నీ పూర్తి కావాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 24 విభాగాల అధికారులు పాల్గొన్నారు. గర్భిణి ఆస్పత్రిలో చేరి ప్రసవం పూర్తయ్యాక మూడు రోజుల్లో శిశువుకు ఆధార్ ఎన్రోల్ చేయాలని, అప్పటికి వేలిముద్రలు, కంటిపాప ముద్రల్లో స్పష్టత ఉండదు కాబట్టి.. ఐదేళ్లు పూర్తయ్యేలోగా వారిని తిరిగి రప్పించి వేలిముద్రలు, ఐరిస్ తీసుకుని ఆధార్ ఎన్రోల్ చేయాలని ఆదేశించారు. శిశువుల జననాలతో పాటు, మరణాలనూ నమోదు చేయాలని, మృతికి గల కారణాలను పేర్కొనాలని సూచించారు. ఐదేళ్లు నిండేలోగా చిన్నారులకు శాశ్వత ఆధార్ కార్డు అందేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులు పుట్టగానే వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, డిశ్చార్జ్ అయ్యేలోగానే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రాలకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ సరఫరాదారు అలసత్వమే కారణం
సాక్షి, అమరావతి: శ్రీ భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అలసత్వం వల్లే.. సకాలంలో ఆక్సిజన్ అందక తిరుపతి ‘రుయా’ ఘటన జరిగిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. మరణాలకు కారణమైన సదరు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు బాధ్యులైన అధికారులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది. దీంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. -
మాస్కు లేకపోతే రూ.100 కట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను తిరిగి ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఏవైనా పబ్లిక్ ప్లేసుల్లో (మాల్స్‌లో గానీ, సినిమాహాళ్లలో గానీ) సీటు మార్చి సీటు నిర్వహణ చేసుకోవచ్చు. మనిషికి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం ఉండాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 7 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగతా 9 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈమేరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోవిడ్ పాజిటివీటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ రోజుకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతానికిపైగా ఉంది. దీంతో ఈ 5 జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆ జిల్లాలో కూడా సడలింపు సమయాన్ని పెంచారు. దీంతో మిగిలిన 4 జిల్లాల్లో మాత్రమే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిమితం చేశారు. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మిస్–సి
సాక్షి, అమరావతి: కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ వంటి రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కోవకే చెందిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్–సి (మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్) జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు మేలుచేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పీడియాట్రిక్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనల మేరకు పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిస్–సిలో నాలుగు రకాల జబ్బులుంటాయి. వీటన్నింటినీ ఇందులో చేర్చారు. కేటగిరీలు.. వాటి రేట్లు ఇలా.. ► మిస్–సి విత్ షాక్, లేదా విత్ఔట్ రెస్పిరేటరీ (సివియర్): రూ.77,533తో పాటు ఎన్ఐవీ/వెంటిలేటర్‌కు అదనంగా రూ.25వేలు. దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్ మందులకు అదనంగా ఉంటుంది. ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి విత్ఔట్ షాక్ (మోడరేట్) : దీనికి రూ.42,233లు (మందులతో కలిపి). ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి కవాసాకి లేదా సివియర్ : రూ.62,533లు (మందులతో కలిపి). దీనికీ ఐదు రోజులు ఐసీయూలోనూ మరో ఐదు రోజులు నాన్ క్రిటికల్ వార్డులో ఉండాలి. ► ఫిబ్రిల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (మైల్డ్) : దీనికి రూ.42,183గా నిర్ణయించారు. ఒకరోజు ఐసీయూలో, ఏడు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. మందులు, వెంటిలేటర్ కోసం.. పైన పేర్కొన్నవి కాకుండా అదనంగా ఐవీ–ఐజీ డ్రగ్స్ అవసరమైతే ప్రతీ ఐదు గ్రాముల వయెల్‌కు రూ.8వేలు, 10 గ్రాముల వయెల్‌కు రూ.13,500 చెల్లిస్తారు. ఇది చిన్నారి శరీర బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వయెల్ ఫొటోలు, బిల్లులు, బ్యాచ్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కేస్‌షీట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఎన్ఐవీ లేదా వెంటిలేటర్‌కు ఒక్కరోజుకు రూ.5వేల వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా గరిష్టంగా 5 రోజులకు రూ.25వేల వరకూ చెల్లిస్తారు. దీనికి కూడా వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినట్లు కేస్‌షీట్, ఫొటోలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా అదనంగా శస్త్రచికిత్సలు చేసినప్పుడు ప్రత్యేక ప్రీ ఆథరైజేషన్ (ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల పరిధిలోకి వచ్చేవి అయితే) చేసి పంపించాలి. ఉదా.. జనరల్ సర్జరీ, అపెండిసైటిస్, పీడియాట్రిక్ సర్జరీ వంటివి. మిస్–సి లక్షణాలు ఇవే.. ఇది కోవిడ్ సమయంలో వచ్చే వ్యాధి. ఇది 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ► 24 గంటలపాటు లేదా అంతకంటే ఎక్కువ సమయం బాగా జ్వరం రావడం ► చిన్నారుల్లో వాంతుల లక్షణాలు ఎక్కువగా ఉండటం. వాంతులతో పాటు కొంతమందిలో విరేచనాలు రావడం ► విపరీతమైన కడుపునొప్పి ► చర్మం మీద దద్దుర్లు వంటివి రావడంతో పాటు అలసట ఉండటం ► సాధారణంగా కంటే శ్వాస ఎక్కువగా తీసుకోవడం.. లేదా ఒక్కోసారి అందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ► కళ్లు ఎర్రగా మారి, తలనొప్పి ఉంటుంది ► పెదాలతో పాటు నాలుక కూడా ఎర్రగా మారి కొద్దిగా వాపు వస్తుంది. శరీరం, పెదాలు, గోళ్లు నీలిరంగులోకి మారొచ్చు. -
ఆక్సిజన్‌కు కొరత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని, కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందారంటూ.. తప్పుడు వార్తలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని చెప్పారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉందని వివరించారు. కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్లు మృతి చెందారంటూ వార్తలు వచ్చాయన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై కూడా అవాస్తవాలు ప్రచురించడం తగదని అనిల్ సింఘాల్ సూచించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామని సింఘాల్ చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయసు తల్లులు 18,75,866 మంది ఉండగా.. 12,99,500 మందికి టీకా మొదటి డోసు పూర్తయ్యిందని తెలిపారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి 53,14,740 డోసులు అందజేయనున్నట్లు కేంద్రం సమాచారమిచ్చిందని చెప్పారు. -
ఇ–సంజీవనిలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇ–సంజీవని కార్యక్రమం వరంలా ఉపయోగపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి తెస్తూ ఇ–సంజీవని ద్వారా ప్రయోజనం చేకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దేశంలో జూన్ 7వ తేదీ నాటికి 59.28 లక్షల మందికిపైగా ఇ–సంజీవని ద్వారా సేవలు పొందగా అందులో 11.84 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. ఇ–సంజీవని ఇలా రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో 13 టెలీమెడిసిన్ హబ్స్ ఏర్పాటు కాగా ప్రతి హబ్‌లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ అర్హత ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. హబ్‌ను పీహెచ్సీలో మానిటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోగిని నేరుగా హబ్‌నుంచి చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులను మెడికల్ ఆఫీసర్లు పరీక్షించి వారి పరిధిలో లేనివి, అంతుచిక్కని జబ్బుల బాధితులను అక్కడ నుంచే టెలీహబ్‌కు కనెక్ట్ చేస్తారు. ఇ–సంజీవని హబ్‌లో స్పెషలిస్టు డాక్టర్లు పేషెంటును పరిశీలించి మందులు సూచించడం లేదా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. మొత్తం 13 హబ్‌లలో 39 మంది స్పెషలిస్టు వైద్యులు, 26మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గ్రామీణులకు మెరుగైన సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషలిస్ట్ సేవలతో మేలు జరుగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్న మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లు ప్రత్యేక యాప్‌ద్వారా పీహెచ్‌సీకి కనెక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు పరీక్షించిన అనంతరం తన పరిధిలో లేని జబ్బుల బాధితులను బోధనాసుపత్రిలోని టెలీహబ్‌కు కనెక్ట్ చేసి చూపిస్తారు. దీనివల్ల పేదలు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండానే స్పెషలిస్టు సేవలు పొందగలుగుతున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో ఇలా 15 వేల మందికిపైగా సేవలు పొందుతున్నట్టు అంచనా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఇ–సంజీవని మెరుగ్గా అమలు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో 19.71 శాతం మంది ఏపీలోనే ఉండటం గమనార్హం. స్పెషలిస్టు సేవలు గ్రామాల్లోకే గతంలో స్పెషలిస్టు డాక్టరు సేవలు పొందాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెలీహబ్ ద్వారా ఆ భారం తప్పింది. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి -
కేసులు తగ్గుతున్నాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. 3,540 సచివాలయాల పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, గ్రామాల్లోనూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 30 నుంచి 40 కేసులున్న సచివాలయాలు 40 మాత్రమే ఉన్నాయని, 50కి పైన కేసులున్నవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, వాటిని నాలుగు చికిత్సలుగా విభజించి చేర్చామని చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో చిన్నారులకు పడకల పెంపు రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో చిన్నారులకు ఐసీయూ, ఆక్సిజన్ పడకలు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లోనూ వనరులను బట్టి బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16చోట్ల మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూములను గుర్తించామని చెప్పారు. ఈ ఆస్పత్రులు ఎలా ఉండాలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,17,97,000 డోసుల టీకా వేశామన్నారు. యాంపొటెరిసిన్ బి ఇంజెక్షన్లు 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయని, పొసకొనజోల్ ఇంజెక్షన్లు, మాత్రల నిల్వలు పెంచామని వివరించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.16 లక్షలకు పైగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేశామన్నారు. -
వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్, బ్లాక్‌ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానంతో కరోనాను కట్టడి చేస్తోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి తోడుగా వేలాది మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలకు భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత (రెగ్యులర్) ఉద్యోగులెవరైనా కోవిడ్‌తో మృతి చెందితే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారం.. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేదానికి అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటగిరీల వారీగా పరిహారం ► కోవిడ్‌తో డాక్టరు మృతి చెందితే రూ. 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు రూ. 20 లక్షలు, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ/ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ)కు రూ.15 లక్షలు, ఇతర సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ► ఈ సొమ్మును మృతి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులకు అందిస్తారు. ► కోవిడ్ నియంత్రణలో భాగంగా కోవిడ్ హాస్పిటల్, కోవిడ్ కేర్ సెంటర్, లేదా హౌస్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోతే ఈ పరిహారం చెల్లిస్తారు. ► ఉద్యోగికి సంబంధించిన గుర్తింపు కార్డును సంబంధిత అధికారి జారీ చేసి ఉండాలి. ► కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ విధిగా చూపించాలి. అలాగే ఆధార్ కార్డు, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. ఉద్యోగులకు భద్రత ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంతో ఉన్నారు. – డాక్టర్ జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
రాష్ట్రంలో చురుగ్గా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇప్పటికే 53.7 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. 45 ఏళ్లు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. జూన్ నెలాఖరుకు 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. సింఘాల్ ఇంకా ఏం చెప్పారంటే.. పాజిటివిటీ రేటు తగ్గుతోంది రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు జూన్ 10న 8. 29, జూన్ 11న 8.09గా నమోదైంది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్ 10న 67 మంది, 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో 15,951 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్‌లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఆక్సిజన్ వినియోగం తగ్గింది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 625 ఆస్పత్రుల్లో దానికి చికిత్స అందజేశాం. ప్రస్తుతం తీవ్రత తగ్గడంతో 454 ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 2,231 ఐసీయూ బెడ్లు, 11,290 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకున్నాం. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెట్టడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో 138 మంది మృతి చెందారు. ఈ కేసులను దాచిపెడుతున్నామనే ఆరోపణలు సరికాదు. కేసులు దాచిపెట్టడం వల్ల కేంద్రం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు రాకుండా పోతాయి. -
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు చిన్నపిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించాలని, ఈనెల 11 నుంచి సడలింపు సమయాన్ని 2 గంటలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేవారు పెరిగారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చికిత్స చేయించుకునేవారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 21, 130 మందిలో 17,944 మంది (84.92 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని చెప్పారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే చికిత్స పొందుతున్న 9,659 మందిలో 6,443 మంది (67 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు భారీగా తగ్గుతోందని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ చికిత్సకు 91 వేలకుపైగా యాంఫొటెరిసిన్ బి ఇంజక్షన్లకు ప్రభుత్వం ఆర్డర్లు పెడితే ఇప్పటివరకు కేంద్రం 13 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చిందన్నారు. పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్లను తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 57,07,706 మందికి వ్యాక్సిన్ తొలిడోసు వేశామని, 25,80,432 మందికి రెండుడోసులు వేశామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ వయసు వారిలో ఎంతశాతం కేసులు వచ్చాయి, రాష్ట్రంలో ఆ కేసుల శాతం ఎలా ఉంది అన్నదానిపై అంచనా వేసినట్లు ఆయన వివరించారు. -
ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే..
సాక్షి, అమరావతి: కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డా.ఎన్.భాస్కరరావు వైద్యానికి అయ్యే వ్యయం మొత్తాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసినట్టు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ భాస్కరరావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, ఆయన వైద్యానికి రూ.కోటి నుంచి కోటిన్నర వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని సింఘాల్ ప్రస్తావించారు. ఆయన శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రూ.70 వేలు పీజీ వైద్య విద్య పూర్తయి సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికి పెంచిన స్టైఫండ్‌ను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఇద్దామనుకున్నామని, కానీ సీఎం వైఎస్ జగన్.. 2020 సెపె్టంబర్ నుంచే అమలు చేయాలని చెప్పినట్టు అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు సెపె్టంబర్ నుంచే రూ.70 వేలు ఇస్తున్నామన్నారు. పీజీ పూర్తయినా పరీక్షలు జాప్యమై సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికీ రూ.70 వేలు ఇస్తున్నామని, జూలైలో పరీక్షలు జరుగుతాయని, ఆ సమయంలోనూ వారికి స్టైఫండ్ చెల్లిస్తున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులిస్తామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెలలో వ్యాక్సినేషన్ పూర్తి ఇప్పటివరకూ టీకా తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లను మినహాయిస్తే.. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి సింగిల్ డోసు పూర్తయిందని సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో 1,06,47,444 డోసుల టీకాలు వేయగా, రెండు డోసులు తీసుకున్న వారు 25,67,162, సింగిల్ డోసు తీసుకున్న వారు 55,13,120 మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొత్తానికి కలిపి 53.8 శాతం ఒక డోస్ పూర్తయిందని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,460 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చినా ముందస్తు అంచనాలు సిద్ధం చేశామన్నారు. టీకా వేసుకోని వారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నెల్లూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని వివరించారు. -
2 రోజులుగా కోవిడ్ కేసులు తగ్గాయి: ఏకే సింఘాల్
సాక్షి, విజయవాడ : గత రెండ్రోజులుగా కోవిడ్ కేసులు తగ్గాయని, 12,247 మంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 1460 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. డాక్టర్ భాస్కర్‌రావు వైద్యం కోసం కోటిన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఆయన ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు మొత్తాన్ని.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కోవిడ్ కష్టకాలంలో పనిచేస్తున్న వైద్యులకు అండగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారని, సీనియర్ రెసిడెంట్ వైద్యుల డిమాండ్లపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్ ఇప్పటికే రూ.45 వేల నుంచి 70 వేలకు పెంచామని తెలిపారు. 2020 సెప్టెంబర్ నుంచి పెంచిన స్టైఫండ్ అమలు చేస్తామని అన్నారు. మూడో దశ కోవిడ్‌పై టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. -
45 ఏళ్లలోపు ఉన్నా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్ల పైన వయసు ఉన్న వారికే టీకా వేస్తున్నామని, అయితే ఉద్యోగాలు లేదా చదువులకు విదేశాలకు వెళ్లే వారికి 45 ఏళ్లలోపు వయసు ఉన్నా టీకా వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ చెప్పారు. చాలా దేశాలు వ్యాక్సిన్ వేయించుకున్న వారినే అనుమతిస్తున్నాయని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ నంబర్ కూడా అడుగుతున్నాయని, ఇప్పటికే ఎవరైనా మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసుకు వెళితే పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చి వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇచ్చేలా కోవిన్ సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాశామని చెప్పారు. ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్ నంబరును విధిగా ఇవ్వాలన్నారు. సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్‌ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచామని, మిగతా సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. దీనిపై బుధవారం చీఫ్ సెక్రటరీ వద్ద చర్చలు జరిగాయని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా సమయంలో విధులు బహిష్కరించడం మంచిది కాదని చెప్పామన్నారు. జూన్ 1 నాటికి రాష్ట్రంలో 1,01,68,254 డోసుల టీకా వేశామన్నారు. 45 ఏళ్లు నిండినవారు 1,33,07,889 మంది రిజిష్టర్ చేసుకోగా 61,76,447 మందికి (46.41 శాతం) వేశామన్నారు. జూన్‌లో కేంద్రం నుంచి రావాల్సిన 8,76,870 డోసులు వస్తేనే వ్యాక్సిన్ వేయడానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. పడకల లభ్యత పెరిగిందని, ప్రతి జిల్లాలోను ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒకదశలో ఆక్సిజన్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, ఇప్పుడు 490 మెట్రిక్ టన్నులు తీసుకొస్తున్నామని చెప్పారు. -
సంప్రదాయ మందుగా వాడవచ్చు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు. కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్ కేసుల్లో 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు. 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 808 బ్లాక్‌ఫంగస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు వాడే యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు 3 వేలు పంపిణీ చేశామని, ఎప్పటికప్పుడు కేసుల పరిశీలన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఇంజక్షన్ల లభ్యతను బట్టి రాష్ట్రానికి తెప్పిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీతో పాటు సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని, ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని, వచ్చిన వెంటనే నిర్ణయం వెలువరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 5,640 ఇంజక్షన్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 41 వేలకు పైగా ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 75 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. గత 24 గంటల్లో 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకొచ్చామని, 650 మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ చేస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్టు తమకు సమాచారం లేదన్నారు. నేడు, రేపు కోవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నామన్నారు. 78 వేల కోవాగ్జిన్ డోసులు రావాల్సి ఉందన్నారు. 45 ఏళ్లు దాటి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టాకును జూన్ 15 వరకు మొదటి డోసుగా వేస్తామని, తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్టాకును బట్టి రెండో డోస్ వేస్తామన్నారు. -
అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్
సాక్షి, అమరావతి: కోవిడ్ సోకి తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన చిన్నారులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇలాంటివారిని గుర్తించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైనవారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు జమ చేసి బాండ్‌ను వారికి అప్పగిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. వారికి 25 ఏళ్ల వయసు నిండాక మాత్రమే ఈ డబ్బు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని నెలవారీగానీ, మూడు నెలలకు ఒకసారిగానీ తీసుకోవచ్చని తెలిపారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ వేశారు. జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీకి స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ పరిశీలించి కలెక్టర్‌కు పంపిస్తారు. ఎక్స్‌గ్రేషియాకు ఇవీ అర్హతలు ► దరఖాస్తు తేదీ నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి ► కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు ► తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ కారణంగా మరొకరు మృతిచెందిన వారి పిల్లలు ► కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి ► కోవిడ్ పాజిటివ్ రిపోర్టును విధిగా చూపించాలి ► ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధి పొందనివారు మాత్రమే అర్హులు. -
బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. కేంద్రం ఈ జబ్బు నియంత్రణకు 1,650 వయల్స్ (ఇంజక్షన్లు) కేటాయించిందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడు కంపెనీల (మైలాన్, భారత్ సీరం, సన్‌ఫార్మా) నుంచి 15 వేల ఇంజక్షన్లు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంజక్షన్లు రానున్నాయన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒక్కో పేషెంటుకు 60 ఇంజక్షన్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉండగా, కేంద్రం 625 టన్నులకు ఆమోదం తెలిపిందన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే ఆక్సిజన్ కోటా తగ్గనుందన్నారు. గతంలో ప్రొడక్షన్ కెపాసిటీ నుంచే కాకుండా స్టోరేజీ నుంచి కూడా కలిపి మొత్తం 170 మెట్రిక్ టన్నులు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోవడంతో ప్రొడక్షన్ కెపాసిటీ 130 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందువల్ల అంగూల్, రూర్కెలా ప్లాంట్ల కేటాయింపులు పెంచారన్నారు. ఈనెల 23వ తేదీలోగా మరో 4 క్రయోజనిక్ ట్యాంకర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని చెప్పారు. 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన వైద్యుల సంఖ్య 4,293కు పెరిగిందని, వీరిలో 188 మంది స్పెషలిస్టులున్నారని తెలిపారు. బుధవారం 12,679 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులతో వైద్యులు మాట్లాడారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేయడం వల్ల 104కు వచ్చే ఫోన్‌కాల్స్ తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్‌ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతిచెండటం వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి.. ఫీవర్ సర్వే, హోం ఐసొలేషన్ కిట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. -
ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్ఐ, ఫంగల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ (కిడ్నీ), షుగర్ టెస్ట్‌లు, హెచ్‌బీఏ1సీ, నాజల్ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్ (యాంపొటెరిసిన్ బి) లేదా ఓరల్ పొసకొనొజోల్ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొప్టొసిస్కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీకి రూ. 16,932, ఎక్స్ంటరేషన్ ఆఫ్ ఆర్బిట్ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్ (యాంఫొటెరిసిన్ బి), పొసకొనొజోల్ ఇంజక్షన్లకు ఎంఆర్పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు. -
జ్వర బాధితులు 90 వేలమంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన ఫీవర్ సర్వేలో 90 వేల మంది జ్వర బాధితులను గుర్తించామని, వాళ్లందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. వారిలో 50 వేల మంది నమూనాలు సేకరించి కరోనా టెస్టులకు పంపించామని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో సర్వే నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ/వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మన రాష్ట్రంలో ఉన్నంతగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏ రాష్ట్రంలో లేరని, అందుకే మూడు రోజుల్లోనే ఫీవర్ సర్వే పూర్తి చేయగలిగామన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి పాజిటివ్ కేసునూ లెక్క చెబుతున్నామని, డెత్ కేసులకు రూ. 15 వేలు ఇవ్వాలని జీవో ఇచ్చామని, ఈ ప్రభుత్వానికి దాయాల్సిన అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ జాప్యం జరిగి మృతి చెందిన కేసులను కూడా ధైర్యంగా చెప్పామని గుర్తు చేశారు. ఇంకా అవాస్తవాలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు. రెమ్‌డెసివిర్ కొరత లేదని, అవసరం ఉన్నవారికే ఇవ్వాలనేది ముందు నుంచీ చెబుతున్నామన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ప్రతిరోజూ వైద్యులతో ఫోన్ చేయించి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు. -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్‌తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
బ్లాక్‌ఫంగస్ కేసులపై పరిశీలన
సాక్షి, అమరావతి: కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్‌ఫంగస్‌పై పూర్తిస్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1,600 వయల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 18 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్‌నగర్, దుర్గాపూర్, జంషెడ్పూర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీకి చేరతామని చెప్పారు. 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్యులు సుమారు 15 వేలమందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని, వైద్యసాయం చేశారని తెలిపారు. -
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. అవసరం మేరకు వినియోగిద్దాం.. తాజాగా కేంద్రం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇచ్చిందని, ఒకటి ఇప్పటికే రాష్ట్రానికి చేరుకోగా మరో రెండు కోల్‌కతా నుంచి వస్తున్నాయని సింఘాల్ తెలిపారు. అక్కడి నుంచే ఒక్కో ట్యాంకర్లో 20 టన్నుల చొప్పున 40 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెలాఖరుకు 25 కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని, సరఫరాలో జాప్యం కాకుండా ప్లాంట్ల నుంచి నేరుగా ఆస్పత్రులకు కాకుండా ఒక సెంటర్లో ఆక్సిజన్ నింపి అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 14,338 సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లుగా మార్చాలని నిర్ణయించాం, ఇప్పటికే 6,917 సిలిండర్లను మార్చాం. మిగిలినవి కూడా త్వరగా పూర్తయితే ఆక్సిజన్ కొరత ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు ఒక్క రోజులో 30 శాతం ఆక్సిజన్ పొదుపు చేయగలిగారు. అవసరం మేరకు వినియోగిస్తే అన్ని ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సింఘాల్ తెలిపారు. 104కి ఒకే రోజు 17 వేల కాల్స్.. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని సింఘాల్ చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, కిట్లు, ఇతరత్రా విరాళాలు అందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి అర్జా శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్ట్రేటర్లు 8 వేలు, పది లీటర్ల కెపాసిటీ కలిగిన 10 వేల కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 104 కాల్‌సెంటర్‌కు బుధవారం ఒక్కరోజే 17 వేల కాల్స్ వచ్చాయని, హోం ఐసోలేషన్‌లో ఉన్న 9 వేల మందికి పైగా బాధితులను వైద్యులు ఫోన్లో పరామర్శించి తగిన సూచనలు అందించినట్లు వివరించారు. -
ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ట్యాంకర్ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
కోవిడ్ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు పెంపు
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీటీ స్కాన్‌లో కొరాడ్స్–4, సీటీ సివియారిటీ స్కోర్ 25 ఉండి, ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా పేషెంట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ సాయంతో ఉన్న రోగులకు రోజుకు రూ. 2,500 చెల్లిస్తామన్నారు. గతంలో నాన్‌క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ. 3,250, వెంటిలేటర్ లేని ఐసీయూకు రూ.5,480, ఐసీయూతో వెంటిలేటర్‌కు రూ.9,580, క్రిటికల్ పేషంట్లకు వెంటిలేటర్‌తో చికిత్సకు రూ. 10,380 ఇచ్చేవారు. -
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు: ఎ.కె.సింఘాల్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. రెమ్‌డెసివర్‌పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో 637 హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స అందిస్తున్నాం.13,461 ప్రవేట్ హాస్పిటల్స్‌లో రేమ్‌డేసివర్ అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు 16, 905 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 లక్షలు 8 వేల మంది కాల్స్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకున్నాం. కోవిన్ యాప్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం.. అంగీకరించింది. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ జీవో జారీ చేశాం. 15% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించాం. చాలా చోట్ల మొదటి వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనం ఎక్కువగా ఒకే చోట గుమికూడకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామ’’న్నారు. -
విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా విదేశాల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఏ దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ అందు బాటులో ఉన్నా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మని నేవీ అధికారులు చెప్పారన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ (తూర్పు నౌకాదళం) కోవిడ్ కష్టకాలంలో రాష్ట్రానికి అండగా నిలిచాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దడానికి నేవీ అధికారులు నాలుగు స్పెషలిస్టు బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు యాజమాన్యం వెయ్యి ఆక్సిజన్ పడకలు ఇస్తామని తెలిపిందని, అందులో ఇప్పటికే 50 అప్పగించా రని, మరో 150 పడకలు మే 15 నాటికి ఇస్తారని చెప్పారు. నేవీ అధికారులు సైతం 200 పడకలు ఇవ్వ డానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆ బెడ్లకు మెడికల్, పారామెడికల్ సిబ్బందిని విశాఖ జిల్లా కలెక్టర్ నియమిస్తారన్నారు. మరో 3 వారాల్లోగా రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై కేసులు ప్రతి జిల్లాలోనూ ఐదారు ఆస్పత్రులను క్లస్టర్‌గా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. నకిలీ రెమ్‌డెసివర్ కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా సెకండ్ డోస్ వారికే ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, వార్డు/గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారిని చైతన్య పరిచి టీకా వేశాం. ఇప్పుడు అందరూ ఒకేసారి టీకా కావాలని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ సెకండ్ డోస్‌కు సరి పోతుంది. దానివల్ల కొత్తవారికి ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పాం. వ్యాక్సిన్ కోసం కేంద్రం రూపొందించిన కోవిన్ అప్లికేషన్లో మార్పు చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా టీకా పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఇస్రో వద్ద 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్.. గడిచిన 24 గంటల్లో 491 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశాం. కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని, చెన్నై, బళ్లారి ప్లాంట్ల నుంచి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇక్కడ నుంచి అయితే రవాణా సమయం కలిసొస్తుందని కేంద్రానికి తెలియజేశాం. నెల్లూరులోని సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగశాలలో 90 నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉన్నట్టు సమాచారం ఉంది. వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు మేలు జరుగుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ల బాధ్యత నౌకాదళానికి.. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళానికి (ఈఎన్సీ) అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సరఫరా బాధ్యతను ఈఎన్సీ తీసుకోనుంది. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్, తూర్పు నౌకాదళాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు శనివారం భేటీ అయ్యారు. ముందుగా స్టీల్‌ప్లాంట్‌లోని ఆక్సిజన్ యూనిట్లను పరిశీలించారు. అనంతరం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్‌తో భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్ యూనిట్స్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ముఖ్యంశాలివీ.. ► ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఈఎన్సీ నిర్వహించనుంది. ► ఆక్సిజన్ ప్లాంట్లలో లీకేజీ సమస్యల పరిష్కారం, ప్లాంట్ల పర్యవేక్షణ, అక్కడ తీసుకోవాలి్సన బాధ్యతల్ని నౌకాదళం నిర్వర్తించనుంది. ► ఇందుకోసం తూర్పు నౌకాదళం నాలుగు బృందాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో బృందం 3 నుంచి 4 జిల్లాల్ని పర్యవేక్షిస్తుంది. ► అత్యవసరమైతే ఈ బృందాల సహకారంతో యుద్ధ విమానాలు, నేవల్ హెలికాప్టర్లను కూడా ఆక్సిజన్ సరఫరాకు వినియోగించనున్నారు. ► సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా మొదలైన దేశాల నుంచి వస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే బాధ్యత తీసుకునేందుకు ఈఎన్సీ అంగీకరించింది. ► లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లతో పాటు డీ–టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కోవిడ్ సంబంధిత వైద్య పరికరాలు, మందులు సరఫరా చేసేందుకు నౌకాదళ వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స కోసం 10 ఆక్సిజన్ బెడ్స్‌తో పాటు 60 సాధారణ పడకలు ఏర్పాటు చేసేందుకు తూర్పు నౌకాదళాధికారులు అంగీకరించారు. ► విశాఖలోని కంచరపాలెం సమీపంలో ఉన్న నేవీ షెడ్లో 150 పడకల తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ స్పష్టం చేసింది. ► కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా 200 డీ–టైప్ ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్‌తో 50 పడకలు.. ► కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు స్టీల్‌ప్లాంట్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ► స్టీల్‌ప్లాంట్‌లోని గురజాడ కళాక్షేత్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు అంగీకరించారు. ► మే 15 నాటికి అదనంగా 150 పడకలు, 30 నాటికి 250, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. -
వ్యాక్సినేషన్లో అందరికీ ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. వారంలో నాలుగు రోజుల్లో 25 లక్షలు టీకాలు వేసేలా నెలకు కోటి టీకాలు కావాలని లేఖలో కోరారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 6.29 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రం సామర్థ్యాన్ని ప్రధానికి వివరించామన్నారు. అవసరం మేర కు రాష్ట్రానికి వ్యాక్సిన్ రావడం లేదని తెలి పారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్ప త్రుల్లో చికిత్స పొందే కరోనా బాధితులకు వైద్యం ఉచితమని, వీరి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ చికిత్స, ఆక్సిజన్ సరఫరా, తదితర అంశాలపై శుక్రవారం మంగళగిరిలో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. సెకండ్ డోస్‌గా వేస్తాం.. ఇప్పటివరకు కేంద్రం నుంచి 73,49,960 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వాటిలో 53,58, 712 టీకాలు వేశాం. వీటిలో 17,96,691 మం దికి రెండు డోసులు ఇచ్చాం. మొత్తంగా 71, 55,403 డోసులు వేశాం. శుక్రవారం ఉదయానికి ఇంకా దాదాపు 2 లక్షలు మిగిలి ఉన్నాయి. 45 ఏళ్లకు పైబడి ఉన్నవారికి వేయడానికి కేంద్రం మే 1 నుంచి 15లోగా 9 లక్షల డోసు లు కేటాయించింది. వీటిలో 6,90,000 కోవి షీల్డ్ డోసులు పూర్తిగా వచ్చాయి. ఇంకా 1,08, 000 డోసులు ఈ నెల 15లోగా రావాల్సి ఉంది. ఈ డోసులతోపాటు రాష్ట్రంలో మిగిలి ఉన్న దాదాపు 2 లక్షలతో కలిపి ప్రస్తుతం 3 లక్షలకు పైబడి డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల రెండో పక్షానికి కూడా కేంద్రం వ్యాక్సిన్లు అందిస్తుంది. ఈ డోసులు మే 15 తర్వాత వస్తాయి. 35 లక్షల మందికిపైగా సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెలా ఖరుకు 23,89,000 మందికి సెకండ్ డోస్ గడువు ముగుస్తుంది. వీరిలో 12,93,000 మం దికి మే 15లోగా సెకండ్ డోస్ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే 4,63,000 మందికి వ్యాక్సిన్ వేసేశాం. ఇంకా 8,23,000 మందికిపైగా వేయాలి. కేంద్రం నుంచి వచ్చే డోసులు సెకండ్ డోసుకు సరిపోతాయి కాబట్టి కొత్తవారికి ఫస్ట్ డోస్ ఇచ్చే అవకాశం లేదు. శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు రాష్ట్రంలో 49 ఆస్పత్రుల్లో రూ.309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ల (పీఎస్ఏ) ఏర్పాటుకు పరిపాలన ఆమోదం తెలిపాం. పీఎస్ఏ ప్లాంట్లను ఆయా ఆస్పత్రుల్లో ఉన్న బెడ్ల సామర్థ్యాన్ని బట్టి నిర్మించనున్నాం. మూడు నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. రూ.180 కోట్లతో ప్లాంట్లు, సివిల్ వర్కులకు రూ.25 కోట్లు, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్లైన్ల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తాం. 50 క్రయోజెనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించగా 25 ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. వీటికి రూ.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంతో ఇక రవాణా, స్టోరేజ్ ఇబ్బందులు ఉండవు. పోస్టుభర్తీలో కోవిడ్ హెల్త్ వర్కర్లకు వెయిటేజ్ కోవిడ్ సేవల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కరోనా వ్యాప్తి కాలంలో పనిచేసిన హెల్త్ వర్కర్లకు 15 శాతం మేర వెయిటేజ్ ఇవ్వాలని మెమో జారీ చేశాం. ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న హెల్త్ వర్కర్లకు కూడా వెయిటేజ్ ఇస్తాం. ఈ జీవో, విధివిధానాలను శనివారం ప్రకటిస్తాం. కోవిడ్ కేర్ సెంటర్లలో 14,654 మంది.. కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 14,654 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదు. గత 24 గంటల్లో 13,150 ఇంజక్షన్లు అందజేశాం. ప్రభుత్వాస్పత్రుల్లో 22,105 అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్ సెంటర్‌కు 17,062 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 9,210 కాల్స్ వివిధ రకాల సమాచారం, 3,004 కాల్స్ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, 1,706 కాల్స్ పరీక్షల ఫలితాల కోసం చేశారు. ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం 9,91,000 కోవిషీల్డ్, 3,43,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు చెల్లించింది. ఇప్పటికే కేటాయించిన కోవిషీల్డ్ డోసులతోపాటు మరో మూడున్నర లక్షల డోసులు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిని మే మూడో వారంలో అందిస్తామని సీరం యాజమాన్యం ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. ఈ అదనపు డోసులకు కూడా చెల్లింపులు చేయడానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 3,43,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్లలో 1,43,000 డోసులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లను 45 ఏళ్లకు పైబడినవారికే వేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాం. ఇదే విషయమై మరోసారి కేంద్రాన్ని కోరతాం. -
కరోనా రోగులకు మరింత అందుబాటులోకి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందించడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ► కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో పూర్తిగా 100 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద కేటాయించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. పరిస్థితులు, అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు మరికొన్నిటిని కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించాలి. ► కోవిడ్ చికిత్స కోసం ప్రకటించిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా కనీసం 50 శాతం బెడ్లను కేటాయించాలి. 50 శాతం కోటా పూర్తయినప్పటికీ, సంబంధిత ఆస్పత్రిలో ఇతర బెడ్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఇవ్వాలి. ► అలాగే తాత్కాలికంగా కోవిడ్ చికిత్స కోసం మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ హాస్పిటల్స్‌గా జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. వీటిలో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. వీటి చికిత్సా వ్యయాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ భరిస్తుంది. ► తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ ఆస్పత్రులుగా గుర్తించిన వాటి వివరాలను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి అందించాలి. ► ప్రతి సమయంలోనూ 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఖాళీగా ఉంచాలని చెప్పి నాన్ ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ల చికిత్సను తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరీక్షల ఆధారంగా బెడ్ కేటాయించవచ్చు. ► సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించాలి. ► ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులను పాజిటివ్ టెస్టు లేదంటూ తిరస్కరించకూడదు. ► ఆస్పత్రిలో చేరిక అనేది పూర్తిగా అవసరాన్ని బట్టి లేదా డాక్టర్ లేదా రోగుల పరీక్షల నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది. ► వివిధ కారణాలను చూపుతూ ఒక్క రోగి కూడా చికిత్స లేదా కావాల్సిన ఔషధాలకు దూరం కాకుండా చూడాలి. చదవండి: కరోనా కన్నా వారికి భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు -
కోవిడ్ కట్టడికి ప్రజా ప్రతినిధులతో సమీక్ష కమిటీలు
సాక్షి, అమరావతి: జిల్లా స్థాయిలో కోవిడ్–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రుల అధ్యక్షతన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి నివారణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన మంత్రుల బృందం సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన నిర్ణయాలను సకాలంలో తీసుకోవడంతో పాటు అధికారులకుతగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేయనున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రుల అధ్యక్షతన గల కమిటీల్లో సభ్యులుగా జడ్పీ చైర్పర్సన్, జిల్లాకు చెందిన మంత్రులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు ఉంటారు. సభ్య కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్ ఉంటారు. -
ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్(నెట్వర్క్) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్ బాధితులకు ఇవ్వాలని సింఘాల్ పేర్కొన్నారు. 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్మెంట్ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తాం. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నాం. ఈ వివరాలన్నీ 104 కాల్‌సెంటర్ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలి. ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. ఆక్సిజన్‌కు ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్ పీఏఎస్‌లు ఏర్పాటవుతాయి. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశాం. ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరోవైపు థర్డ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సమస్యలు లేకుండా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 104కు ఒక్కరోజే 17,649 కాల్స్ గురువారం ఒక్కరోజే 104 కాల్‌సెంటర్‌కు 17,649 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకూ 3,365 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 608 మంది స్పెషలిస్టులున్నారు. ఆస్పత్రి దగ్గరే కోవిడ్ కేర్ సెంటర్ ఆస్పత్రుల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో వీలును బట్టి 100 నుంచి 200 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి. కోవిడ్ కేర్లా ఉపయోగపడుతుంది, ఆస్పత్రిలాగా కూడా ఉంటుంది. వీలైనంత త్వరలో వీటిని ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కోరాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.100 కోట్లు ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం మరో రూ.45 కోట్లు విడుదల చేసింది. చదవండి: ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! -
గడువులోగా టీకా రెండో డోసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఈనెల 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం 9 లక్షల డోసులు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల డోసులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇందులో 19 లక్షల డోసులను సెకండ్ డోసు వారికే వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా కోవిడ్ మార్గదర్శకాలు (144 సెక్షన్), ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో బ్యాంకులు పనిచేస్తాయన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరత రాబోతోందన్న సమాచారం రాగానే అక్కడి కలెక్టర్.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను తెప్పించి ఆస్పత్రులకు సకాలంలో అందజేసినట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 104 కాల్ సెంటర్లో ప్రస్తుతం 3,220 మంది డాక్టర్లు కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సేవలందిస్తున్నారని చెప్పారు. రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పంపిస్తోందని, దీని పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అంతకుముందు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తాము చర్చించిన అంశాలను నివేదించనుంది. -
కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులో 7 ట్రైబల్ పీహెచ్‌సీలు కూడా ఉన్నాయన్నారు. ఒకే పీహెచ్సీ ఉన్న మండలంలో రెండోది కూడా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీల భవన నిర్మాణాలకు రూ.346 కోట్లు, సిబ్బంది వేతనాలకు ఏటా రూ.165 కోట్లు రికరింగ్ వ్యయమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు పెంచామని, డిశ్చార్జిల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 6,319 ఐసీయూ పడకలుండగా.. 5,743 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. చాలా జిల్లాల్లో ఐసీయూ పడకలు ఖాళీగా లేవన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 ఇంజక్షన్లు ఉన్నాయని, మరో 12 వేలు మంగళవారం వచ్చాయని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఒకే రోజు 14,030 ఇంజక్షన్లు ఇచ్చామన్నారు. గత 24 గంటల్లో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని తెలిపారు. మరో 3 ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి అదనపు సరఫరాకు ఉపయోగిస్తామన్నారు. కాగా, 104 కాల్ సెంటర్‌కు ఒకేరోజు 16,856 కాల్స్ వచ్చాయన్నారు. రెండో డోస్ వారికే ప్రాధాన్యత రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా రెండో డోసు తీసుకునేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ నెల 15లోగా కేంద్రం నుంచి 9 లక్షల డోసుల టీకా వస్తుందని.. ముందుగా రెండో డోసు తీసుకునేవారికి జాప్యం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రజా సంబంధాల్లో (ఆర్టీసీ, బ్యాంకు, మీడియా ఉద్యోగులు) ఉన్నవారికి రెండో ప్రాధాన్యతగా టీకా వేస్తామన్నారు. వీరిలోనూ 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే.. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. వీటన్నింటికీ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరికి కూడా మినహాయింపు ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు. ► వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. ► వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు ► ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి ► రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి. ► అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. ► పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ► కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త స్ట్రెయిన్ వల్లే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ సింఘాల్ ఇంకేమన్నారంటే.. 24 గంటల్లో 1,15,275 పరీక్షలు.. రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 447 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను వినియోగించాం. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆక్సిజన్ స్టోరేజ్, రవాణాకు కావాల్సిన క్రయోజనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించాం. అన్ని బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తాం. అత్యవసర సర్వీసులకు మినహాయింపు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు ఉండవు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడకుండా ఉదయం వేళల్లో144 సెక్షన్ అమలు చేస్తాం. నిత్యావసరాలు, ఇతర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులుంటాయి. మీడియా, ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు. 45 ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత టీకా పంపిణీలో 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. -
అనుమతి లేకుండా కరోనా చికిత్స చేస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనుమతి లేకుండా కరోనా వైద్యసేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్ చెప్పారు. ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అనుమతి లేకుండా వైద్యం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై నిఘా పెంచామని చెప్పారు. అలా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ మొదలు మందుల వరకు కొనుగోలుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 558 ఆస్పత్రుల్లో 55,719 పడకలను అందుబాటులో ఉంచామన్నారు. గుంటూరులో 869, కృష్ణాలో 684 ఐసీయూ బెడ్లు ఉన్నాయని, చాలా జిల్లాల్లో బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 27,576 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 18,299 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పారు. 81 కోవిడ్ కేర్ సెంటర్లలో 10,100 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 27,615 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు చెప్పారు. 104 కాల్‌సెంటర్‌కు రోజురోజుకు కాల్స్ సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కువ మంది కోవిడ్ టెస్టులకు, కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, పడకల కోసం ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది 18 వేలమంది వైద్య సిబ్బందిని నియమించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16,019 మందిని నియమించినట్లు చెప్పారు మరో మూడువేల పోస్టులను భర్తీచేస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ఎక్కడా పడకల కొరత లేదని, రెమ్‌డెసివిర్ తగినన్ని ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ ప్రభుత్వం సరఫరా చేయడం కష్టతరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
కోవిడ్ చికిత్సకు 551 ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 551 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో మొత్తం 43,498 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ బెడ్లలో శనివారం వరకు 32,301 బెడ్లు నిండాయని.. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్పత్రులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించామన్నారు. కరోనా పరీక్షలు, అంబులెన్సు సౌకర్యం, ఆస్పత్రుల్లో పడకలు, వైద్య సేవలు, సందేహాలు, ఫిర్యాదులు ఇలా కరోనాకు సంబంధించిన సమస్త సమాచారం కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బాధితులు ఫోన్ చేసిన మూడు గంటల్లోనే అధికారులు ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో సేవలు అవసరం లేదన్నారు. ఇంటిలో లేదా కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు పొందొచ్చన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిశ్చార్జి పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా కోలుకున్నవారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసి, వారి స్థానంలో వేరొకరికి అవకాశమిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చని.. లేకుంటే ఇంటికి వెళ్లొచ్చన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ ఇంకేమన్నారంటే.. పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు రాష్ట్రమంతా మంగళవారం నుంచి కరోనా పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లోనే ఫలితాలు ఇస్తున్నారు. సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. రోజు రోజుకూ కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 8,709 మంది ఉన్నారు. రాబోయే రెండు మూడ్రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరుకోవచ్చు. వీటిలో కరోనా టెస్టులు చేయడంతోపాటు అక్కడే ఫలితాలు కూడా ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఆపలేదు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న శాంపిళ్ల ఫలితాలను రెండ్రోజుల్లో ఇవ్వాలని ఆదేశించాం. అంబులెన్సుల కొరత ఉన్నచోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. రోగులకు ఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌కు 2,668 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 88,898 మంది ఉన్నారు. వీరందరికీ వైద్యులు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతోపాటు సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరోవైపు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన మేర రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 5,371 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించగా.. ఇంకా 27,615 ఇంకా అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజే 13,898 మంది ఫోన్ 104 కాల్ సెంటర్‌కు శనివారం ఒక్కరోజే 13,898 మంది ఫోన్ చేశారు. వారిలో 3,356 మంది పరీక్షల కోసం, 3,359 మంది వివిధ అంశాలపై సమాచారానికి, 304 మంది ఆస్పత్రుల్లో అడ్మిషన్ కోసం, 2,678 మంది పరీక్షల ఫలితాల కోసం ఫోన్ చేశారు. గత రెండు రోజుల కంటే శనివారం ఆక్సిజన్‌ను ఎక్కువగా సరఫరా చేశాం. గత 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అందించాం. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. విజయవాడ నుంచి ఒడిశాలోని అంగుల్ ఆక్సిజన్ ప్లాంట్‌కు 2 ఖాళీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేశాం. 2 ట్యాంకర్ల ద్వారా 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి వస్తుంది. సోమవారం మళ్లీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో 64 ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. ఐయూసీఎల్ కంపెనీ కేటాయించిన రెండు సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు రావాల్సి ఉంది. వాటి వల్ల 20 నుంచి 25 టన్నుల సామర్థ్యం పెరిగే అవకాశముంది. వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే.. జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలను కూడా అదే రీతిలో చేపట్టాం. గత ఏడాది కాలంలో 9 వేల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, బాధితుల సమాచారం సేకరించడానికి ఆరోగ్యమిత్రలను, సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను వాడుకుంటున్నాం. -
108, 104 Ambulance: ఊపిరి పోస్తున్నాయ్
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ అంబులెన్సులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న ఈ తరుణంలో బాధితులకు ఈ కుయ్..కుయ్ శబ్దం కొండంత భరోసానిస్తోంది. కాల్ అందుకున్న నిమిషాల్లో 108, లేదా 104 అంబులెన్స్ ప్రత్యక్షమౌతోంది. పైసా ఖర్చులేకుండా క్షణాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది ఒకేసారి 1,088 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ప్రతిమండలంలోనూ 108 అంబులెన్సులు, 104 వాహనాలు అందుబాటులో ఉండడంతో మండలంలోని ఊళ్లన్నిటికీ ఉపయోగంగా ఉంది. ఉచితంగా లభిస్తున్న ఈ 104, 108 అంబులెన్సు సర్వీసు కోవిడ్ రోగులకు పెద్ద ఊరటనిస్తోంది. గతంలో నిర్వహణా ఖర్చులు ఇవ్వక, రిపేర్లు జరక్క, డీజిల్‌కు దిక్కులేక, డ్రైవర్లకు జీతాల్లేక పూర్తిగా మూలన పడ్డ అంబులెన్స్ వ్యవస్థను జగన్ రాగానే సమూలంగా ప్రక్షాళన చేశారు. సమస్యలన్నీ తీర్చడంతో పాటు డ్రైవర్లకు జీతాలూ పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇపుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులే అపర సంజీవనిలా మారాయి. కరోనా రోగులను వేగంగా తరలిస్తూ సకాలంలో వైద్యం అందడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 86,754 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారంటే అంబులెన్సులెంతగా ఉపయోగపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మారుమూల పల్లెలకు వెళ్లి రోగులకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందించేందుకు 104 వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ఇదీ లెక్క.. ► మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌ల్లో 15,242 మంది కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించారు. అలాగే, 71,512 మంది సాధారణ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. అంటే మొత్తం 86,754 మంది రోగులను తరలించారన్నమాట. కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌లు 124 ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 6,640 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రులకు తరలించారు. ► ఈ అంబులెన్స్‌లు బిజీగా వున్న పరిస్థితుల్లో నాన్ కోవిడ్ పేషంట్లకు వినియోగించే 108 అంబులెన్స్‌లను కూడా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా 8,602 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. కరోనా తొలివేవ్లోనే అంబులెన్సుల కొనుగోలు 2020 మార్చి 10వ తేదీన తొలికరోనా కేసు నమోదైంది. అప్పటికి రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జులైలో కొత్తగా 108 అంబులెన్సులు 412 , 104 వాహనాలు 656 కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు 748 వున్నాయి. ఇందులో 731 వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నాయి. హైకోర్టు, సచివాలయం, గవర్నర్ (వీఐపీ లొకేషన్స్)బంగళా వద్ద మొత్తం మూడు ఉన్నాయి. మరో 14 వాహనాలు బ్యాకప్..అంటే ఏవైనా మరమ్మతులకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. గతేడాది ఈ వాహనాలు కొనుగోలు చేయకపోయినా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. ఇపుడు చాలా సమస్య ఎదుర్కోవలసి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన అంబులెన్సులను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో హైపోక్లోరైట్ సొల్యూషన్‌తో శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ధ్రువీకరించిన తరువాతే వాటిని మళ్లీ సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు. అలాగే పేషెంట్‌కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్‌తో శుభ్రపరుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీ మెడికల్ టీంలకు, అంబులెన్స్ పైలెట్‌కు అవసరమైన శిక్షణ ఇచ్చారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్‌ల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్, డెఫ్రిబులేటర్లు అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. 104తో ఇంటి ముంగిటకే వైద్యం గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గత నెల (ఏప్రిల్) 1 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో 104 వాహనాల ద్వారా 6,64,108 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. వీరిలో 6,30,513 మందికి అవసరమైన మందులు పంపిణీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆ గ్రామంలోనే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అలాగే మంచానికే పరిమితమైన 77,396 మంది పేషంట్లకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి చికిత్స అందించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ పేషెంట్లకు ఇంటివద్దకే వెళ్లి మందులు ఇస్తున్నారు అవసరమైతే మరిన్ని కోవిడ్‌కు కోవిడ్ పేషెంట్ల రవాణా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. అవసరమైతే మరిన్ని పెంచుకోవాలని చెప్పాం. ఇవికూడా సరిపోకపోతే ప్రైవేటు అంబులెన్సులనైనా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. దేశంలోనే అంబులెన్సుల నిర్వహణలో మనం ముందంజలో ఉన్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజుల నిర్ధారణ
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించి ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్), నాన్ ఎన్‌ఏబీహెచ్‌లుగా విభజించి రేట్లు నిర్ణయించింది. రోగికి సంబంధించి అన్నీ కలిపే పై ధరలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కన్సల్టేషన్, నర్సింగ్ చార్జీలు, రూమ్ అద్దె, భోజనం, కోవిడ్ టెస్టింగ్, రక్తపరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ పరీక్షలు, పీపీఈ కిట్లు, మందులు, యూరినరీ ట్రాక్ట్ కేథటరైజేషన్ వంటివన్నీ ఇందులోనే ఉంటాయన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్ రోగిని అడ్మిట్ చేసుకోవాల్సిందేనన్నారు. అడ్మిషన్ సమయంలో ముందస్తు సొమ్ము (అడ్వాన్స్)కు డిమాండ్ చేయకూడదన్నారు. సీటీ స్కాన్‌కు రూ.3 వేలు అలాగే సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. తక్షణమే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
స్వల్ప లక్షణాలుంటే కోవిడ్ కేర్ సెంటర్లకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్లు ఆస్పత్రులకు అవసరం లేదని, వారు కోవిడ్ కేర్ సెంటర్లలో చేరితో ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. దీనివల్ల సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 60 కోవిడ్ కేర్‌సెంటర్లలో మెరుగైన వసతులతో 33,427 పడకలున్నాయని, స్పల్ప లక్షణాలున్న బాధితులను ఇక్కడకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. కోవిడ్ సోకి, లక్షణాలు లేని వాళ్లను హోం ఐసొలేషన్‌లోనే ఉంచి, ఏఎన్ఎంలు వారిని నిత్యం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. రెమ్డెసివిర్ల లెక్క తేలుస్తాం రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు 3 రోజుల్లో 30 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని, ఇందులో ప్రభుత్వం కొన్ని ఇవ్వగా, వాళ్లే కొన్ని కొనుక్కున్నారని సింఘాల్ తెలిపారు. వీటి వినియోగంపై ఆరా తీస్తున్నామని, రెండ్రోజుల్లో పూర్తి లెక్కలు బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28 వేలకు పైగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరిపడా∙నిల్వలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది పీక్ దశలోనే 260 మెట్రిక్ టన్నులకు మించి వాడలేదని, ఇప్పుడు వృథా అవుతోందని, దీన్ని అరికట్టాలని అధికారులకు సూచించామన్నారు. గుంటూరు, అనంతపురం, వైఎస్సార్, కృష్ణా జిల్లాల్లో మూత పడిన ఆక్సిజన్ యూనిట్లను పునరుద్ధరించి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరో ఐదు యూనిట్లలో తయారవుతున్న గ్యాస్‌ను లిక్విడ్ ఆక్సిజన్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. 104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేస్తోందని, కోవిడ్‌కు సంబంధించి అన్ని వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచామని వివరించారు. సెకండ్ వేవ్ కరోనా తగ్గే వరకూ వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. -
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 50 మందికే అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితంచేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ క్లబ్బులు, స్పాలను మూసివేస్తున్నామని తెలిపారు. సినిమా హాళ్లు, బస్సులను 50 శాతం సీట్లతోనే నడపాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఐదు అడుగుల భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింఘాల్ ఏమన్నారంటే.. పేషెంట్ల సంఖ్య కంటే ఇంజక్షన్ల వినియోగం ఎక్కువగా ఉంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య కంటే ఒక రోజులో వినియోగించిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 11,453 డోసులు వాడారు. అన్ని పడకలే లేనప్పుడు ఇన్ని ఇంజక్షన్లు ఎలా వాడారనే దానిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నాం. ఏ రోజు ఎంత స్టాకు వచ్చింది.. ఎన్ని వేశారు.. ఎవరికి వేశారు వంటి వివరాలు సేకరిస్తున్నాం. దుర్వినియోగమైనట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులకు వచ్చిన రోగులను బయట రెమ్‌డెసివిర్ తెచ్చుకోండి అంటున్నారు. ఇది సరికాదు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు ఇండెంట్ ఇస్తే పరిశీలించి మేమే ఇంజక్షన్లు తెప్పిస్తాం. ఇకపై ప్రతి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వినియోగాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాం. కోవిడ్ అనుమతి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలోనూ హెల్ప్‌లైన్ నంబర్ పెడతాం. రెండు రోజుల్లో రెమ్‌డెసివిర్ కొరత అనే మాట లేకుండా చేస్తాం. ఆక్సిజన్ దుర్వినియోగం మా దృష్టికి వచ్చింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ చాలా ముఖ్యం. ఎవరికంటే వారికి ఆక్సిజన్ పెడుతున్నారు. విజయనగరంలో 96 శాతం ఆక్సిజన్ శాచురేషన్ ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్ పెట్టారు. రాత్రిపూట కొన్నిచోట్ల ఆక్సిజన్ పెట్టి వదిలేస్తున్నారు. ఇలాంటివి ఇక జరగవు. దీనికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ పెడతాం. దుర్వినియోగానికి అవకాశం లేకుండా చేస్తాం. ప్రస్తుతం 341 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. గతేడాది ఇంతకంటే ఎక్కువ మంది ఇన్‌పేషెంట్లు ఉన్నప్పుడు 261 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వినియోగమైంది. ప్రస్తుతం దుర్వినియోగమైందా, బయట అమ్ముకుంటున్నారా అనేదానిపై నిఘా పెట్టాం. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ అందక ఎవరూ మృతి చెందలేదు. ఆస్పత్రుల నిర్వహణ బాధ్యత జేసీలకు.. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ విధులు చూస్తున్న జాయింట్ కలెక్టర్లకు పూర్తిగా ఆస్పత్రుల నిర్వహణ అప్పజెప్పాం. కోవిడ్ విధులు మాత్రమే వాళ్లు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రుల నిర్వహణ, వసతులు, సీసీ టీవీలు, 104 కాల్‌సెంటర్, రోగి బంధువులకు సమాచారం అందుతోందా లేదా వంటివన్నీ ఇక జేసీలే చూస్తారు. 376 ఆస్పత్రులు అందుబాటులోకి.. ఈ నెల 26 నాటికి 376 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 4,395 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తే 2,022 పడకలు మాత్రమే నిండాయి. 16,352 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి తేగా ఇందులో 7,943 మాత్రమే నిండాయి. రెమ్‌డెసివిర్ అవసరం ఉన్నవారికి మాత్రమే వేయాలని చెప్పాం. అవసరం ఉంటేనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని, మిగతా వారిని కోవిడ్‌కేర్ సెంటర్లకు పంపించాలని సూచించాం. 104 కాల్‌సెంటర్ నిర్వహణపై గంట గంటకూ పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా జిల్లాలో ఐదారు ఆస్పత్రులను ఒక క్లస్టర్‌గా చేసి, ఒక ప్రత్యేక అధికారిని పెడుతున్నాం. దీంతోపాటు ముగ్గురు అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించి జిల్లాలో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ పనిచేస్తుంది. -
అందుబాటులో అరలక్ష బెడ్స్
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది. ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో కలిపి 50,751 పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 24,548 పడకలు, కోవిడ్ కేర్ సెంటర్లలో 26,203 పడకలు ఉన్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా అవసరమైన మేరకు పడకల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం నవంబర్ తర్వాత కేసులు తగ్గడంతో కోవిడ్ ఆస్పత్రులను నాన్ కోవిడ్ ఆస్పత్రులుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో మళ్లీ ఒక్కసారిగా కేసులు విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. శుక్రవారం నాటికి 218 ఆస్పత్రులను సిద్ధంగా ఉంచింది. ఈ ఆసుపత్రుల్లో 24,548 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బాధితులకు కోవిడ్ వైద్యం అందించాల్సి ఉంటుంది. సిద్ధంగా 3,462 ఐసీయూ పడకలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండేవారి చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,462 ఐసీయూ పడకలు సిద్ధం చేశారు. కేసులు ఎక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలో 430 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. అవసరమైతే మరిన్ని పడకలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితులకు క్రిటికల్ కేర్ చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్యులందరూ సిద్ధంగా ఉండాలని, వారికి అండగా నిలవాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో 26,203 పడకలు హోం ఐసొలేషన్‌లో ఉండటానికి అవకాశం లేక.. స్వల్ప లక్షణాలు లేదా ఓ మోస్తరు లక్షణాలతో ఉన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తారు. ఇలాంటి వారి కోసం తాజాగా 26,203 పడకలు రెడీ చేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5వేల పడకలు కోవిడ్ కేర్ సెంటర్లలో సిద్ధంగా ఉంచారు. ఈనెల 24 ఉదయం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 3,083 మంది పేషెంట్లు ఉన్నారు. ఇంకా 23,120 పడకలు మిగిలి ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 43 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా పెంచుతామని, ఈ సెంటర్లలో మరిన్ని పడకలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల సంఖ్యను బట్టి మరిన్ని ఆస్పత్రులు అన్ని జిల్లాల్లో అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని కలెక్టర్లను ఆదేశించాం. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని కోవిడ్ కేర్ సెంటర్లను పెంచుతాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 104కు కాల్ చేసి వైద్య సేవలు పొందే అవకాశం కల్పించాం. అక్కడ వైద్యులు 3 షిఫ్ట్‌లూ పనిచేస్తున్నారు. –అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
కోవిడ్ కేర్ సెంటర్లన్నీ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ సీఎం ఆదేశాల మేరకు తక్షణమే చర్యలు చేపట్టి ఏ ఒక్క పేషెంట్కూ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. పడకలు, ఆక్సిజన్, ఇంజక్షన్లు, కోవిడ్ చికిత్సకు అనుమతి ఉన్న ఆస్పత్రులకు ఇబ్బంది లేదని, త్వరలో మరిన్ని పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతులన్నీ సిద్ధం.. రాష్ట్రంలో కోవిడ్‌కేర్ సెంటర్లన్నీ పునరుద్ధరిస్తున్నాం. 2020 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లన్నీ (అప్పుడు 115 సెంటర్లు, 49,180 బెడ్లు ఉన్నాయి) శుక్రవారం సాయంత్రం నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. వాటిని పునరుద్ధరించాలని ఇప్పటికే కలెక్టర్లకు సూచించాం. గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ సిద్ధం చేస్తున్నాం. ఆక్సిజన్ కొరత లేదు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు బాగున్నాయి. ఒడిశా నుంచి మరో 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఏపీకి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాం. నేటి సాయంత్రం (గురువారం) కల్లా రెండో డోస్ తీసుకోవాల్సిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. దీనికోసం ఏర్పాట్ల్రు పూర్తి చేశాం. 6 లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది రెండో డోసు ఇవ్వాల్సిన వారందరికీ సరిపోతుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్లు రావాలి.. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు రాగానే మే 1వతేదీ నుంచి టీకాలు ఇస్తాం. దీనిపై కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తగినన్ని వ్యాక్సిన్లు రావాల్సి ఉంది. అనుమతి లేని ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్ ఇవ్వలేం రాష్ట్రంలో ప్రస్తుతం 140కిపైగా అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం. అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఇంజక్షన్లు లేవనడం సరికాదు. ఏప్రిల్ 1 నుంచి 20వతేదీ వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు 67 వేలకు పైగా ఇంజక్షన్లు ఇచ్చాం. వీటిపై ఆయా ఆస్పత్రులు లెక్కలు చెప్పాలి. సోమవారం నుంచి రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ప్రభుత్వాసుపత్రులకు వస్తాయి. ప్రైవేట్‌కు 7,000 ఇంజక్షన్లు ఇస్తాం. 300 మంది డాక్టర్లు.. 120 లైన్లతో 104 కాల్‌సెంటర్ కాల్‌సెంటర్‌కు ఎలాంటి కోవిడ్ సమస్యతో ఫోన్ చేసినా వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారు. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేశాం. కన్సల్టెంట్లుగా 300 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. మూడు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటుంది. తాజాగా మరో 60 లైన్లను అదనంగా చేర్చాం. గతంలో 60 లైన్లే ఉండేవి. అవసరమైతే మరికొంతమంది డాక్టర్లను కూడా నియమిస్తాం. -
వైద్యుల వేతనాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల సుమారు 4 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుంది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతన సవరణ ఇచ్చారు. ఆ తర్వాత 2016లో తిరిగి వేతనాలు సవరించాల్సి ఉండగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రభుత్వం చుట్టూ వైద్యులు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.. ప్రభుత్వ వైద్యులు తమ వేతనాల గురించి విన్నవించారు. ఇంతలోనే 2020 ఫిబ్రవరి నుంచి కోవిడ్–19 కారణంగా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా వైద్యులకు న్యాయబద్ధంగా అందాల్సిన వేతన ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వారికి 2021 మార్చి 1 నుంచి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తండ్రి వైఎస్ వేతనాలు పెంచగా, ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్ తండ్రి బాటలోనే నిర్ణయం తీసుకున్నారని వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన వేతనాలు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 2 డెంటల్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వరకూ 4 వేల మంది పని చేస్తున్నారు. వీరందరికీ వేతన సవరణ వల్ల భారీగా వేతనాలు పెరగనున్నాయి. 7వ సెంట్రల్ పే కమిషన్ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అకడమిక్ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఉదాహరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.68,900 బేసిక్‌గా నిర్ణయించారు. అలవెన్సులు అంటే టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలిపితే రూ.లక్ష వరకూ లభిస్తుంది.అన్ని పోస్టుల విషయంలోనూ ఇదేవిధంగా ఉంటుంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులకు పీఆర్సీ ఇచ్చారు. 16 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేతనాలు పెంచారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి పనిచేస్తాం. – డా.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
పేదల ఆస్పత్రులకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల వైద్యానికి మంచి రోజులు మొదలయ్యాయి. అన్ని జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను పకడ్బందీగా తీర్చిదిద్దడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ. 1,223 కోట్ల అంచనా వ్యయంతో కొన్ని చోట్ల కొత్త భవనాలు నిర్మిస్తుండగా, మరికొన్ని చోట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఔట్‌పేషంటు సేవలు, ఇన్‌పేషంటు సేవలు అందిస్తున్నది వైద్య విధాన పరిషత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్), ఏరియా ఆస్పత్రులే. ఇక్కడ ఏడాదికి సగటున 2.30 కోట్ల మంది వైద్యం అందుకుంటున్నారు. అందుకే అలాంటి ఆస్పత్రులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు నాడు నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. మొత్తం 165 పనులను 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పిల్లర్ల దశలో ఉండగా, కొన్నిచోట్ల మొదటి అంతస్తు స్లాబ్‌లు వేశారు. నెల్లూరు, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో పనుల వేగం మరింతగా పెరిగింది. ఈ పనులకు సంబంధించి నాబార్డ్ రుణ సాయం అందిస్తోంది. నిర్మాణాలు చేయడమే కాదు రెండు మూడు దశల్లో నాణ్యతా ప్రమాణాలు చూస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం పనిచేస్తోంది. నిర్ణీత సమయంలోనే పూర్తి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిర్ణీత సమయానికే పూర్తవుతాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే పేదలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రులు ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించడం సామాన్య విషయం కాదు. కొత్త భవనాలకు తగ్గట్టుగా వైద్యులను నియమించాం. నియోజకవర్గ స్థాయిలోనే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిధిలో వైద్యసేవలు అందుతాయి. – డా.యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్ -
మరో 683 చికిత్సలకు ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకున్న అనంతరం కోలుకునే సమయంలో ఇచ్చే ‘ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్య భారీగా పెంచారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో 836 చికిత్సలకు వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకునే సమయంలో రోజుకు రూ. 225 చొప్పున, గరిష్టంగా నెలకు రూ. 5 వేలు ఇచ్చారు. ఇప్పుడు మరో 683 చికిత్సలను ఇందులో చేర్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 1,519కి చేరింది. ఈ మొత్తం చికిత్సల్లో దేనికైనా సరే వైద్యం పొంది ఇంటివద్ద కోలుకుంటూంటే వెంటనే బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. డాక్టరు నిర్ణయించిన మేరకు విశ్రాంతి రోజులకు లెక్కకట్టి ఆసరా సొమ్ము ఇస్తారు. తాజాగా ఇచ్చిన జాబితాలో గైనకాలజీ, పల్మనరీ, డయాబెటిక్ ఫుట్, డెంగీ జ్వరం వంటివి ఉన్నాయి. రోగులు తమ ఆధార్‌ను బ్యాంకుకు లింకు చేసి ఉంటే వెంటనే నిధులు జమచేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఆరోగ్య శ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలను తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఏపీ.. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ(కోవిడ్ సోకి కోలుకున్నాక వచ్చే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించి ప్రయివేట్ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించామన్నారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు. ధరలు ఇలా ఉన్నాయి ► ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స అందిస్తూ.. ఐసొలేషన్ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900 ► కన్సల్టేషన్ చార్జీల కింద రూ.400 ► మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700 ► ఆక్సిజన్, నెబులైజేషన్ చార్జీలు రూ.500 ► పోషకాహారానికి రూ.200 ► వైరస్ సోకకుండా డిస్ ఇన్ఫెక్షన్ చేసేందుకు రూ.230 ► రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు. -
సూర్య, చంద్రప్రభలపై సప్తగిరీశుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు శంఖు, చక్రం, గద, అభయహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి సూర్యుడు ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు అనుగ్రహించారు. వాహనసేవల్లో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ నిశ్చిత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, డీపీ అనంత, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 26 ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం హైదరాబాద్‌కు చెందిన దండు అనిల్‌కుమార్ రూ.10 లక్షలు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు విరాళంగా అందించారు. -
19 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల: ‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆడిట్ చేసేవారు. ఇకపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిటింగ్ చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది’ అని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఈనెల 19 నుంచి 27 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాలు.. ► పారదర్శకత పెంచడంలో భాగంగా ఆగస్టులో బోర్డు సమావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాం. ► పెరటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో రోజుకు 3 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను 30 వరకు తాత్కాలికంగా నిలిపివేశాం. ఆన్లైన్ కోటా పెంచి రోజుకు 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్నాం. నిధుల కోసమే టీటీడీ ఇలా చేస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ► ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే వారు టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు. ► కరోనా వల్ల శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేయడంతో.. ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం. దళారుల మాటలకు మోసపోవద్దు: టీటీడీ తిరుమలలో ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు భక్తులను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ నిఘా, భద్రతా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి ఆర్జిత సేవా టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొంది. తిరుమలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ లో మాత్రమే పొందే అవకాశముందని స్పష్టం చేసింది. ఆర్జిత సేవల పునరుద్ధరణ తర్వాత ఆన్లైన్లో సేవా టికెట్లు లభించని భక్తులకు తిరుమలలో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందవచ్చని పేర్కొంది. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. -
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అక్టోబర్‌లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, మేడా మల్లికార్జునరెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, గోవిందహరి, దామోదర్‌రావు, వెంకటప్రసాద్‌కుమార్, డీపీ అనంత, కృష్ణమూర్తి వైద్యనాథన్, పార్థసారథి, మురళీకృష్ణ, రమణమూర్తి రాజు, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు పి.బసంత్‌కుమార్, సదా భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► శనివారం నుంచి తిరుపతిలో 3 వేల ఉచిత శ్రీవారి దర్శన టోకెన్లు ► శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, స్థానిక భక్తులను భాగస్వామ్యం చేస్తూ దాతల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించాం. ► టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకపై నగదు, బంగారం డిపాజిట్లలోంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా నిర్ణయం. ► బర్డ్ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ.5.4 కోట్లతో బర్డ్ పరిపాలన భవనం మూడో అంతస్తులో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదం. ► విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ రహదారి వాలు గోడల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ఆమోదం. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సీఎం చేతుల మీదుగా ఈ ఆలయానికి మహా కుంభాభిషేకం. ► కరోనా కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం. ► తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇందుకోసం టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి రూ.కోటి విరాళం ప్రకటించారు. ► ఇదిలా ఉండగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చరిత్రలో తొలిసారి పాలకమండలి సమావేశాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
ఆస్తుల విక్రయ ఆలోచన విరమించుకున్నాం
సాక్షి, అమరావతి: టీటీడీకి చెందిన నిరర్థక, నిరుపయోగ ఆస్తులను విక్రయించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వ సూచనతో విరమించుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు నివేదించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆస్తులను విక్రయించకూడదని తీర్మానం చేశామని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. 1974 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఆస్తులతో పాటు, టీటీడీకి చెందిన అన్ని ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించాలని కూడా టీటీడీ తీర్మానించిందన్నారు. టీటీడీ ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలు సత్యదూరమని తెలిపారు. పిటిషనర్ ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. టీటీడీకి తమిళనాడులో ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీజేపీ నేత అమర్నాథ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో టీటీడీ ఈవో సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు. ► వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించిన ఆస్తులు ఏ రకంగానూ పనికి వచ్చేవి కావని, గతంలోనూ ఇలాంటి ఆస్తులను విక్రయించారని కౌంటర్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తుల విక్రయ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు. ► ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇస్తూ ధర్మాసనం తదుపరి విచారణను 24కి వాయిదా వేసింది. -
ఆదాయం కోసమే దర్శనాలన్నది అవాస్తవం
తిరుమల: టీటీడీ ఆదాయం కోసమే శ్రీవారి దర్శనాలు చేయిస్తోందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. తిరుపతిలో పాక్షిక లాక్డౌన్ కారణంగా స్థానికంగా రోజుకు కేటాయిస్తున్న మూడు వేల ఉచిత దర్శన టోకెన్లను కొంతకాలంగా నిలిపేసినట్టు చెప్పారు. తిరుపతిలో కరోనా కేసులు పెరగడానికి దర్శనాలే కారణమన్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఆదివారం ఆయన యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇప్పటికే 402 మంది కోలుకున్నారు. 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారు. ► పద్మావతి అమ్మవారి దర్శనానికి రాలేని భక్తులు ఈ–హుండీ ద్వారా ఆన్లైన్లో కానుకలు సమర్పించే సదుపాయం కల్పించాం. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారాగానీ, గోవింద మొబైల్ యాప్ ద్వారాగానీ భక్తులు కానుకలు చెల్లించొచ్చు. ► శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ను యాడ్ ఫ్రీ చానెల్‌గా మారుస్తాం. ► ఎస్వీబీసీ ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి ఎస్వీబీసీ హెచ్డీ చానల్‌ను ప్రారంభించాలని నిర్ణయించాం. ► త్వరలోనే హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తాం. -
నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 2.5 లక్షలు
తిరుమల: లాక్డౌన్ సడలించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభమైన జూన్ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 4 శ్రీవారి దర్శనం కోసం జూన్ 11 నుంచి జూలై 10 మధ్య ఆన్లైన్Œ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకోగా 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకోగా అందులో 85,434 మంది దర్శనానికి వచ్చారు. 4 నెల రోజుల్లో హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు లభించింది. 13.36 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 4 మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4 జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. టీటీడీ ఉద్యోగుల్లో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. -
నెలాఖరు వరకు దర్శన టికెట్ల పెంపు లేదు
తిరుమలు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని ఆయన చెబుతూ.. ఇంతవరకు స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్ రాలేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలసి వైవీ మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఆదాయ, వ్యయాలు చూసే ఆలోచనే లేదు.. ► టీటీడీ ఆర్థిక వనరులు పెంచుకోవడానికే రోజువారీగా భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతూ పోతోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. ఆదాయ, వ్యయాలు చూసే ఆలోచనే ధర్మకర్తల మండలికి లేదు. ► ఎక్కువమంది స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందితే కరోనా త్వరగా దూరమవుతుందనే ఉద్దేశంతోనే దర్శనం టికెట్లను పెంచాం. ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సేవలు.. ► ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా టీటీడీలో 17 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరుంటున్న నివాస ప్రాంతాల్లోని పరిస్థితుల వల్లే కరోనా వచ్చిందని నిర్ధారణైంది. వీరందరినీ క్వారంటై¯Œన్కు పంపి అత్యుత్తమ వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ► తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం వారానికోసారి షిఫ్ట్ అమలు చేస్తున్నాం. వారి ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా ఇకపై షిఫ్ట్ విధులను రెండు వారాలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. క్షురకులకు సౌకర్యవంతంగా ఉండే గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు అందిస్తాం. ► భక్తుల నుంచి వస్తున్న విన్నపాల మేరకు కల్యాణోత్సవ సేవను ఆన్లైన్ ద్వారా నిర్వహించే విషయంపై అర్చకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. తపాలా శాఖ ద్వారా భక్తులకు ప్రసాదాలు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించాం. ► తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ తిరుమల తరహాలో అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు దర్శనం కల్పిస్తాం. శ్రావణంలో కర్ణాటక సత్రాల సముదాయాలకు శంకుస్థాపన ► తిరుమలలోని కర్ణాటక సత్రాల ప్రాంతంలో టీటీడీ లీజుకిచ్చిన 7.05 ఎకరాల భూమిలో యాత్రికుల వసతి సముదాయం, కల్యాణ మండపం నిర్మాణానికి శ్రావణమాసంలో శంకుస్థాపన చేస్తాం. 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణాల వ్యవహారంపై శుక్రవారం కర్ణాటక సీఎం యడియూరప్పతో జరిగిన సమావేశంలో అవగాహనకు వచ్చాం. కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే, టీటీడీ నిబంధనల మేరకు టెండర్లు పిలిచి ఈ నిర్మాణాలు పూర్తి చేసేలా ఒప్పందం కుదిరింది. ► ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, శేఖర్‌రెడ్డి, కె.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో నేరుగా దర్శనానికి..
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం ఈవో, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 1, 2 లలో వేచి ఉండకుండా టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు. భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల, తిరుపతిలలో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు అందుబాటులోనికి తెస్తామ న్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం సేవలు రద్దు. - ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించవలసిన శ్రీ సీతా రాముల కల్యాణాన్ని ఆలయం వెలుపల రద్దు చేసి గతంలో వలే ఆలయం లోపల నిర్వహణ. - ఏప్రిల్ 5వ తేదీన ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ రద్దు. - ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి స్వామివారి ఆశీస్సుల కోసం శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం మార్చి 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వ హిస్తాం. విశాఖ శ్రీ శారదా పీఠా ధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివార్ల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. - అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్. - భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రతి 2 గంటలకోసారి పరిశుభ్రత చర్యలు. - యాత్రికులు 0877–2263447 నంబ రుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి నివా రణ చర్యలను తెలుసుకోవచ్చు. - యాత్రికులకు కోవిడ్ లక్షణాలను గుర్తిస్తే నేరుగా రుయాలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతాం. -
వెబ్సైట్లో ధార్మికాంశాల వీడియోలు
తిరుపతి సెంట్రల్: పిల్లలకు సనాతన ధర్మంపై మక్కువ పెంచేందుకు ముఖ్యమైన ధార్మికాంశాలను వీడియోలుగా రూపొందించి టీటీడీ వెబ్సైట్లో ఉంచాలి అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. వాటిని ఎస్వీబీసీ చానల్లోనూ ప్రసారం చేయాలని ఆయన సూచించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలపై తిరుపతి పరిపాలన భవనంలో సోమవారం అధికారులతో ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మంలోని ప్రాథమికాంశాలతో నెల వ్యవధితో కూడిన కోర్సును రూపొందించాలని ఆదేశించారు. వేదాలు, పురాణాలు, ఆలయాల వైశిష్ట్యం, హైందవ ధర్మ పరిరక్షణకు పలువురు మహానుభావులు చేసిన కృషిని కోర్సుల్లో పొందుపరచాల్సిందిగా సూచించారు. మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు మూడు దశల్లో అర్చక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వైజాగ్, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి తిరుపతికి రానవసరం లేకుండా ఆయా ప్రాంతాలకు సమీపంలోనే అర్చక శిక్షణ ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని ఈవో తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతికి సంబంధించి చిత్రాలతో కూడిన కథలను ముద్రిస్తే ఎక్కువ మందికి చేరుతాయన్నారు. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమయ్యపై ప్రతి నెలా ఒకటి చొప్పున వరుస కథనాలను ప్రచురించాలని సూచించారు. వచ్చే అన్నమయ్య జయంతి నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. దాససాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ముద్రించే పుస్తకాలను ఇంగ్లిష్‌లోనూ తర్జుమా చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్,ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌లపై సమీక్ష టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి, ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌ల కార్యకలాపాలపైనా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య చికిత్సల వివరాలను ఆరా తీశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సమావేశాల్లో టీటీడీ జేఈవో బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జీ రామచంద్రా రెడ్డి, ఎఫ్ఏసీఏవో బాలాజీ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సీఎంవో డాక్టర్ నాగేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ పాల్గొన్నారు. -
తిరుమల జలాశయాల్లో భక్తులకు సరిపడా నీరు
తిరుమల : తిరుమల జలాశయాల్లో భక్తులకు 544 రోజులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. కుమారధార, పసుపుధార జలాశయాల్లో శుక్రవారం టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో (చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్) గోపినాథ్ జెట్టితో కలిసి ఈవో గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నట్టు తెలిపారు. పాపనాశనం జలాశయ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 3,730 లక్షల గ్యాలన్లు, గోగర్భం జలాశయ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 1,848 లక్షల గ్యాలన్లు, తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 31.12 శాతం నీరు నిల్వ ఉందని వివరించారు. వీటితోపాటు బాలాజీ రిజర్వాయర్ నీటిని వినియోగించుకోవాలని టీటీడీ బోర్డు తీర్మానించిందన్నారు. టీటీడీలో ఉద్యోగాలకు డిసెంబర్లో నోటిఫికేషన్ శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, మార్చి నెల కోటాలో మొత్తం 52,748 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసినట్లు తిరుమలలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ పైస్థాయి ఉద్యోగాలకు డిసెంబర్లో నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి 75శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. గరుడ వారధికి సంబంధించి రీటెండరింగ్‌కు వెళ్లాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌ను కోరినట్టు ఈవో వివరించారు. -
మత కలహాలు సృష్టించేందుకు కుట్ర
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తొత్తుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని వేలెత్తి చూపడానికి ఏ కారణాలు లేకపోవడంతో కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేతిలో పత్రిక ఉందని తప్పుడు వార్తలను ప్రచురిస్తే ఉపేక్షించేది లేదని ఆంధ్రజ్యోతిని హెచ్చరించారు. టీటీడీపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ వెబ్సైట్లో ‘యేసయ్య‘ అనే పదమే లేదని స్పష్టం చేశారు. టీటీడీ క్యాలెండర్లో గానీ, వెబ్సైట్లో గానీ ఆ పదం ఉంటే చూపాలని సవాల్ విసిరారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరతాం ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కొండ మీద శిలువ ఉందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేసిందన్నారు. విచారణలోదీని వెనుక ఉంది టీడీపీ సానుభూతిపరులేనని వెల్లడైందని గుర్తు చేశారు. బస్సు టిక్కెట్లపై కూడా ఇలాగే అసత్య ప్రచారం చేసిందని.. దీనిపై విచారణ చేయిస్తే అవి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించినవేనని తేలిందన్నారు. ఆన్లైన్ వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. టీటీడీ పంచాంగం మొదటి పేజీలో తెలుగులో ‘శ్రియై నమః’ అనే పదం కనిపిస్తుందని, ఇది గూగుల్ అనువాదంలో ‘శ్రీ యేసయ్య‘గా మార్పు చెంది ఉండవచ్చన్నారు. ఇది గూగుల్ తప్పే కానీ టీటీడీ పంచాంగంలో దొర్లిన తప్పు కాదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామని తెలిపారు. ఇప్పుడు ఆ పదం కనిపించడంలేదన్నారు. గూగుల్ తప్పులకు టీటీడీ ఎలా బాధ్యత వహిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి పాల్గొన్నారు. -
తిరుమలలో సీజేఐ
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలో జస్టిస్ బాబ్డేకు పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం సీజేఐ సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన వరాహస్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని మరోమారు దర్శించుకోనున్నారు. శనివారం దర్శనానంతరం మరమ్మతులు జరుగుతున్న కోనేరును జస్టిస్ బాబ్డే పరిశీలించారు. సీజేఐతో పాటు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఉన్నారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల/సాక్షి, అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’ (మృత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో.. శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.23 నుంచి 7 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈఓ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సర్వం సిద్ధంచేశారు. తిరుమల సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు తిరుమలకు సీఎం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30న తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనా వివరాలు ఇలా ఉన్నాయి.. - సెప్టెంబరు 30న మ.1.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మ.3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. - అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి అక్కడ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి వెళ్తారు. - అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. - ఆ తరువాత తిరుమల వెళ్లి, అక్కడ మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. - రాత్రి 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. - రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబర్ 1న ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుపతి తుడా: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల,్డ కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగళూరులోని టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) గుర్తింపునిచ్చింది. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, ఐఎస్ఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు గుర్తింపునిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం జేఈవో మాట్లాడుతూ ఐఎస్ఓ ప్రతినిధులు పలుమార్లు టీటీడీ వసతి సముదాయాలు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలను పరిశీలించారన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి గుర్తింపు దక్కిందని వివరించారు. ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేసిన పలు విభాగాల అధికారులు, సిబ్బందికి ఐఎస్ఓ ప్రతినిధి కార్తికేయన్ ప్రశంసాపత్రాలు అందించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఈలు రమేష్‌రెడ్డి, రాములు, వేంకటేశ్వర్లు, డీఈవో రామచంద్ర, డెప్యూటీ ఈవోలు రామ్మూర్తిరెడ్డి, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా వెంకన్న చక్రస్నానం
తిరుమల: తిరుమలలో ఈ నెల 10 నుంచి 18 వరకు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీవారి చక్రస్నానంతో గురువారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల నడుమ చక్రస్నానం వేడుకగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో చివరిదైన చక్రస్నానం యజ్ఞా ంతంలో ఆచరించే అవభృతస్నానమే. అవభృత స్నానంలో చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిం చారు. ఇందులో ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. ఈ అభిషేక ౖðం కర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడయ్యాడు. అంతకుముందు తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. అదే రోజు రాత్రి 7.00 నుంచి 9 గంటల మధ్య బం గారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. కార్యక్ర మాల్లో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్, టీటీడీ ఈవో సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి ఈవో భాస్కర్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. శ్రీవారి సేవలో న్యాయమూర్తులు తిరుమలలో గురువారం పలువురు న్యాయమూర్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈఓ అనిల్కుమార్సింఘాల్ ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ ధ్వజస్తంభానికి మొక్కుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కార్యదర్శి భాస్కర్ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. -
బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు
తిరుమల: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు కాటేజీ దాతలకు ఎలాంటి గదుల కేటాయించడం లేదని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 14న గరుడసేవ సందర్భంగా అక్టోబర్ 12 నుండి 14 వరకు కాటేజీ దాతలకు టీటీడీ ఎలాంటి గదుల కేటాయించదు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు టీటీడీ కేటాయించనుంది. ఒకే కాటేజీలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజుల పాటు కేటాయిస్తుంది. ఈ విషయాన్ని గమనించాలని కాటేజీ దాతలకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం ఆహ్వాన పత్రికను అందజేసిన టీటీడీ ఈవో సాక్షి, అమరావతి: తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంని కలిసిన సింఘాల్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు సంబంధించిన పలు అంశాలను ఆయన చంద్రబాబుకు వివరించారు. -
టీటీడీ విజిలెన్సు నివేదికలో ‘వజ్రం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందిన ఆభరణాల్లో రూ.వందల కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ ఉన్నట్లు విజిలెన్సు రికార్డులు చెబుతున్నాయి. 2008 జూలై 28న అప్పటి టీటీడీ చీఫ్ విజిలెన్సు అధికారి రమణకుమార్ బంగారు డాలర్ల గల్లంతుపై విచారణ జరిపి ఈవోకి అందజేసిన నివేదికలో దీని గురించి ప్రస్తావించారు. ఈ భారీ వజ్రం ముక్కలై ఉన్నట్లు ఆయన తన నివేదికలో పొందుపరిచారు. దీన్నిబట్టి చూస్తే మంగళవారం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్కుమార్సింఘాల్లు స్వామి వారి ఆభరణాల్లో అసలు వజ్రమే లేదని చెప్పిన మాటలు అబద్ధమని స్పష్టమవుతోంది.సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం వారు ఈ వ్యాఖ్యలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారికి ఉన్న భారీ వజ్రం ఒకటి దేశం దాటి పోయిందనీ, ఇటీవలే అది జెనీవాలో వేలానికి వచ్చిందని ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు డిసెంబరు 8న శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయనీ, నిధుల కోసమే ఇవి జరిగినట్లు దీక్షితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి తిరుమల ఆలయంలో గుట్టుగా నిధుల వేట జరుగుతోందనీ, రూ.కోట్ల విలువైన ఆభరణాలకు భద్రత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 16వ శతాబ్దంలో ఒక వజ్రం..: ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 16వ శతాబ్దంలో శ్రీవారికి ఒక విలువైన వజ్రం ఉండేది. పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన యాత్రికుడు జాక్వోస్ డీ కౌట్రే స్పానిష్ భాషలో రచించిన తిరుమల యాత్రా విశేషాల్లో ఈ వజ్రం గురించి వివరించాడని సుబ్రహ్మణ్యంరెడ్డి చెబుతున్నారు. కౌట్రే తిరుమల ఆలయాన్ని చూసి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు విలువైన ఆభరణాలు అలంకరించబడి ఉండటం, అందులో విలువైన వజ్రం ఉన్న వడ్డాణాన్ని చూసినట్లు పేర్కొన్నారని ప్రొఫెసర్ వివరించారు. నివేదికలో ఏముంది? 2008లో ఐదు గ్రాముల బరువున్న స్వామి వారి బంగారు డాలర్లు 300 పైగా గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో సీవీ ఎస్‌వోగా ఉన్న రమణకుమార్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి 2008 జూలై 28న ఈవోకి నివేదిక ఇచ్చారు. సదరు నివేదికలో గల్లంతైన డాలర్ల విలువ రూ.15.40 లక్షలుగా పేర్కొంటూ, కేసు వివరాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తన నివేదికలో పింక్ డైమండ్ గురించి పేర్కొన్నారు. కొన్నేళ్ల కిందట వందల కోట్ల విలువ గల ఈ వజ్రం ముక్కలైనట్లు గుర్తించామని వివరించారు. దీన్నిబట్టి చూస్తే శ్రీవారి ఆభరణాల్లో విలువైన వజ్రం ఉన్నట్లు విశదమవుతోంది. దీనికి చైర్మన్, ఈవోలు ఏం సమాధానం చెబుతారోనన్నది ఉత్కంఠగా మారింది. 16వ శతాబ్దం నుంచి ఏఏ ఆభరణాలు స్వామివారికి కానుకలుగా అందాయో చెప్పడమే కాకుండా వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచాలనీ, అప్పుడే టీటీడీ అధికారుల పారదర్శకత స్పష్టమవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. -
శ్రీవారి ఆభరణాలన్నీ భద్రమే
సాక్షి, తిరుపతి: శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వ జీవో ప్రకారమే అర్చకులకు 65 ఏళ్లకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగమశాస్త్రం ప్రకారమే కైంకర్యాలు, సేవలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలు... కైంకర్యాలను ప్రత్యక్ష ప్రసారాలు చేయటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపణలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శ్రీవారికి ప్రతిరోజు పెద్ద జియ్యంగార్, చిన్న జియ్యంగార్ ఆధ్వర్యంలోనే ఆగమోక్తంగా కైంకర్యాలు, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింక్ డైమండ్ కనిపించకుండా పోయిందని రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదే విషయమై 2010లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని స్పష్టం చేశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్ 16న ఇచ్చిన జీవో 1171, 2012 అక్టోబర్ 16న ఇచ్చిన జీవో నంబర్ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని ఈవో తెలిపారు. వయో పరిమితి కింద తొలగించిన వారి వారసులనే తిరిగి ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించిందన్నారు. అంతా ఆగమశాస్త్రం ప్రకారమే.. ఇటీవల పోటులో మరమ్మతులకు సంబంధించి ఆగమ సలహాదారులు ఎస్‌ఏకే సుందరవరదన్, తిరుమల పెద్ద జియ్యంగార్తో పాటు రమణæదీక్షితులను కూడా ముందుగా సంప్రదించినట్లు ఈవో తెలిపారు. ఆలయంలో సౌకర్యాల కోసం ఇలాంటి చిన్న, చిన్న మార్పులు చేపట్టడం సహజమేనన్నారు. శ్రీవారి కైంకర్యాలను ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే పరమావధిగా తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. -
శ్రీవారి ఆలయానికి హెర్బల్ సొబగులు
సాక్షి, తిరుమల: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన తిరుమలేశుని ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. సంప్రదాయ హెర్బల్ మిశ్రమాలతో ఆలయ ప్రాకారాలకు, మండపాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఆలయ రాతి ప్రాకారాలు, రాతి మండపాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మసి, పాచిని పోగొట్టి నిర్మాణాలకు సహజత్వం, వన్నె తీసుకొచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. మసిబారిన రాతి నిర్మాణాలు తిరుమల శ్రీవారి ఆలయం మండపాలు, ప్రాకారాలతో శోభిల్లుతోంది. అయితే ధూపదీప హారతి, అఖండ దీపారాధనలతో రాతి ప్రాకారాలు, రాతి మండపాలు పొగ, మసి అంటుకుని నల్లబారాయి. వీటితోపాటు వాతావరణ పరిస్థితులతో పాచి, దుమ్ము చేరింది. ఫలితంగా రాతి నిర్మాణాల అసలు రూపం మారిపోయి శిల్పకళా సౌందర్యం కళ తప్పింది. తమిళనాడు ఆలయాల్లో హెర్బల్ క్లీనింగ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఆలయాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆలయ రాతి ప్రాకారాలు, మండపాలకు సహజత్వాన్ని తీసుకొచ్చేందుకు సంప్రదాయ వనమూలికలు, విత్తనాల ఔషధ మిశ్రమాలను వినియోగిస్తోంది. ఇటీవల టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీరంగం క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన హెర్బల్ క్లీనింగ్‌ను పరిశీలించి టీటీడీ ఆలయాల్లోనూ ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ హెర్బల్ క్లీనింగ్ విధానాన్ని ముందు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో శ్రీవారి ఆలయంలోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. తొలుత మహాద్వారం ఎడమవైపున పనులు చేపట్టి హెర్బల్ మిశ్రమ లేపనంతో శుద్ధి చేశారు. నీటితో కడిగి, మళ్లీ లేపనం చేశారు. దీంతో రాతి ప్రాకారం సహజత్వంతో శోభాయమానంగా కనిపిస్తోంది. శుద్ధి చేయకముందు, చేసిన తర్వాత పనులను అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సహజత్వం కోల్పోకుండా.. తిరుమల ఆలయం రాతి ప్రాకారాలు, మండపాలు సహజత్వం కోల్పో కుండా హెర్బల్ క్లీనింగ్‌తో పనులు చేపట్టాం. ముందు గోవిందరాజస్వామి ఆలయంలో పనులు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే తిరుమలలోనూ ప్రారంభించాం. హెర్బల్ క్లీనింగ్‌తో ఆలయం మరింత సుందరంగా, శోభాయమానంగా దర్శనమిస్తుంది. – టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ -
రూ.2,900 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
సాక్షి, తిరుమల: 2017–18 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2,900 కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ రూ.2858 కోట్లుగా ఉంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ఈనెల 15 లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రస్తుతం టీటీడీకి ప్రజాప్రతినిధులతోకూడిన ట్రస్టుబోర్డు గానీ, సీనియర్ అధికారులతో కూడిన సాధికారిక మండలి కానీ లేకపోవడంతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సిద్ధం చేశారు. కాగా తిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు ముంబైకి చెందిన సాహూ అనే భక్తుడు రూ.11.11 కోట్లు విరాళం ఇచ్చాడు. దీన్ని డిసెంబర్ 26న ఇచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 2.73 కోట్ల మందికి శ్రీవారి దర్శనం: 2017 జనవరి 1నుంచి 2017 డిసెంబరు 31వ తేదీ వరకు మొత్తం 2.73 కోట్ల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 2016తో పోల్చితే (2.66 కోట్లు) భక్తుల సంఖ్య 2.7 శాతం పెరిగింది. హుండీ కానుకలు 2016లో 1,046.28 కోట్లు రాగా, 2017లో 995.89 కోట్లు లభించాయి. -
నమో.. తిరుమలేశా
సాక్షి, తిరుమల: విశ్వపతి వేంకటేశ్వరుడు బుధవారం గరుడునిపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకూ సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల.. వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నయ్ నూతన ఛత్రాలు(గొడుగులు) అలంకరించారు. అశేష జనవాహిని గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. ప్రారంభం నుంచి.. ముగిసే వరకూ వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునేలా టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు కోలాహలంతో సాగాయి. గురువారం శ్రీవారి స్వర్ణరథాన్ని (రథరంగ డోలోత్సవం) ఊరేగించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేగింపు ప్రారంభంకానుంది. గరుడోత్సవంలో గజరాజు హల్చల్ తిరుపతి మెడికల్: శ్రీవారి గరుడోత్సవంలో గజరాజు హల్చల్ చేసింది. మాడ వీధుల్లో కళాబృందాల ప్రదర్శనలో వాయిద్యాల చప్పుళ్లకు బెదిరిపోయింది. దీంతో ఆలయం ఎదుట ఉన్న గ్యాలరీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో మావటి గజరాజును అదుపుచేయడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఈవోగా వస్తానని ఊహించలేదు
► తిరుమల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి: మొదటి నుంచీ శ్రీవారి సేవకుడినే. 1994లో తొలిసారి స్వామివారిని దర్శించుకున్నా. అప్పటి నుంచీ ఎక్కడున్నా ఏటా స్వామివారి దర్శనానికి తిరుమల వస్తూనే ఉన్నా. అయితే..ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా స్వామికి సేవలందించే భాగ్యం, అదృష్టం కలుగుతుందని మాత్రం ఊహించలేదు అని తితిదే ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఈవో సింఘాల్ గురువారం తొలిసారి తిరుపతి పాత్రికేయులతో వివిధ ముఖ్యాంశాలపై ముచ్చటించారు. శ్రీవారి ప్రాశస్త్యం, భక్తులకు వసతులు, ప్రసాదాల పంపిణీ, యాత్రికులకు కల్పించే మెరుగైన సదుపాయాలు, రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో రోగులకు లభించే వైద్య సేవలపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి టీటీడీ బోర్డు నిర్ణయాలను గౌరవిస్తూ భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించడమే తన ముందున్న లక్ష్యంగా ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తాను తితిదేలో బాధ్యతలు చేపట్టేందుకు కాలినడకన తిరుమల చేరుకుని సాధారణ క్యూ లైన్లో దర్శనం చేసుకున్నాననీ, దీనివల్ల భక్తుల యాతనలు, అభిప్రాయాలు స్వయంగా తెల్సుకునే వీలు కలిగిందన్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు వెంటనే శ్రీవారి దర్శనం జరిగేలా కౌంటర్ల పనివేళల్లో మార్పులు తెచ్చి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులకు సిఫార్సు చేశామన్నారు. తనకన్నా ముందు పనిచేసిన ఈవోలందరూ టీటీడీ వృద్ధికి ఎంతో చేశారనీ, మిగిలిన పనులను పరిశీలించి భక్తులకు ప్రయోజనకరమని భావిస్తే వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాల పనులను పూర్తి చేయిస్తామన్నారు. తిరుపతి, తిరుమల వేర్వేరు కాదనీ, రెండు చోట్లా అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. దేశవిదేశాలు, సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకునే యాత్రికులకు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక మరుగుదొడ్లు, రవాణా సదుపాయాలు కల్పించే విషయంపై యోచిస్తున్నామన్నారు. స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షణ పెంచుతామని హామీ ఇచ్చారు. ఇష్టపడి ఆంధ్రా కేడర్‌కు... రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌కు వెళ్లాననీ, తర్వాత అడిగి మరీ ఆంధ్రాకు వచ్చినట్లు తెలిపారు. మొదట ఉట్నూరు, కోట రామచంద్రాపురం ఐటీడీఏలకు పీవోగా పనిచేసిన అనుభవం ఉందనీ, పరిపాలనతో కూడిన విధులకు, ఆధ్యాత్మిక భావన నిండిన తిరుమల ఈవో విధులకు పెద్ద తేడా ఏమీ ఉండదని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ పూర్తి చేసిన తాను 1993లో ఐఏఎస్‌లో రెండో ర్యాంక్ సాధించి సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యానని ఈవో అనిల్ కుమార్ తెలిపారు.